‘కల్పనాతీతమౌ కమనీయ శిల్పమును.. వేయి కంబాలలో వెలయించి మించినది.. అడుగడుగు శిల్పాలురా.. తెలగాణ ఆలయపు శిఖరాలురా! వర్ణ సహజత్వమున వన లతల మరపించు.. లాలిత్య రేఖా విలాసాల చిత్రణలు.. ఆనాటి చిత్రాలురా.. తెలగాణ ఆలయపు కుడ్యాలురా!’ – తెలంగాణలోని మహాద్భుత శిల్ప సంపద గురించి 77 ఏండ్ల కింద 1944లో రావెళ్ల వెంకట రామారావు రాసిన పంక్తులివి. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప ఆలయం గుర్తింపు సాధించడం తెలంగాణ స్వర్ణయుగ ఆవిర్భావానికి సంకేతం. శిల్ప నాట్యాది కళలు, భవన నిర్మాణాది విజ్ఞాన శాస్ర్తాలు, భక్తి, శృంగారాది రసాలు, ఇతిహాస ఘట్టాలు, జీవన శైలులు – ఒక్కటేమిటి నాటి సమాజ వికాసాన్ని భిన్న కోణాల్లో ప్రదర్శించిన, మానవ జీవితంలోని సకల పార్శాలను ఆవిష్కరించిన రామప్ప మన తెలంగాణకు, భారత భూమికే కాదు, ప్రపంచానికే ఘనమైన వారసత్వ సంపద.
13వ శతాబ్దం నాటికే తెలంగాణలో వర్ధిల్లిన సముజ్వల నాగరికతకు రామప్ప సమున్నత సంకేతం. నీళ్లలో తేలియాడే ఇటుకలు, భూ ప్రకంపనలకు తట్టుకునే రీతిలో ఇసుక పునాదిపై (సాండ్ బాక్స్ టెక్నాలజీతో) నిర్మాణం, 800 ఏండ్లు గడిచినా ఇప్పుడే తయారుచేశారా అన్నంత నునుపుగా ఉండే మనోజ్ఞ శిల్పసంపద! ‘పేరిణి’ నృత్య భంగిమలను నాటి శిల్పులు ఆలయ కుడ్యాలపై చెక్కితే, నటరాజ రామకృష్ణ వాటిని అధ్యయనం చేసి మళ్ళీ ఆ నాట్యరీతిని పునరుద్ధరించడం అబ్బుర పరిచే విషయం. శిల్పాల ద్వారా గతంతో సంభాషించడం ఊహాతీతం. ఎత్తుమడమల పాదరక్షలు, అల్లికలున్న వస్త్రం నాటి ఫ్యాషన్లను మనముందుంచితే.. పర్షియన్ను పోలిన శిల్పం సరిహద్దులు దాటిన మానవ సంబంధాలకు నిదర్శనం. ఆలయాన్ని నిర్మించినవారి పేరిటగాక, ఇంతటి సౌందర్యభాండాగారాన్ని సృజించిన ప్రధాన శిల్పి రామప్ప పేరిట ఈ ఆలయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవటం తెలంగాణ సమాజంలోని ప్రజాస్వామ్య సంస్కృతికి సంకేతం.
రామప్ప ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు ఆషామాషీగా రాలేదు. దీని వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో రాష్ట్రప్రభుత్వం ఏడేండ్లుగా జరిపిన అవిరళ కృషి ఉంది. కేంద్రప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఆలయ విశిష్టత వివరాలను అందించటం, వాటిని అంతర్జాతీయ వేదికలపై సరైన రీతిలో సమర్పించేలా చూడటం, నిపుణుల సూచనల మేరకు యునెస్కో ప్రమాణాలకు అనుగుణంగా ఆలయం ప్రాంగణంలో, పరిసరాల్లో చర్యలు చేపట్టటం – వీటన్నింటివల్లే ఈ గుర్తింపును సాధించుకున్నాం. వలస పాలనపై గెలిచి నిలిచిన తెలంగాణ సాధించిన మహోన్నత సాంస్కృతిక విజయమిది. ఇక ముందు కూడా తెలంగాణ నలుచెరుగులా ఉన్న చారిత్రక సంపసదకు విశ్వవ్యాప్త గుర్తింపు తేవడానికి, సకల రంగాలలో తెలంగాణ విజయ యాత్రను కొనసాగించడానికి సమష్టిగా కృషి సాగిద్దాం.