e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home సంపాదకీయం క్యూబాలో ప్రజా ఉద్యమం

క్యూబాలో ప్రజా ఉద్యమం

క్యూబాలో ప్రజా ఉద్యమం

‘స్వేచ్ఛ’, ‘ఐక్యత’, ‘ఇక మీ నిరంకుశత్వం చాలు’ అనే నినాదాలతో క్యూబా రాజధాని హవానా ఆదివారం దద్దరిల్లింది. కొన్ని వేల గొంతులు ఆ నినాదాలతో జతకలిశాయి. కమ్యూనిస్టు రాజ్యమైన క్యూబాలో ఇటువంటి దృశ్యం చాలా అరుదు. 1994లో ఆ దేశంలో నాడు నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై భారీ ఎత్తున ప్రజలు నిరసనలు తెలిపారు. మళ్లీ 27 ఏండ్ల తర్వాత అటువంటి ఆందోళనలు క్యూబాలో ఆదివారం కనిపించాయి. ఓవైపు కరోనా మహమ్మారి వ్యాపిస్తుండటం, మరోవైపు.. ఆకాశానికి చేరుకున్న ధరలు ప్రజల నిరసనకు తక్షణ కారణాలుగా కనిపిస్తున్నాయి. ‘నిత్యావసరాల కొరత, క్యూ లైన్లలో నిలబడటంతో మేం పూర్తిగా విసిగిపోయి ఉన్నాం. అందుకే నేనిక్కడ ఉన్నా’నంటూ నిరసనల్లో పాల్గొన్న ఓ మధ్యవయస్కుడు చెప్పాడు. ఈ నిరసనలకు పోటీగా ప్రభుత్వ అనుకూల ప్రదర్శనలు కూడా హవానాలో జరిగాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను కొన్ని గంటలపాటు ప్రభుత్వం నిలిపివేసింది.

తమ దేశంలో పెల్లుబికిన ఈ ప్రజాగ్రహాన్ని అమెరికా కుట్రగా క్యూబా అధ్యక్షుడు మిగెల్‌ డియాజ్‌ కనెల్‌ ఆరోపించారు. మరోవైపు క్యూబన్ల నిరసనలకు అమెరికా ‘సహజంగానే’ మద్దతు ప్రకటించింది. దశాబ్దాల నిరంకుశ పాలన నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, కరోనా మహమ్మారి నుంచి విముక్తి కోసం పోరాడుతున్న క్యూబా ప్రజలకు అండగా ఉంటామని ఆ దేశాధ్యక్షుడు బైడెన్‌ ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి కూడా ఈ అంశంపై స్పందిస్తూ- ప్రజల భావవ్యక్తీకరణ స్వేచ్ఛను, శాంతియుతంగా సమావేశాలు జరుపుకొనే హక్కును గౌరవించాలని క్యూబా సర్కారుకు సూచించింది. క్యూబాపై అమెరికా కొన్ని దశాబ్దాలుగా ఆంక్షలను అమలు చేస్తున్నది. ట్రంప్‌ హయాంలో ఇవి మరింత కఠినతరం అయ్యాయి. ఔషధాలు, వైద్యసంబంధిత ఉపకరణాలకు కూడా కొరత ఏర్పడటంతో క్యూబాకు ఇన్నాళ్లూ గర్వకారణంగా ఉన్న ఆరోగ్యరంగం తీవ్రంగా దెబ్బతిన్నది. దవాఖానలనే మూసేయాల్సిన పరిస్థితి తలెత్తింది.

- Advertisement -

అమెరికా ఆంక్షలకు తోడు కరోనా వ్యాపించడం వల్ల పరిస్థితి మరింత దిగజారింది. దీనికితోడు ఆర్థిక సంక్షోభం కూడా తలెత్తి ధరలు విపరీతంగా పెరిగాయి. ఆహార కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే క్యూబన్లు వీధుల్లోకి వచ్చి అధ్యక్షుడు గద్దె దిగాలంటూ నినదిస్తున్నారు. ఒకప్పుడు ప్రజలు సామాజిక ఆర్థిక మార్పును కోరుతూ, సామ్రాజ్యవాద వ్యతిరేకతతో కమ్యూనిస్టు పార్టీలకు పట్టం కట్టారు. కానీ కాలక్రమేణ కమ్యూనిస్టు రాజ్యాలు ఏకపార్టీ నిరంకుశ వ్యవస్థలుగా మారినవనే విమర్శ కూడా ఉన్నది. ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దడంతోపాటు, ప్రజల కనీస హక్కులకు హామీ ఇచ్చే ప్రజాస్వామ్య వ్యవస్థను క్యూబాలో నెలకొల్పవలసి ఉన్నది. ఈ ఉద్యమం ఎటువంటి మార్పులు తెస్తుందో వేచి చూడాల్సిందే.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
క్యూబాలో ప్రజా ఉద్యమం
క్యూబాలో ప్రజా ఉద్యమం
క్యూబాలో ప్రజా ఉద్యమం

ట్రెండింగ్‌

Advertisement