e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home ఎడిట్‌ పేజీ అరుణుడిపై గిరికీలు!

అరుణుడిపై గిరికీలు!

అరుణుడిపై గిరికీలు!


అంగారక గ్రహంపై హెలికాప్టర్‌ను ఎగిరించడం ద్వారా మానవుడు తన వైజ్ఞానిక శక్తియుక్తులను మరోసారి చాటుకున్నాడు. అరుణ గ్రహంపై హెలికాప్టర్‌ గిరికీలు కొట్టింది కొన్ని సెకనులే కావచ్చు. కానీ దానిని ఒకప్పుడు రైట్‌ సోదరులు విమానాన్ని ఎగిరించిన అద్భుతంతో శాస్త్రవేత్తలు పోలుస్తున్నారు. ఎంత గొప్ప శాస్త్రవేత్తలైనా ప్రకృతి విధించిన పరిమితులలోనే తమ విన్యాసాలు చేయవలసి ఉంటుంది. సమాచారం ప్రసారం ఎంత వేగంగా సాగినా కాంతి వేగాన్ని మించలేదు. భూమి మీద ఈ వేగం గొప్పదే కానీ, గ్రహాంతరాలలో పరికరాలకు ఆదేశాలు ఇవ్వడానికి కొన్ని నిమిషాలు పడుతుంది. అందువల్ల భూమిపై నుంచి ఇచ్చే ఆదేశాలతో నిమిత్తం లేకుండా స్వయంగా, నిర్దేశిత రీతిలో ప్రయాణించే విధంగా ఈ హెలికాప్టర్‌ను రూపొందించారు. అంగారకుడిపై వాతావరణం నుంచి ఆక్సిజన్‌ను విడదీసి సేకరించడం కూడా అద్భుతమే. దీనివల్ల భవి ష్యత్తులో ఇతర గ్రహోపగ్రహాలపై శిబిరాలు వేసుకొని అక్కడి ఆక్సి జన్‌నే ఉపయోగించుకోవచ్చనే ఆశాభావం కలుగుతున్నది.

చంద్రతలమైనా, అంగారకుడైనా ఇప్పటివరకు జరిగిన పరిశీలన నేలపై పాకే రోవర్ల ద్వారానే జరిగింది. రోవర్ల ద్వారా ఎత్తువంతులలో తిరుగుతూ పరిశీలించడం సాధ్యం కాదు. ఈ హెలికాప్టర్‌ ప్రయోగం విజయవంతం అయినది కనుక, భవిష్యత్తులో డ్రోన్లు కొండలను, కోనలను గద్దలా తిరుగుతూ పరీక్షించవచ్చు. బృహస్పతి గ్రహం చంద్రులలో ఒకటైన టైటాన్‌పై పరిశోధనలను డ్రాగన్‌ ఫ్లై పేర ఒక అంతరిక్ష నౌకను 2027లో పంపబోతున్నారు. నీరు, మంచుతో కర్బనమయమైన టైటాన్‌ గోళంపై పుష్కలంగా నీరు ఉన్నది. జీవం పుట్టుకకు సంబంధించిన గుట్టును విప్పడానికి ఇక్కడి పరిశోధనలు ఉపకరించవచ్చు. అందువల్ల శాస్త్రవేత్తలకు ఇక్కడ రోటార్‌క్రాఫ్ట్‌తో భారీ పరిశోధనలు జరపబోతున్నారు. ఈ పరిశోధనలకు అంగారకుడిపై హెలికాప్టర్‌ చేపట్టిన గిరికీలే దారి చూపుతాయి. ఇత

సమాజ హితానికి ఎంతగా ఉపయోగకరమైనదీ అనేదే ఏ పరిశోధనకైనా గీటురాయి. కొన్ని సెకనుల పాటు తిరిగే హెలికాప్టర్లు నిర్మించడానికి శాస్త్రవేత్తలు సుమారు ఆరేండ్లు శ్రమించారు. ఇందుకు 85 మిలియన్‌ డాలర్లు ఖర్చయ్యాయి. దీనివల్ల సమాజానికి ఉపయోగమేమిటి అనే ప్రశ్న తలెత్తడం సహజం. కానీ పరిశోధనా ఫలాలను ప్రత్యక్షంగా కాకున్నా, పరోక్షంగానైనా మానవాళికి అనుభవిస్తూనే ఉంటుంది. ఎంఆర్‌ఐ పరీక్షలు మొదలుకొని సెల్‌ఫోన్‌ కెమెరాల వరకు అనేక రీతులలో అంతరిక్ష పరిజ్ఞానం ఉపయోగపడుతున్నది. అంతరిక్ష పరిశోధనే లేకపోతే ఇవాళ వాహనాలు, ఫోన్లలో జీపీఎస్‌ వ్యవస్థనే ఉండకపోయేది. వాతావరణ పరిశోధన, తుఫాన్లను ముందుగా పసిగట్టడం కూడా అంతరిక్ష పరిశోధనలో ముందడుగు వేసిన ఫలితమే. పరిశోధనా పిపాసే మానవ జీవనాన్ని సుఖవంతం చేస్తున్నది, చరిత్రను నడిపిస్తున్నది, మలుపులు తిప్పుతున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అరుణుడిపై గిరికీలు!

ట్రెండింగ్‌

Advertisement