పెరిగిన అంతరాలు

ప్రపంచంలోని ఆర్థిక అంతరాలు, వాటి పర్యవసానాల గురించి అంతర్జాతీయ చారిటీ ట్రస్ట్ ‘ఆక్స్‌ఫామ్' ఏటా విడుదల చేసే నివేదిక ఈ సారి కరోనా నేపథ్యంలో భీతిగొలిపే విషయాలను వెల్లడించింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశమైన రోజునే ‘ఆక్స్‌ఫామ్' అనేక చేదు నిజాలను బయటపెట్టింది. కరోనా కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అంతరాలు ప్రమాదకర స్థాయిలో పెరిగిపోయాయని తెలిపింది. ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధా నాల మూలంగా ఇప్పటికే ఆర్థిక వ్యత్యాసాలు సర్వత్రా పెరిగాయి. కానీ కరోనా కష్టకాలంలో ఈ అంతరాలు మరింతగా పెరగడమే ఆశ్చర్యకరం. ఈ ఆర్థిక అసమానతలు పెరిగిపోతే సామాజిక అనిశ్చితి ఏర్పడుతుందనేది చారిత్రక సత్యం.
దేశదేశాల్లో విజృంభిస్తున్న కరోనాను ‘సోషలిస్ట్ వైరస్' అని కొందరు చమత్కరించారు. ప్రాంతం, లింగభేదం లేకుండా, ధనిక- పేద, తారతమ్యం లేకుండా అందరినీ పీడిస్తున్నదని ఈ విధంగా అభివర్ణించారు. కానీ లాక్డౌన్ కాలంలో ప్రపంచమంతా అతలాకుతలమై ప్రజలంతా జీవన్మరణ సమస్యలతో అల్లాడితే, కొద్దిమంది కుబేరులు మాత్రం తమ సంపదను మరింతగా పోగేసుకున్నారు. ప్రపంచవ్యాప్త పరిస్థితి ఎలా ఉన్నా, మన దేశంలో కరోనా తీవ్రంగా చెలరేగిన కాలంలో కోట్ల మంది జీవనోపాధి కోల్పోయారు. కానీ ఇదే సమయంలో ఒక బడా పారిశ్రామికవేత్త సంపాదన గంటకు 90 కోట్లు. ఆయన ఒక సెకనులో పొందే ఆదాయం కోసం సాధారణ కార్మికుడు మూడేండ్లు కష్టపడాల్సి ఉంటుంది. దేశంలోని వందమంది కుబేరుల వద్ద 12,97,822 కోట్ల మేర అదనపు సంపద పోగుపడింది. దీన్ని దేశంలోని నిరుపేదలైన 13.8 కోట్ల మందికి ఒక్కొక్కరికి 94 వేల చొప్పున పంపిణీ చేయవచ్చు.
కొవిడ్ మహమ్మారితో తలెత్తిన సామాజిక, ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దటం కోసం దేశాలన్నీ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలతో ప్రజలను ఆదుకోవాలని కొన్ని నెలల కిందటే ఐఎంఎఫ్ సూచించింది. పేదలను ఆదుకోనట్టయితే సామాజిక అశాంతి నెలకొని విపరీత పరిణామాలు సంభవిస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే అనేక దేశాలు ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించాయి. మన దేశంలోనూ ఆత్మనిర్భర్ పథకం పేర 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇందులో పేదలకు అందినవి రెండు లక్షల కోట్లేనని తెలుస్తున్నది. కరోనా నేపథ్యంలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితిని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు చేపట్టాలె. భారీగా దెబ్బతిన్న వ్యాపారరంగం గాడిన పడాలన్నా, ప్రజల కొనుగోలుశక్తి పెంచడం అవసరం. పేదలకు ఆర్థిక తోడ్పాటు అందించడానికి ప్రత్యేక విధానాలను అమలుచేయాలి. రాష్ర్టాల సంక్షేమ పథకాలు సజావుగా సాగేవిధంగా సహకరించాలి.
తాజావార్తలు
- అందరూ లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్ అంటున్నరన్న..జాతిరత్నాలు ట్రైలర్
- వీడియో : కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోండిలా...
- బార్ కౌన్సిల్ లేఖతో కేంద్రం, టీకా తయారీదారులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
- ముగిసిన తొలి రోజు ఆట..భారత్‌దే ఆధిపత్యం
- 22.5 కేజీల కేక్, భారీగా విందు.. గ్రాండ్‌గా గుర్రం బర్త్ డే
- అంగన్వాడీల గౌరవాన్ని పెంచిన టీఆర్ఎస్ ప్రభుత్వం
- గిలానీ షాకింగ్ విక్టరీ.. విశ్వాస పరీక్షకు ఇమ్రాన్ ఖాన్
- బెంగాల్ పోరు : 11న నందిగ్రాంలో మమతా బెనర్జీ నామినేషన్
- ఆధార్ నంబర్ మర్చిపోయారా? ఇలా తెలుసుకోండి
- ఓట్లు అడిగే హక్కు టీఆర్ఎస్కే ఉంది : మంత్రి వేముల