బుధవారం 28 అక్టోబర్ 2020
Editorial - Sep 30, 2020 , 03:32:04

విశ్వాసమే ప్రధానం

విశ్వాసమే ప్రధానం

తెలంగాణలోని రైతులు రాష్ట్ర ప్రభుత్వ విధానాల పట్ల హర్షామోదాలు వ్యక్తం చేస్తూ ఉంటే, దేశవ్యాప్తంగా మాత్రం మోదీ ప్రభుత్వ నిర్ణయాల పట్ల ఆందోళన చెలరేగుతున్నది. భారత్‌ బంద్‌ అంటూ వివిధ రాష్ర్టాలలో నిరసనలు పెల్లుబుకాయి. రాజధాని ఢిల్లీలోకి రైతులు ప్రవేశించకుండా పోలీసులు కట్టడి చేయవలసిన పరిస్థితి! రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానంటూ 2014 ఎన్నికల సందర్భంగా మోదీ ప్రచారం సాగించారు. కానీ ఆయన అధికారం చేపట్టిన మొదటి రెండేండ్లలోనే దేశవ్యాప్తంగా నిరసనలు 700 శాతం పెరిగాయని అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌ తదితర రాష్ర్టాల్లో నిరసనలు జోరందుకోవడంతో పాటు మధ్యప్రదేశ్‌లో పరిస్థితి విషమించి రైతులపై కాల్పులు జరిగాయి. మోదీ ప్రభుత్వం రెండవసారి అధికారానికి వచ్చిన తర్వాత రైతుల కోసం అంటూ పార్లమెంట్‌లో బిల్లులు ప్రవేశపెట్టగానే నిరసనలు మళ్లీ భగ్గుమన్నాయి. మోదీ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని కార్పొరేట్‌ సంస్థల చేతిలో పెడుతున్నదనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బిల్లులు మంచివా చెడ్డవా అనే చర్చ ఎట్లా ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వాన్ని రైతులు నమ్మడం లేదనేది గమనార్హం. విశ్వాస రాహిత్యాన్ని ఎదుర్కొనడం అన్నింటికన్నా పెద్ద ప్రమాదం.

తెలంగాణలో ఇందుకు భిన్నమైన పరిస్థితి. సీఎం కేసీఆర్‌పై రైతులకు ప్రగాఢ విశ్వాసం నెలకొన్నది. ప్రజలు కేసీఆర్‌ను ఎంతగా నమ్ముతున్నారంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏ పంట వేయమంటే అదే వేస్తున్నారు. గత ఆరేండ్ల పాలనలో కేసీఆర్‌ సాధించిన ఘన విజయం ఇది. మొత్తం సమాజ శ్రేయస్సుతో పాటు రైతు సంక్షేమం కోసం కేసీఆర్‌ సాగించిన అవిశ్రాంత కృషికి దక్కిన ఫలం ఇది. ఒకప్పుడు విత్తనాలు కావాలంటే లాఠీ దెబ్బలు తినవలసిన పరిస్థితి. పెట్టుబడి ఖర్చులు ఇవ్వడమే కాకుండా, కరోనా సమయంలో ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేసినా తమ కోసమేనని, ఏ కష్టమొచ్చినా తమకు అండగా ఉంటుందని తెలంగాణ రైతులు ధీమాగా ఉన్నారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభు త్వం ఇంతగా కృషిచేస్తుంటే, కేంద్రం ఏ మాత్రం సహాయం అందించలేదు.

దేశంలో వ్యవసాయ సంక్షోభం ఆవరించిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత లోక్‌సభ ఎన్నికల ముందే పసిగట్టారు. మోదీ మళ్లీ అధికారానికి వస్తే, కేంద్ర పెత్తనం పెరుగుతుందని, రాష్ర్టాల హక్కులకు విఘాతం కలుగుతుందని కూడా గ్రహించారు. అందుకే వ్యవసాయ విధానం, సమాఖ్యతత్తం ప్రధానాంశాలుగా ఉమ్మడి అజెండాతో రాజకీయపక్షాలు, రైతు సంఘాలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. కానీ ఈ విజ్ఞత కాంగ్రెస్‌కు కానీ, మిగతా పార్టీలకు కానీ లేకపోయింది. ఈ రాజకీయ నాయకుల బాధ్యతారాహిత్య ఫలితాన్ని దేశం ఇప్పుడు అనుభవిస్తున్నది. ప్రభుత్వాలను ప్రజలు నమ్మలేని ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికైనా దేశ సమస్యల పరిష్కారం కోసం రాజకీయపక్షాలు సమష్టి కృషి జరపడం అలవరచుకోవాలి. కేసీఆర్‌ విధానాలను స్ఫూర్తిగా తీసుకోవాలి.


logo