e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 17, 2021
Home సంపాదకీయం పర్యాటకానికి పునరుజ్జీవం

పర్యాటకానికి పునరుజ్జీవం

‘… తీర్థ యాత్రాచణ శీలినై జనపదంబులు, పుణ్య నదీనదంబులున్‌/ జూచితినందునందు గల చోద్యములున్‌ గనుగొంటినా పటీ/ రాచల పశ్చిమాచల హిమాచల పూర్వ దిశాచలంబుగన్‌’ అంటూ మను చరిత్రలో ప్రవరాఖ్యుడికి సిద్ధుడు తన యాత్రా విశేషాలను వివరిస్తాడు. అక్కడితో ఆగకుండా ‘కేదారేశు భజించితిన్‌ శిరమునన్‌ గీలించితిన్‌ హింగుళా/ పాదాంభోరుహముల్‌ ప్రయాగ నిలయుంబద్మాక్షు సేవించితిన్‌ / యాదోనాథ సుతాకళత్రు బదరీనారాయణున్‌ గంటి నీ/ యా దేశం బననేల చూచితి సమస్తాశావకాశంబులన్‌’ అంటూ చెబుతూంటే తల్లిదండ్రుల నీడలో చక్కగా భార్యతో గడుపుతున్న ప్రవరాఖ్యుడికి దేశాలు తిరిగి రావాలనే కోరిక పుడుతుంది. కాలమేదైనా జనం యాత్రలు చేయాలని కోరుకోవడం సహజం. పాత కాలం కథలు వింటుంటే యాత్రలు చేయడమనేది మనుషుల జన్యువుల్లోనే ఉన్నదేమో అనిపిస్తుంది! ఆ విధంగా సహజ సిద్ధంగా తిరిగే మానవులకు కరోనా వైరస్‌ చాలా కఠినమైన ఆంక్షలనే విధించింది!

జనంతో సంబంధం లేని నాయకులు భుక్తాయాసంతో చేసే రాజకీయ యాత్రలు కొంచెం నవ్వుకోవడానికి పనికి వస్తాయి. కానీ పర్యాటకం ఎంత గొప్పదో మన దేశం గురించి రాసిన విదేశీ యాత్రికుల వల్ల తెలుస్తున్నది. యాత్రలు చేపడితే మనిషి ఆలోచనా ప్రపంచం విస్తృతమవుతుంది. సంస్కృతీ విజ్ఞానాది రంగాలలో ఆదాన ప్రదానాలన్నీ పర్యటనల ఫలితాలే. ఆధునిక కాలంలో పర్యాటక రంగం బహుముఖ వ్యాపారంగా విరాజిల్లుతున్నది. ఆతిథ్య, రవాణా రంగాలు కళకళలాడటంతోపాటు కొనుగోళ్లూ పెరుగుతాయి. కానీ కరోనా వల్ల పర్యాటకరంగం తీవ్రంగా దెబ్బతిని కోట్లాదిమంది ఉపాధి కోల్పోయారు. కరోనాకు ముందు ప్రపంచ జీడీపీలో పర్యాటక రంగం వాటా 10.4 శాతం. 32 కోట్ల మందికి ఉద్యోగాలను, ఉపాధిని అందించిన రంగం అది. మనదేశంలోనూ పర్యాటక రంగానికి జీడీపీలో 6.9 శాతం, ఉద్యోగ కల్పనలో 8.8 శాతం వాటా ఉంది.

- Advertisement -

కొవిడ్‌ తగ్గుముఖం పట్టి, వివిధ దేశాలు మళ్ళా యాత్రికులకు తలుపులు తెరుస్తుండటంతో యాత్రా ప్రియులకు రెక్కలు పుట్టుకొచ్చినంత ఆనందంగా ఉన్నది. అమెరికా, కెనడా, థాయ్‌లాండ్‌, యూఏఈ, జర్మనీ, స్పెయిన్‌, మాల్దీవులు, టర్కీ తదితర దేశాలు భారతీయ ప్రయాణికులపై ఆంక్షలు తొలగించాయి. కేంద్ర ప్రభు త్వం కూడా పర్యాటకులకు ప్రోత్సాహకాలను ప్రకటించింది. మన దేశ సందర్శనకు వచ్చే తొలి ఐదు లక్షలమంది విదేశీయులకు ఉచిత వీసాలనిస్తామని, టూరిస్టు ఏజెన్సీలకు, గైడ్‌లకు రుణాలు ఇస్తామని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పర్యాటకం భారీ గా పెరిగింది. యాత్రా స్థలాలు కొత్త శోభను సంతరించుకోవడమే కాకుండా యాదాద్రి కొత్త ఆలయ త్వరలో ప్రారంభమవుతున్నది. కరోనా ఉపశమించినప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకుంటూ, తీర్థయాత్రలు మొదలుకొని ప్రేమ యాత్రల వరకు ఏవైనా చేపట్టవచ్చు!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement