తీరు మారని చైనా

గల్వాన్ లోయ దుర్ఘటన మరిచిపోకముందే చైనా మరోసారి వంచనకు పాల్పడింది. సిక్కిం సరిహద్దులో అత్యంత ఎత్తైన నకులా ప్రాంతంలో దుస్సాహసానికి ఒడిగట్టింది. సరిహద్దులో గస్తీ నిర్వహిస్తున్న భారత జవాన్లపై దాడి చేసింది. వాస్తవాధీన రేఖ వెంబటి సేనల ఉపసంహరణకు సంబంధించి మిలిటరీ అధికారుల స్థాయి 9వ దఫా చర్చలు కొనసాగుతుండగానే నకులాలో చొరబాటుకు యత్నించడం చైనా ద్వంద్వనీతికి నిదర్శనం. గల్వాన్ లోయలో చైనా చొరబాటును నిలువరించే క్రమంలో వీరమరణం చెందిన కల్నల్ సంతోష్‌బాబును గణతంత్ర దినోత్సవం సందర్భంగా సమున్నతంగా స్మరించుకుంటున్న తరుణంలో చైనా మరోమారు బరితెగించి భారత సేనలపై దాడులకు తెగబడటం గర్హనీయం.
మంచుపర్వతాలు, లోయల గుండా ఉన్న 3,500 కి.మీ. పొడవైన భారత్- చైనా సరిహద్దు (ఎల్ఏసీ) తాజా వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. గత ఐదు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనివిధంగా లఢక్‌లోని గల్వాన్ లోయలో వాస్తవాధీన రేఖ వెంట చైనా కుట్రపూరితంగా చొరబడుతున్నది. సాధికారికంగా గుర్తించని ఈ సరిహద్దు రేఖ వెంబటి ఇరు దేశాల సైనికులు తమ తమ దేశాలకు చెందిన భూ భాగాల్లోనే గస్తీ తిరుగుతుంటారు. లఢక్ ప్రాంతంలో ఈ రేఖపై అస్పష్టత ఎక్కువ. ఇక్కడ ఘర్షణలు తలెత్తకుండా ఇరుదేశాల సైనిక నాయకత్వాలు ఐదు దశాబ్దాలుగా చర్యలు తీసుకుంటున్నాయి. ఇంతకాలం దీన్ని పాటిస్తూ వచ్చిన చైనా ఇప్పుడు ఆ ప్రాంతంలో వ్యూహాత్మకంగా పట్టు సాధించేందుకు భారత భూభాగంలోకి దొంగచాటుగా చొరబడుతున్నది. అది భారత్ వేసుకున్న రోడ్ల మీదుగానే! వీటిని ప్రతిఘటించే క్రమంలో గల్వాన్ లోయలోని దుర్బోక్, శ్యోక్, డీబీఓ రోడ్డు ప్రాంతంలో ఘర్షణలు జరుగుతున్నాయి. ఉత్తర లఢక్‌లోని మన రక్షణదళాలకు సరుకుల రవాణా డీబీఓ రోడ్డు ద్వారానే జరుగుతుంది. గల్వాన్ లోయను ఆక్రమించటం ద్వారా ఉత్తర లఢక్‌కు సరఫరాలు అందకుండా చేయాలనేది చైనా కుట్ర.
ఇటీవలి కాలంలో ఆర్థికశక్తిగా ఎదిగిన చైనా విస్తరణవాద, ఆధిపత్యవాద రాజకీయాలతో దూకుడు పెంచింది. భారత్‌ను అస్థిరపర్చేందుకు ఏ అవకాశాన్నీ వదలటం లేదు. పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాక్‌లను భారత్‌పైకి ఎగదోస్తున్నది. అగ్రరాజ్యం అమెరికాను ఆర్థికంగా సవాలు చేసే స్థాయికి ఎదిగి, ఆగ్నేయాసియా దేశాలను, హిందూ మహాసముద్ర తీర దేశాలనూ గుప్పిట్లోకి తీసుకునేందుకు ఆరాట పడుతున్నది. పసిఫిక్‌లో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ప్రాబల్యానికి, హిందూ మహాసముద్రంలో భారత్ పలుకుబడికి భంగం కలిగించేందుకు కుయుక్తులు పన్నుతున్నది. చైనాను నిలువరించేందుకు అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ సభ్యదేశాలుగా ఏర్పడిన ‘క్వాడ్' లక్ష్యసాధన దిశగా అడుగులు వేస్తున్నది. అత్యంత జనాభా కలిగిన భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు ప్రాంతీయంగా శాంతికి విఘాతం. చైనా వైఖరిలో మార్పే దీనికి పరిష్కారం.
తాజావార్తలు
- ఇస్రోతో దేశ ఖ్యాతి వర్ధిల్లుతున్నది : సీఎం కేసీఆర్
- దక్షిణ చైనా సముద్రంలో చైనా లైవ్ ఫైర్ డ్రిల్
- తమిళం నేర్చుకోనందుకు బాధగా ఉంది: మోదీ
- సింగరేణి కాలనీలో ఉచిత మల్టీ స్పెషాల్టీ వైద్య శిబిరం
- ఏడుగురు నకిలీ పోలీసుల అరెస్టు
- మార్చి 14 వరకు నైట్ కర్ఫ్యూ.. స్కూళ్లు బంద్!
- పెళ్ళిపై నోరు విప్పిన శ్రీముఖి..!
- తెలంగాణ రైతు వెంకట్‌రెడ్డికి ప్రధాని మోదీ ప్రశంసలు
- సిలికాన్ వ్యాలీని వీడుతున్న బడా కంపెనీలు.. ఎందుకంటే..?
- ‘సుందిళ్ల బ్యారేజీలో తనిఖీలు’