అనుమానాలన్నీ బలపడుతున్నాయి. చూపుడు వేళ్లన్నీ చైనావైపే చూపిస్తున్నాయి. ఏడాదిన్నరగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ పుట్టుక చైనాలోని వుహాన్ ల్యాబ్‌లోనే జరిగిందన్న దానికి బలం చేకూరుతున్నది. చైనాలోని ప్రయోగశాలనుంచే కరోనా వైరస్ పుట్టిందనటానికి విశ్వసించదగ్గ ఆధారాలున్నాయని తాజాగా భారతీయ శాస్త్రవేత్తల ద్వయం కూడా తేల్చింది. పుణెకు చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్ మోనాలీ రహల్కర్, డాక్టర్ రాహుల్ బహులికర్ ఇద్దరూ కొవిడ్ కారక వైరస్ ‘సార్స్-కొవ్-2’ పుట్టుక మూలాన్ని తెలుసుకునేందుకు 2020 ఏప్రిల్ నుంచి పరిశోధనలు ప్రారంభించారు. ఆ క్రమంలో వారు వైరస్ పుట్టుక, విస్తరణ, చికిత్స విధానాల ఆధారంగా అధ్యయనం చేశారు. చైనాలోని గనిలో తారసపడిన వైరస్ ‘ఆర్‌ఏటీజీ13’పై వుహాన్ ల్యాబ్‌లో పరిశోధనలు చేసే క్రమంలోనే కరోనా వైరస్ పుట్టి వ్యాపించిందని వారు వెల్లడించారు.
గతంలో బ్రిటిష్ శాస్త్రవేత్తలు కూడా వుహాన్ ల్యాబ్లోంచే వైరస్ వచ్చిందన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన ప్రసిద్ధ పత్రిక కూడా తనదైన పరిశోధనతో ఈ విషయాన్నే వార్తాకథనాలుగా ప్రచురించింది. అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్ సైతం ల్యాబ్‌నుంచే, మానవ తప్పిదం వల్లే వైరస్ వ్యాప్తి చెందిందని కథనాలు రాసింది. ప్రస్తుత పుణె శాస్త్రవేత్తల నిర్ధారణ ఊహలపై ఆధారపడింది కాదు. దక్షిణ చైనాలోని మొజియాంగ్లో పాడుబడిన రాగి గనిలో పేరుకుపోయిన గబ్బిలాల విసర్జితాలను తొలిగించే పనిని 2012లో ఆరుగురు కార్మికులకు అ ప్పగించారు. దాన్ని తీసిన కొన్నాళ్లకే వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో ముగ్గురు చనిపోయారు. వారికి ఆర్‌ఏటీజీ13 సోకింది. ప్రస్తుతం కొవిడ్ బాధితుల్లో ఉన్నట్లే జ్వరం, దగ్గుతో పాటు న్యుమోనియానూ ఆ రోగులలో గుర్తించారు. బాధితుల రేడియలాజికల్, సీటీ స్కాన్ల రిపోర్టులు కూడా ఇప్పటి కొవిడ్ బాధితుల నివేదికలతో పోలి ఉన్నాయి. తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్లు బయటపడ్డా యి. వారికీ యాంటీవైరల్, యాంటీ బయోటిక్ మందులనే ఇచ్చారు.
వైరస్ పుట్టుకను తెలుసుకునే ప్రయత్నం చైనాను దోషిని చేసేందుకు చేపట్టింది కాదు. అలాగే లాక్డౌన్ వంటి చర్యలతో వైరస్ నుంచి విముక్తి దొరకదు. కొవిడ్ వైరస్ జన్మరహస్యం తెలిస్తేనే శాశ్వత నివారణ చేయగలమని అమెరికా శాస్త్రవేత్తలు అంటున్నారు. వైరస్ జన్యు నిర్మాణం, దానికి మూలమైన భౌతిక, వాతావరణ పరిస్థితుల నేపథ్యం తెలిస్తేనే నివారణ, ఔషధ తయారీ సాధ్యం అవుతుంది. అందుకే ఇప్పుడు వివిధ దేశాలలో వైరస్ పుట్టుకను తెలుసుకొనేందుకు పట్టింపుగా పనిచేస్తున్నారు. ఈ మధ్యనే అమెరికా అధ్యక్షడు జో బైడెన్ వైరస్ పుట్టుక రహస్యాన్ని మూడు నెలల్లో తేల్చాలని నిఘా, వైద్య పరిశోధన సంస్థలను ఆదేశించారు. ఇప్పటికైనా డబ్ల్యూహెచ్ఓతోపాటు దేశాలన్నీ సమన్వయంతో పనిచేయాలి. వైరస్ జన్మరహస్యాన్ని ఛేదించాలి. అప్పుడే కరోనాకు ధీటైన మందు కనుగొనడం సులువు అవుతుంది.