శనివారం 06 మార్చి 2021
Editorial - Jan 27, 2021 , 02:11:12

మన ఆశలు ఈడేరేనా?

మన ఆశలు ఈడేరేనా?

కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2021-22) ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ ఏ విధంగా ఉంటుందన్నది చర్చనీయంగా మారుతున్నది. అది కొవిడ్‌ మూలంగా ఏర్పడ్డ సంక్షోభాన్ని తీరుస్తుందా.. పేద మధ్యతరగతి ప్రజల ఆదాయ వనరుల్ని ఏ విధంగా పెంచుతుంది అనేది ఆసక్తిని రేపుతున్నది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఏ విధమైన సంస్కరణలు చేపడుతారో వేచి చూడాలి. 

ప్రజల జీవన పరిస్థితులపై కొవిడ్‌ తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ప్రజలపై పన్నుల భారం మోపకుండా, రాబో    యే బడ్జెట్లో పేద, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొంటారనే అభిప్రాయమున్నది. లాక్‌డౌన్‌లో ఈ వర్గాలు తీవ్రంగా నష్టపోయాయి. ఉద్యోగాలు కోల్పోయి ఆదాయం లేక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఆదాయ వనరులు తగ్గటం మూలంగా వినియోగం తగ్గిపోయింది. ఈ కారణంగా సేవారంగం తీవ్ర నష్టాలను చవిచూసింది. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత కూడా ప్రజల ఆదాయాల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో వినియోగం తగ్గిపోయింది. మరోవైపు నష్టాల నుంచి తేరుకోవాలని అమ్మకందారులు ధరలను పెంచేస్తున్నారు. దీని కారణంగా ద్రవ్యోల్బణం సమస్య ఏర్పడుతున్నది. ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను కట్టడి చేయని పక్షంలో పెరిగిపోతున్న ధరలు ద్రవ్యోల్బణానికి దారితీస్తాయి.

మధ్యతరగతి ప్రజలు ఆదాయం పన్ను విషయంలో తమకు ఊరట కలుగాలని ఆశిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా పారిశ్రామికరంగం కూడా నష్టాల్ని చవిచూసింది. పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోవడంతో లక్షల సంఖ్యలో కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇప్పుడిప్పుడే కార్మికులు ఉపాధి వేటలో పడ్డారు. పారిశ్రామిక రంగానికి ఊతం ఇచ్చేలా బడ్జెట్లో కేటాయింపులుండాలని వీరు కోరుకుంటున్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు నిర్మాణరంగం వెన్నుదన్నుగా నిలిచింది. కొవిడ్‌ కారణంగా నిర్మాణరంగం ఒక్కసారిగా కుదేలయింది, దీనిమీద ఆధారపడిన కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణ రంగానికి భారీ ఊరట కల్పించాల్సి ఉంటుంది. అన్ని రంగాలలో ఎగుమతులు దిగుమతుల ప్రక్రియ నిలిచిపోవడంతో ఆయా రంగంపై ఆధారపడిన వాళ్లంతా తమ ఆదాయాన్ని కోల్పోయి కష్టాల్లో మునిగిపోయారు. ఇలా ప్రతి వ్యవస్థ కొవిడ్‌ కారణంగా తీవ్రంగా నష్టపోవడం వల్ల ఎవరికి వారు బడ్జెట్‌పై ఆశలు, అంచనాలు పెంచుకొంటున్నారు. కేంద్రం పెద్ద ఎత్తున రుణాలు ఇస్తుందని,  ఆదాయ వనరుల్ని కల్పిస్తుందని ఆశిస్తున్నారు.

దేశంలో హాస్పిటల్‌ బెడ్ల కంటే ఎక్కువ మంది రోగులు ఉన్న పరిస్థితిని కరోనా చూపించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వైద్య రంగానికి ఎక్కువ కేటాయింపులు అవసరం. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గకపోవడం, కొత్తగా స్ట్రెయిన్‌ వంటి పరిణామాలతో వైద్యరంగంలో పరిశోధనలకు, సాంకేతికతకు నిధుల కేటాయింపులు అవసరం. ఈ బడ్జెట్‌లో ప్రజల ఆరోగ్యం, జీవిత బీమాలపై ఎక్కువ శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. బ్యాంకింగ్‌ రంగాన్ని మొండిబకాయిలు పట్టిపీడిస్తున్నాయి.  బడ్జెట్లో ఈ రంగానికి మూలధన అవసరాలకు కేటాయింపులు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండవచ్చునని నిపుణులు అంటున్నారు. రైల్వే బడ్జెట్లో నష్టాన్ని పూడ్చుకునేందుకు ప్రైవేట్‌ రైళ్లు నడపడంతోపాటు కొత్త రైళ్లపై దృష్టి సారించే అవకాశమున్నది. 

దేశంలో నిరుద్యోగం కలవరపెడుతున్న పెద్ద సమస్య. కొవిడ్‌తో ఇది మరింత పెరిగింది. యువతలో నిరాశ నిస్పృహలు పెరుగుతున్నాయి. యువతను తయారీ రంగం, స్టార్టప్‌ల వైపు మళ్లించాలని ప్రభుత్వం యోచిస్తున్నందున  కేటాయింపులు భారీగానే ఉండే అవకాశమున్నది. అలాగే సామాన్యుని పూర్వస్థితికి తీసుకువచ్చే మార్గాలను అన్వేషించాలి. ఆదాయ మార్గాలను చూపెట్టాలి. ఈ స్థితిలో భారత్‌ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి ఆత్మ నిర్భర్‌ భారత్‌ పేరిట ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి దీర్ఘకాలంలో స్వీయ ఆర్థిక సాధికారతకు బాటలు వేయాలి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌.. సామాన్యుని జీవితంలో వెలుగులు నింపాలి. వారి సంక్షేమానికి కేటాయింపులు పెరుగాలి.

-కె. శ్రావణ్‌కుమార్‌

VIDEOS

logo