సోమవారం 30 మార్చి 2020
Editorial - Mar 12, 2020 , 23:46:10

దుర్మార్గుడికి శిక్ష

దుర్మార్గుడికి శిక్ష

మీ టూ ఉద్యమం వల్ల మహిళలపై లైంగికదాడులు ఆగిపోతాయా? సమాజం మారిపోయిందా అనే ప్రశ్నలు కొందరిలో తలెత్తవచ్చు. హాలీవుడ్‌లో కూడా వేధింపులు, లోబరుచుకోవడం ఇక ముందు కూడా ఉండవచ్చు. కానీ మీ టూ ప్రభావం అసలే లేకుండా పోదు. అవకాశం దొరికిన వెంటనే మహిళలను వేధించడం మునుపటంత యథేచ్ఛగా సాగదని చెప్పవచ్చు. హాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు తమ ప్రాభవాన్ని కోల్పోవడానికి ఈ ఉద్యమం కారణమైంది. ఒక్క అమెరికాలోనే కాదు, ప్రపంచమంతటా, ఒక్క హాలీవుడ్‌లోనే కాదు అన్నిరంగాల్లో మహిళలను వేధిస్తే ఏ క్షణాన్నయినా అది బయటపడి మెడకు చుట్టుకోవచ్చుననే భయం కీచకుల్లో వ్యాపించింది.

దశాబ్దాల పాటు దాదాపు వంద మంది మహిళలపై లైంగికదాడికి పాల్పడిన హాలీవుడ్‌ దిగ్గజం వెయిన్‌స్టీన్‌కు రెండు కేసులలో 23 ఏండ్ల జైలు శిక్ష పడటంతో, ‘తొడలు విరిగిపడిన దుర్యోధనుడి’లా ఆయన దీనాలాపన చేసిన దృశ్యాన్ని ప్రపంచమంతా గమనించింది. మాజీ ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌ మిమి హలేయిపై లైంగికదాడి జరిపినందుకు, ఒకప్పటి వర్ధమాన నటి జెస్సికా మాన్‌పై లైంగికదాడికి పాల్పడినందుకు ఆయన 67 ఏండ్ల వయసులో జైలుశిక్ష అనుభవించవలసి వస్తున్నది. ఈ కేసులో వెయిన్‌స్టీన్‌ అప్పీలు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, అపర కీచకుడిగా ఆయనపై పడిన ముద్ర మాత్రం చెరిగిపోనిది. 2017 అక్టోబర్‌లో లైంగికదాడుల ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయనను చలనచిత్ర కళలు, శాస్ర్తాల అకాడమీ నుంచి బహిష్కరించారు. ఇప్పుడు పడిన జైలుశిక్షే కాకుండా మరికొన్ని కేసుల్లో విచారణ సాగుతున్నది. ఆయన బారిన పడిన వారిలో ప్రము ఖ తారామణులు కూడా ఉన్నారు. వెయిన్‌స్టీన్‌ మహిళల పట్ల అత్యంత హీనంగా వ్యహరిస్తారని బహిరంగంగానే చెప్పుకునేవారు. టాక్‌ షోలలో మహిళలు ఆయన హోటల్‌ గదికి పిలిస్తే వెళ్ళవద్దంటూ హాస్యోక్తులు విసిరిన సందర్భాలున్నాయి. ఇంత నిర్లజ్జగా వ్యవహరించినా ఆయనపై ఏ ఒక్కరూ ధైర్యంగా నేరారోపణ చేయలేకపోయారు. హాలీవుడ్‌లో అగ్రశ్రేణి నిర్మాత అయిన వెయిన్‌స్టీన్‌ను ఎదిరించడమంటే తమ సినీ జీవితానికి చరమగీతం పాడినట్టేననే అభిప్రాయం ఉండేది. కానీ అనూహ్యరీతిలో ఒక్కొక్కరూ బయటకువచ్చి తాము అనుభవించిన క్షోభను వెళ్ళబోసుకోవడంతో వెయిన్‌స్టీన్‌ లీలలు సీరియల్‌ కథనంలా బయటకువచ్చాయి. తానెవరిపైనా లైంగికదాడి జరుపలేదని, వారి సమ్మతితోనే జరిగిందంటూ ఆయన చేసుకున్న సమర్థింపును ఎవరూ నమ్మడం లేదు.

తనపై వచ్చిన ఆరోపణలు ప్రచురితం కాకుం డా నిరోధించడానికి, ఆరోపణలు చేసే వారి నోరు నొక్కడానికి వెయిన్‌స్టీన్‌ ప్రైవేటు డిటెక్టివ్‌లను ఉపయోగించుకున్న తీరు కూడా బయటపడ్డది. తనపై ఆరోపణలు చేసే పాత్రికేయులు, మహిళల గతాన్ని తవ్వితీసి వారిని ఇబ్బందులు పెట్టడానికి ఆయన ప్రయత్నించాడు. కానీ తనపై వచ్చిన ఆరోపణల తీవ్రత ముందు నిస్సహాయుడైపోయాడు. వెయిన్‌స్టీన్‌ బాధితులే కాదు, ఇతరత్రా వేధింపులకు గురైనవారు కూడా తమ గోడు వెల్లడించడంతో ‘మీ టూ’ ఉద్యమం మొదలై ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. దాదా పు ఎనభై ఐదు దేశాల్లో మహిళలు ముందుకు వచ్చి తాము అనుభవించిన వేధింపులను ధైర్యంగా వెల్లడించడం మొదలుపెట్టారు. దీంతో ఆయా సంస్థల్లో వేధింపులను అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకోక తప్పలేదు. యురోపియన్‌ పార్లమెంటు కూడా వేధింపులపై చర్చ జరుపవలసి వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం- ప్రపంచవ్యాప్తం గా మూడో వంతు మహిళలు వేధింపులకు గురవుతున్నారు. 54 శాతం మహిళలు అవాంఛనీయమైన చేష్టలను ఎదుర్కొంటున్నట్టు 2017 లో అమెరికాలోని ఒక వార్తా చానెల్‌, ఒక పత్రిక జరిపిన సర్వేలో తెలిసింది. 95 శాతం ఉదంతాల్లో దోషులకు శిక్ష పడటం లేదు. మహిళలను వేధిస్తుంటే మిగిలిన మగవారు చూస్తూ ఊరుకోకుండా, జోక్యం చేసుకోవాలనే అభిప్రాయాన్ని కూడా ఈ ఉద్యమం కలుగచేసింది. లైంగిక బాధితులు ఒంటరివారు కాదనీ, వేధింపులను బయటపెట్టడానికి సిగ్గుపడవలసిందేమీ లేదనీ ఒక ఉద్యమకారిణి ఎలుగెత్తి చాటారు. సాధారణంగా మహిళలపై వారికి తెలిసిన వారే వేధింపులకు దిగుతుంటారు. అందువల్ల నిర్భయంగా తిరస్కరించడాన్ని మహిళలకు చిన్నప్పటినుంచే అలవాటుచేయాలని ఆమె సూచించారు.

మీ టూ ఉద్యమం వల్ల మహిళలపై లైంగికదాడులు ఆగిపోతాయా? సమాజం మారిపోయిందా అనే ప్రశ్నలు కొందరిలో తలెత్తవచ్చు. హాలీవుడ్‌లో కూడా వేధింపులు, లోబరుచుకోవడం ఇక ముందు కూడా ఉండవచ్చు. కానీ మీ టూ ప్రభావం అసలే లేకుండా పోదు. అవకాశం దొరికిన వెంటనే మహిళలను వేధించడం మునుపటంత యథేచ్ఛగా సాగదని చెప్పవచ్చు. హాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు తమ ప్రాభవాన్ని కోల్పోవడానికి ఈ ఉద్యమం కారణమైంది. ఒక్క అమెరికాలోనే కాదు, ప్రపంచమంతటా, ఒక్క హాలీవుడ్‌లోనే కాదు అన్నిరంగాల్లో మహిళలను వేధిస్తే ఏ క్షణాన్నయినా అది బయటపడి మెడకు చుట్టుకోవచ్చుననే భయం కీచకుల్లో వ్యాపించింది. వేధింపులకు గురైన మహిళలు ముందుకువచ్చి చెప్పగలిగే మానసిక ైస్థెర్యాన్ని కూడా ఈ ఉద్యమం ఇవ్వగలిగింది. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మహిళలు తమ దైన్యాన్ని ప్రపంచం దృష్టికి తేవడానికి మీ టూ ఉద్యమం దోహదపడ్డది. అన్నిరంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగిపోతున్న తరుణంలో వారికి తగిన భద్రత కల్పించవలసిన బాధ్యత సమాజం మీద ఉన్నది. ‘మహిళలపై వేధింపులు’ చర్చానీయాంశమైంది. మహిళలను గౌరవించాలనే భావనను సమాజంలో ప్రోది చేయగలిగినపుడు మాత్రమే ఈ సమస్యకు అసలైన అంతిమ పరిష్కారం లభిస్తుంది.


logo