శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Editorial - Feb 23, 2021 , 00:46:50

పదపదమున పారవశ్యం

పదపదమున పారవశ్యం
  • నేడు అన్నమయ్య వర్ధంతి

దక్షిణ పథాన భజన సాంప్రదాయానికి, పద కవితా శైలికి ఆద్యుడు, తెలుగు సాహితీ చరిత్రలో ప్రథమ వాగ్గేయకారుడు అన్నమాచార్యుడు. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు మార్గదర్శకుడు అన్నమయ్య. భక్తి, సాహిత్యం, సంగీతం భావ లాలిత్యంతో నిండి ఉన్న అన్నమయ్య పాటలు, పద్యాలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. ఆధ్యాత్మిక పదాలు, శృంగార గీతాలు, తుమ్మెదలు, గొబ్బిళ్ల పాటలు, శతకాలు, అన్నమయ్య విరచిత 32 వేల ఆశుకవితా రూపాల్లో చాలావరకు లభ్యాలై, ప్రజల నోళ్లలో నానుతూనే ఉన్నాయి.

అన్నమయ్య మనుమడు తాళ్ళపాక చిన్నన్న రాసిన అన్నమయ్య చరితం ద్విపద కావ్యం ద్వారా ఆయన సమాచారం లభిస్తున్నది. వైశాఖ మాసం విశాఖ నక్షత్రంలో శుభలగ్నాన నారాయణ సూరి- లక్కమాంబలకు నందకం అంశమున సర్వధారి సంవత్సర వైశాఖ శుక్ల పౌర్ణమి నాడు 1408 మే 9న అన్నమయ్య ఉదయించారు.శిశు ప్రాయం నుంచి అన్నమయ్య వెంకటనాథుని మీద ధ్యాస ఉంచేవారు. లక్కమాంబ గీతాలు, జోల పాటలు, నారాయణమూర్తి కావ్య పఠనాలు, అన్నమయ్యపై శైశవ దశలోనే ప్రభావం చూపాయి. ఏకసంథాగ్రాహియై, ఉపనయన సంస్కారం అనంతరం చిరు ప్రాయం నుంచే, కలియుగ దైవంపై సంకీర్తనలు నోటి నుంచి జాలువారాయి. పదహారేండ్ల ప్రాయం నుంచి రోజుకొక్క సంకీర్తనం  రాయడం మానలేదు. 

చెరువు గట్టు మీద, చెట్టుపై పిట్టలు, చిరుగాలి సవ్వడులలో, అలల కదలికలలో, మమేకమై సాగిన ఆయన జానపద నేపథ్యంలో అన్నమ య్య పాటన్నా, మాటన్నా, గ్రామీణులకు సంబరాన్ని కలిగించేవి. ఉమ్మడి కుటుంబంలో, పనులు చేయడం నచ్చక, లౌకిక బంధాలతో, తమకు ఇక పనిలేదని తెలుసుకొని భక్తి రసావేశ భరితులై, తంబుర చేతబూని తిరుమల దారి పట్టాడు. సకలాభరణ శోభితుడైన శ్రీమూర్తిని దర్శించుకున్నారు. తిరుమలలో ఘన విష్ణువు అనే మునితో శంఖ చక్రాదికములతో పంచ సంస్కారాలను నిర్వహింపజేసుకున్నారు. వైష్ణవ తత్త్వాలను, ఆళ్వారుల దివ్య ప్రబంధాలను, అధ్యయనం చేస్తూ, వెంకన్నను  కీర్తిస్తూ, తిరుమలలోనే జీవితం గడిపారు. గురువు ఆనతిపై, తాళ్ళపాక వెళ్లి తిమ్మక్క, అక్కమ్మలను వివాహం చేసుకున్నా, వారితో తిరిగి తిరుమల చేరుకున్నారు. 95 ఏండ్ల పూర్ణ వయస్కుడై, అన్నమయ్య దుందుభి నామ సంవత్సర ఫాల్గుణ బహుళ ద్వాదశి 1503 ఫిబ్రవరి 23న పరమపదించారు.

అన్నమయ్య సంకీర్తనా సేవ, సంగీత సాహిత్య భక్తి పరిపుష్టం. తెలుగులో రాసినా పాడినా ఆయన సాహిత్యం సంస్కృత పద భూయిష్టం. అన్నమయ్య  మొత్తం 32 వేల సంకీర్తనలు రచించారని అనుకుంటున్నా, ఆయన వారసులు రాగి రేకులపై రాయించి, తిరుమలలో సంకీర్తనా భాండాగారం నందు పొందుపరిచినవి ప్రస్తుతం 12 వేలు మాత్రమే. ఆయన రచనలని  చెప్పబడే 12 శతకాల్లో వెంకటేశ్వర శతకము మాత్రమే లభిస్తున్నాయి. అన్నమయ్య వాసిలో, రాశిలో, రచనలు ఆంధ్ర వాఙ్మయంలో సరి రానివి అనడంలో అతిశయోక్తి లేదు.

రామకిష్టయ్య సంగనభట్ల

VIDEOS

logo