బుధవారం 03 మార్చి 2021
Editorial - Feb 23, 2021 , 00:46:51

ప్రజలే కాపాడుకోవాలి

ప్రజలే కాపాడుకోవాలి

చరిత్ర గర్భంలోకి తొంగి చూస్తే తెలంగాణ గడ్డ మీద రాజ్యాలు నడిపినవాళ్లు ఎందరో కన్పిస్తారు. ఎక్కడెక్కడి నుంచో, దూరతీరాల నుంచి ఇక్కడికొచ్చి శాశ్వతంగా స్థిరపడ్డవారు, రాజవంశాలను స్థాపించిన వారు ఎందరో. వారు ఇక్కడి జన జీవితంలో, సంస్కృతీ సభ్యతలలో కలిసిపోయినా, తమ మూలాలను దాదాపుగా మరచిపోయినట్లు కన్పించినా వారికి, ఆ పాలక వర్గాలకు తెలంగాణ మీద ఉండవలసినంత ప్రేమ ఉందనడానికి వీలులేదు.అలాంటి దుష్టాంతాలు అనేకం చరిత్ర పొడవునా కనిపిస్తాయి.

తెలంగాణ వాళ్లు ఎవరో ఒకరు అధికారంలోకి వచ్చినంత మాత్రాన తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందన్న, అన్యాయం జరగదన్న నమ్మకం లేదని గతంలో రుజువైంది. భవిష్యత్తులో తెలంగాణ గత అంధకార అధ్యాయం పునరావృతం కాకుండా చూడవలసిన పవిత్ర బాధ్యత తెలంగాణ ప్రజలదే. 

ఈప్రాంతానికొచ్చి పాలనాపగ్గాలు చేపట్టి ఎన్ని చేసినా వాళ్లు తెలంగాణ బిడ్డలు కారు. కొందరు లండన్‌ నుంచి, మరికొందరు కలకత్తా, ఢిల్లీ నగరాల నుంచి పరిపాలన జరిపారు. కొందరు ఇక్కడి ప్రజల పట్ల బాధ్యతలు లేకుండా పెత్తనం చేశారు. ఎన్నో సంవత్సరాలు, ఎంతోకాలం ఇక్కడి ప్రజలకు ప్రాతినిధ్యం లేకుండా, గొంతు విన్పించకుండా పెత్తనం నడపగలిగిన వారున్నారు. ఈ పరిస్థితి కారణంగా తెలంగాణ తన అస్తిత్వం, తన వ్యక్తిత్వం, తన ఊరు పేరు, తన ప్రత్యేకత, ప్రాముఖ్యం, తన చిరునామా, ఉరునామా కోల్పోయింది. తెలంగాణ ప్రజలు ఎవరో ఒకరికి దాసులై, తోకలై తమ ఉనికిని కోల్పోయి కేరాఫ్‌ అడ్రసుతో ‘బాంచెను, బాంచెను’ అంటూ దీనంగా, హీనంగా బతుకులు ఈడ్వవలసిన దుస్థితి ఏర్పడింది. 

ప్రకృతి ఇచ్చిన వనరులు అన్నీ పుష్కలంగా ఉన్నా, తెలంగాణ ఒక ఎడారి అన్న దురభిప్రాయం ఏర్పడింది, తెలంగాణ ఒక ‘దరిద్రపు కొంప’ అన్న దుష్ప్రచారం జరిగింది. పరాధీన భారతదేశం సైతం ఇటువంటి దుస్థితిని ఎదుర్కోలేదు; తమ ఇంటిని తెలంగాణ ప్రజలు ‘ఇది మా ఇల్లు’ అని గర్వంతో అనలేని అవమానకర పరిస్థితి ఏర్పడింది. గత ఆరేండ్ల నుంచి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ పరిస్థితి మారింది. బహుముఖ ప్రతిభావంతుడైన పీవీ నరసింహారావు స్థాయి నాయకుడు సైతం ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని సందర్భాల్లో అన్యాయాలకు గురైనారు. అదే తెలంగాణ రాష్ట్రంలో, కేసీఆర్‌ ప్రభుత్వంలోనే పీవీకి సముచిత గౌరవం లభిస్తున్నది. వివిధ రాజకీయపార్టీల నాయకులెందరో రంగం మీదికి వచ్చి అధికారం నడిపినా తెలంగాణ దుస్థితిని గమనించలేదు. గమనించినా ఈ దుస్థితిని దూరం చేయడానికి శ్రద్ధాసక్తులు ప్రదర్శించలేదు. ఈ దుస్థితిని జాగ్రత్తగా, విశ్లేషణాత్మకంగా గమనించి, సకల తెలంగాణ ప్రజలు క్రియాశీల భాగస్వాములుగా అపూర్వ, అద్వితీయ వ్యూహాత్మక ఉద్యమాన్ని అనేక సంవత్సరాలు నిర్వహించి అందరు ఇక అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఘనత కేసీఆఆర్‌ది. ఉద్యమ కాలంలోనే ఆయన తెలంగాణ ప్రజల అవసరాలను, తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి ఆవశ్యకతను గుర్తించి అప్పుడే అభ్యుదయ ప్రణాళికలకు రూపకల్పన చేశారు. ఇది అందరూ చేయలేని పని అనితరసాధ్యమైన మహత్కార్యం. 

తెలంగాణ వాళ్లు ఎవరో ఒకరు అధికారంలోకి వచ్చినంత మాత్రాన తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందన్న, అన్యాయం జరగదన్న నమ్మకం లేదని గతంలో రుజువైంది. భవిష్యత్తులో తెలంగాణ గత అంధకార అధ్యాయం పునరావృతం కాకుండా చూడవలసిన పవిత్ర బాధ్యత తెలంగాణ ప్రజలదే. ‘మోసపోతివా నీవు గోసపడుతావు’ అన్న కవి వాక్యం నిజమవుతుంది. తిరిగి భయంకర పరిణామాలు సంభవిస్తాయి; పరుల పెత్తనం తిరిగి మొదలవుతుంది. ప్రత్యామ్నాయం లేని ప్రజా నాయకుడు, పరిపాలనాదక్షుడు, రాజనీతిజ్ఞుడు కేసీఆర్‌ అన్న సత్యం నానాటికీ బలపడుతున్నది.

ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులు ఏదో ఒక సందర్భాన నియంతలకు, నికృష్ట నేతలకు సైతం ప్రమాదం నుంచి గట్టెక్కడానికి ఉపకరిస్తాయి. ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా రాజ్యాంగానికి తూట్లు పొడిచి అవహేళన చేశారు. అదే రాజ్యాంగం ఆయన ఇంపీచ్‌ కాకుండా రక్షించింది. 2021 జనవరి 6న క్యాపిటల్‌ హిల్‌పై దాడిలో నిరసనకారులను ట్రంప్‌ ప్రసంగం రెచ్చగొట్టిందన్నది ఒక ఆరోపణ. ఈ ప్రసంగం ట్రంప్‌ భావప్రకటనా స్వాతంత్య్రమని ఆయన న్యాయవాదులు అమెరికా సెనేట్‌లో వాదించారు. ఈ వాదన ట్రంప్‌ ఇంపీచ్‌మెంట్‌ను తప్పించుకోవడానికి దోహదపడింది. మూడు బిల్లులకు వ్యతిరేకంగా రైతులు జరుపుతున్న ఉద్యమానికి అంతర్జాతీయస్థాయిలో లభిస్తున్న మద్దతు కారణంగా భావప్రకటనా స్వాతంత్య్రంపై విస్తృత చర్చ జరుగుతున్నది. 

భావప్రకటనా స్వాతంత్య్రంలో ప్రధాన భాగమైన పత్రికా స్వాతంత్య్రం అప్పుడు స్వాతంత్య్ర ఉద్యమం రోజుల్లో, ఇప్పుడు ప్రాముఖ్యం వహిస్తున్నది. లోక్‌మాన్య బాలగంగాధరతిలక్‌, గాంధీజీ, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌, అరవింద ఘోష్‌, భగత్‌సింగ్‌, సురేంద్రనాథ్‌ బెనర్జీ, సావర్కర్‌ వంటివారు పత్రికా స్వాతంత్య్రంతో దేశ ద్రోహానికి పాల్పడ్డారని బ్రిటిష్‌ పాలకులు కేసులు పెట్టారు. ఇప్పుడూ అటువంటి కేసులు పెడుతున్నారు. పూర్వపు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ ఒక ఆర్డర్‌ జారీచేసింది. ఆ ఆర్డర్‌ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖలో మూడు వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఆ మూడు వేలమంది ఉద్యోగాలు కోల్పోయి ఇండ్లకు వెళ్లాలె, బతుకులు ఈడ్వడానికి బిచ్చమెత్తాలె. ఉద్యోగ సంఘాల నాయకులు అప్పటి పత్రికా సంపాదకుల వద్దకు, రాజకీయ నాయకుల వద్దకు వెళ్లి మొర పెట్టుకున్నారు. ప్రముఖ రచయిత గోరాశాస్త్రి అప్పుడు హైదరాబాద్‌ నగరంలో ఒక ఇంగ్లీష్‌ దినపత్రికకు, ఒక తెలుగు దినపత్రికకు సంపాదకులు. రెండూ ఆ రోజుల్లో ప్రముఖ పత్రికలు. ఉద్యోగుల గోడు విని గోరాశాస్త్రి ఇంగ్లీష్‌ దినపత్రికలో PERISH THE THOUGHT శీర్షికతో ఘాటుగా ఒక సంపాదకీయం రాశారు. ఆయన సంపాదకీయం తర్వాత రాష్ట్ర శాసనసభలో చర్చ జరగడం, ఉద్యోగుల తొలగింపు ఆగిపోవడం గణనీయ పరిణామం. ఆయన తెలుగు పత్రికలో, ఆయన కోర్కెతో ఒక కాలవ్‌ు రాయడం నాకు  గర్వకారణం, చిరస్మరణీయం. పత్రికా స్వాతంత్య్రాన్ని, తన కలాన్ని ఒక ఆయుధంగా ప్రజల హక్కుల రక్షణ కోసం వినియోగించిన గోరాశాస్త్రి నిజంగా అభినందనీయుడు. అందువల్లనే, మహాకవి శ్రీశ్రీ వంటి వారు కూడా గోరాశాస్త్రిని అపరిమితంగా గౌరవించేవారు.

దేవులపల్లి ప్రభాకర రావు

VIDEOS

logo