శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Editorial - Feb 23, 2021 , 00:46:57

ప్రైవేటీకరణే ఆత్మనిర్భరతా?

ప్రైవేటీకరణే ఆత్మనిర్భరతా?

ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ నేడు సామజిక మాధ్యమాలలో చాలా విస్తృతంగా నేడు జరుగుతున్న చర్చ. గత కొన్ని రోజులుగా విశాఖ నగరంలోని ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, చాలా విస్తృతంగా చేపట్టిన ర్యాలీలలో మూకుమ్మడిగా వినిపించిన గళం విశాఖ ఉక్కు భారత ప్రజల హక్కు. విశాఖ ఉక్కు మాత్రమే భారత ప్రజల హక్కు కాదు. నిజానికి అన్ని ప్రభుత్వరంగసంస్థల ఆస్తులు ప్రజల ఆస్తులే.

 దశాబ్దాల కాలం నుంచి ప్రభుత్వ, పైవేట్‌రంగ సంస్థలు మన భారతావనికి రెండు కళ్లు. ఒక కంటిలో నలత పడితే దాన్ని తీసి ముందుకు వెళ్లాలే తప్ప పూర్తిగా కన్ను తొలగించి ఒకే కంటి ప్రయాణం తగదు. ప్రభుత్వరంగ సంస్థలపై నిరంతర పర్యవేక్షణ, ప్రైవేట్‌రంగ సంస్థలపై నియంత్రణ సమసమాజ నిర్మాణానికి పునాది. లేకుంటే సమాజంలో అసమానతలకు దారితీసే ప్రమాదం ఉంది. ఆత్మనిర్భరత అంటే ప్రైవేటీకరణ కాదని గ్రహించాలి. 

మన దేశంలో కొన్ని దశాబ్దాల కాలం నుంచి బడ్జెట్ల రూపంలో ఎన్నో సాకులతో ఒక్కొక్క సంస్థను వాటాల విక్రయం ద్వారా ప్రైవేటీకరణ లేదా సంస్థలను మూసివేయడం జరుగుతున్నది. ఉదాహరణకు, హైదరాబాద్‌ నగరానికే తలమానికాలైన ఐడీపీఎల్‌, ఆల్విన్‌, హెచ్‌సీఎల్‌, హెచ్‌ఎంటీ, మరెన్నో ఇతర ప్రభుత్వరంగసంస్థలు నేడు కనుమరుగైనవి.  ఎందుకని ఈ ప్రభుత్వసంస్థల మూత? ఈ సంస్థల వైఫల్యాలకు గల కారణాలేమిటి ఈ సంస్థల మనుగడ ప్రశ్నార్థకం ఆయా సంస్థల నిర్వాహకుల వైఫల్యమా లేక వీటిలో పనిచేసే మానవ వనరుల అసమర్థతా? లేక ఆర్థిక వనరుల కొరతా? లేక బ్యూరోక్రసీ, మితిమీరిన రాజకీయాల జోక్యమా? లేదా రోజువారీగా పెరుగుతున్న పోటీతత్వమా? సాంకేతిక నిర్వహణ నైపుణ్య లోపమా? నేడు ఈ సంస్థల స్థితిగతులకు కారణం పరోక్షంగా ప్రజలు కూడా కాదా? మన ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ అనేది దేశంలోని  దిగువ, మధ్యతరగతి ప్రజలకు సమస్య కాదా? ఈ ప్రైవేటీకరణ బీద, అల్పాదాయ, అట్టడుగు వర్గాల జీవనాభివృద్ధికే సమస్యా? అసలు ప్రజల ఆస్తుల ప్రైవేటీకరణే, పై అన్ని ప్రశ్నలకు అంతిమ సమాధానమా?

విమానయాన రంగంలో ప్రైవేట్‌ విమాన సంస్థలైన జెట్‌ ఎయిర్వేస్‌, కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌ లైన్స్‌ అప్పుల ఊబిలో కూరుకుపోయి మొండి బాకీలుగా మారి తద్వారా ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్థక ఆస్తులు పెంచి బ్యాంకుల విలీనానికి దారితీయలేదా? టెలికం రంగంలో ఎన్నో పేరొందిన ప్రైవేట్‌ సంస్థలు గత ఐదేండ్లలో మూగబోయి మరికొన్ని సంస్థలు అప్పుల ఊబిలో నేటికీ కొట్టుమిట్టాడుతున్నాయి. మొన్నటికి మొన్న బ్యాంకింగ్‌ రంగంలోని ప్రైవేట్‌ దిగ్గజ బ్యాంకు అయినటువంటి ఎస్‌ బ్యాంకు కుప్పకూలిపోతే, దాన్ని ఆదుకొని పెద్దన్న పాత్ర పోషించినది మన ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియానే కదా. అంతేనా, ప్రైవేట్‌ రంగ సంస్థల వ్యవస్థాపకుల వేల కోట్ల ఐచ్ఛిక రుణాల ఎగవేతలను భరిస్తున్నవి కూడా ప్రభుత్వరంగ బ్యాంకులే కదా. ప్రభుత్వరంగానికి చెందిన ఆయిల్‌, యూరియా, గ్యాస్‌ కంపెనీలు కూడా ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చే సబ్సిడీల రూపంలో నష్టాలను మూట కట్టుకుంటూ నేడు ప్రైవేటీకరణ దిశగా పరుగులు తీస్తూ ఉన్నాయి కదా.

ప్రైవేటీకరణే విజయానికి చిహ్నమా? అలానే అయితే ప్రపంచ ప్రతిష్ఠాత్మక ప్రైవేట్‌ దిగ్గజ కంపెనీలైన నోకియా, కొడాక్‌ నేడు తలెత్తుకోని పరిస్థితుల్లో ఉన్నవి. కానీ వీటికి భిన్నంగా ప్రభుత్వరంగ సంస్థలు తమకు వచ్చే లాభాలను ప్రభుత్వానికి వార్షిక డివిడెండ్‌ రూపంలో ప్రతి సంవత్సరం చెల్లింపులు జరుపుతూ ఉన్నాయి. ఇంతేకాకుండా ప్రభుత్వ వాటాల విక్రయ ప్రక్రియకు గాను సాలీనా షేర్‌ బ్యాక్‌ల ద్వారా నగదు చెల్లింపులు జరుపుతూ తమ వంతు దాతృత్వాన్ని కీలక సమయాలలో ప్రభుత్వాలకు అందజేస్తున్నాయి. ఎల్‌ఐసీ, బీపీసీఎల్‌ వంటి బంగారు బాతు లాంటి సంస్థలను ప్రైవేటీకరించడం సముచిత నిర్ణయమేనా? ప్రభుత్వరంగ సంస్థలు దేశాభివృద్ధికి తమ వంతు తోడ్పాటును స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అవిరామంగా చేస్తూనే ఉన్నా యి. ప్రభుత్వం గట్టిగా తలచుకుంటే ప్రభుత్వరంగ సంస్థల పనితీరును చిటికెలో మెరుగుపరచవచ్చు. మచ్చుకు ఉదాహరణలుగా మాజీ రైల్వే శాఖ మంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌ ఇండియన్‌ రైల్వే సంస్థను నష్టాల ఊబిలోనుంచి లాభాల్లోకి తీసుకొని వచ్చిన రోజులు చూశాం కదా?

ఐటీ, బ్యాంకింగ్‌, వస్తూత్పత్తి, సేవల రంగాలలోని ప్రైవేట్‌రంగ సంస్థలు కుమ్మక్కై పనిచేసే ఉద్యోగులకు కనీస వేతనం ఇస్తున్నాయి. కోట్లలో లాభాలను కొల్లగొడుతూ షేర్‌ మార్కెట్లలో తమ ప్రతాపం చూపుతున్నాయి. ఈ సంస్థ లాభాపేక్ష దృక్పథంతో ఉద్యోగుల పని గంటలను రోజుకు 9  నుంచి 12, 14 గంటల వరకు సాగదీస్తూ లాభాలను ఆర్జిస్తున్నాయి. కానీ ఉద్యోగులకు మాత్రం అపరిమితమైన పని గంటలు, అనిశ్చితి నిరంతరాయంగా వెంటాడుతూనే ఉన్నాయి. దురదృష్టమేమంటే ఈ సంస్థల లోపల పనిచేసే వారు యాభయవ  వసంతానికి వచ్చేసరికి పదవీ విరమణ చేసేవిధంగా దోపిడీ చేస్తున్నాయి.

ప్రభుత్వరంగ సంస్థలు చాలా విశాల దృక్పథంతోతమ వంతుగా ఉద్యోగ భద్రత, సామాజిక బాద్యత, సంక్లిష్ట సమయాల్లో దేశాభివృద్ధి కోసం తోడ్పడతాయి. ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ లోపాలను సమర్థవంతంగా ఎదుర్కొనే విధాన నిర్ణయాల సమయానికి అనుకూలంగా ప్రభుత్వాలు తీసుకొని ఉంటే నేడు ఈ రోజు నష్టాలు చవిచూసేవి కాదు. 

2021కి మన దేశ వార్షిక జీడీపీ 11 శాతంగా అంతర్జాతీయ ద్రవ్య పరపతి సంస్థ అంచనా వేసింది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ప్రజల ఆస్తుల మనుగడను ప్రశ్నార్థకంగా చేయకుండా ఆయా సంస్థల వైఫల్యాలకు కారణాలను కనుక్కొని నైపుణ్య నిర్వాహక మానవ వనరులను నియమించి ఆశయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే మంచిది. 

(వ్యాసకర్త: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌, హైదరాబాద్‌)

 డాక్టర్‌ ఎం.చంద్రశేఖర్‌

VIDEOS

logo