e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home సంపాదకీయం తాలిబన్‌తో సంభాషణ

తాలిబన్‌తో సంభాషణ

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ప్రాబల్యం వేగంగా విస్తరిస్తుండటంతో భారత్‌ అప్రమత్తమైంది. కాబూల్‌తో పాటు ఇతర నగరాల నుంచి మన ఉద్యోగులను, ఇతర పౌరులను ఖాళీ చేయించాలని నిర్ణయించింది. మన దేశానికి కాబూల్‌లో రాయబార కార్యాలయాలతోపాటు మరో నాలుగు నగరాలలో దౌత్య కేంద్రాలున్నాయి. పలుచోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతున్నందున ప్రైవేటు సంస్థల ఉద్యోగులు కూడా ఉన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ సైనిక సిబ్బందికి మనవారు శిక్షణ ఇస్తున్నారు. ఉద్రిక్తతలు పెరుగుతున్నందువల్ల వీరిని సురక్షితంగా తీసుకురావలసి ఉన్నది. కొన్ని దేశాలు ఇప్పటికే తమ దౌత్య కార్యాలయాలను మూసివేశాయి లేదా సిబ్బందిని భారీగా తగ్గించుకున్నాయి. తాలిబన్లతో మన దేశానికి మొదటినుంచి ఉద్రిక్త సంబంధాలున్న నేపథ్యంలో సత్వరం మన పౌరులను తరలించడం మంచిది.

దాదాపు ఏడాదిన్నర కిందట అమెరికా-తాలిబన్‌ ఒప్పందం కుదిరిన నాటినుంచి ఆఫ్ఘనిస్థాన్‌ పరిస్థితి మారిపోయింది. చైనా, రష్యా, ఇరాన్‌, పాకిస్థాన్‌ మొదలైన దేశాలు పావులు కదుపుతున్నాయి. ఇటీవలే తాలిబన్లకు, ఆఫ్ఘనిస్థాన్‌ ప్రభుత్వానికి మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తాననే సందేశం చైనా పంపింది. ఈ నేపథ్యంలో భారత్‌ కూడా గత నెలలో ఖతార్‌ మధ్యవర్తిత్వం ద్వారా దోహాలో తాలిబన్లతో లోపాయికారి సంప్రదింపులను ప్రారంభించింది. భారత్‌ మొదటినుంచి తాలిబన్ల వ్యతిరేక వైఖరిని అనుసరిస్తున్నందువల్ల సయోధ్య కుదరడం కొంచెం కష్టమే. అయితే గతాన్ని వదిలిపెట్టి అంతర్జాతీయ సంబంధాలను కొత్తగా నిర్మించుకోవాలని భావిస్తున్నట్టు తాలిబన్లు సంకేతాలిస్తున్నారు. ఒకప్పుడు పాకిస్థాన్‌ పెంచిపోషించిన సున్నీ పష్టు జాతీయులతో కూడిన తాలిబన్‌ వేరు. ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌లోని అన్ని జాతులతో కూడిన తాలిబన్లు ఉగ్రవాద పోకడలను వదులుకొని అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఉంటామని చెబుతున్నారు.

- Advertisement -

తాలిబన్లు ఎంత మారినా వారి కరడుగట్టిన మత దృక్కోణంలో పెద్దగా మార్పు ఉండదు. ఉగ్రవాదులను నేరుగా ప్రోత్సహించనప్పటికీ, ఆఫ్ఘనిస్థాన్‌లో వారు అధికారాన్ని చేపట్టడం వల్ల ఇతర దేశాలలోని ఉగ్రవాదులు ప్రేరణ పొందుతారు. పాకిస్థాన్‌ అనుకూల తాలిబన్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నది. ఈ ప్రభావం కశ్మీర్‌పై పడకుండా మనదేశం జాగ్రత్తలు తీసుకోవాలి. నాటో దేశాల తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌ పునర్నిర్మాణానికి ఎక్కువగా పెట్టుబడులు పెట్టింది మన దేశమే. అందువల్ల కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం చర్చలు జరిగే సందర్భంగా మన దేశం తెరవెనుక ఉంటూనే క్రియాశీలంగా వ్యవహరించాలి. తాలిబన్ల ఏకచ్ఛత్రాధిపత్యం నెలకొనకుండా, అన్ని వర్గాల భాగస్వామ్యంతో ప్రజాస్వామిక స్వభావం గల ప్రభుత్వం నెలకొనేలా ప్రయత్నించాలి. భావసారూప్య శక్తులు అధికారంలో ఉంటే మన దేశానికి ప్రయోజనకరం.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana