శనివారం 06 మార్చి 2021
Editorial - Jan 24, 2021 , 02:20:02

అవధాన శిఖరం

అవధాన శిఖరం

అవధాన నిర్వహణలో సీమాంధ్ర ప్రాంతంలో సి.వి.సుబ్బన్న శైలి అని ప్రత్యేకంగా చెప్పుకుంటున్నట్లుగా, తెలంగాణ పాంతంలో గుమ్మన్నగారి శైలిని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ‘ఆశుధార, అద్భుతమైన గాత్రం, సద్య:స్ఫూర్తితో కూడిన వైదుష్యం, ధారణ, నిర్లిప్తత, రాజీలేని వైఖరి, ఛందో భాషణం అనే ప్రత్యేక అంశంలో పద్యాల్లో మాట్లాడటం’ అనే విశిష్ట అంశాల సమాహారం గుమ్మన్నగారి లక్ష్మీ నరసింహశర్మ అవధానం.

ఏళ్ళు గడుస్తున్నా ఎవరి జ్ఞాపక పరిమళాలు తమ పద్య సమీరాలతో  వాఙ్మయ మిత్రులందరినీ సుతి మెత్తగా స్పృశిస్తున్నాయంటే.. ఆ వ్యక్తి హృదయం అమృతతుల్యమై ఉంటుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

‘జయన్తితే సుకృతినో రససిద్ధా: కవీశ్వరా: 

నాస్తి తేషాం యశ: కాయే జరామరణజం భయవ్‌ు॥’

అని భర్తృహరి సుభాషితం అచ్చంగా సరిపోయే కవి. పండితాగ్రేసరులు, నిరంతర అక్షరోపాసకులు, ఆధ్యాత్మిక చింతనాపరులు, ఆదర్శ ఉపాధ్యాయులు అవధాన శశాంక, ఆశు కవితా కేసరి, కీర్తి శేషులు గుమ్మన్న గారి లక్ష్మీనర్సింహశర్మ.  

‘అద్భుతమైన ధార, పరమాద్భుత ధారణ, ప్రౌఢ భావ సం

పద్భవ పద్యపూరణ, స్వభావ మనోహరమైన శైలి, వి

ద్వద్భిషగాత్మ తృప్తి బహుదా కయిసేయు సమాసధాటి, దీ

వ్యద్భవనమ్ము కట్టితివి వాణికి, గుమ్మన్న శర్మ సత్కవీ’

అని గరికపాటి నరసింహారావు గారిచే కావించబడిన గుమ్మన్నగారి అవధాన హృదయావిష్కరణం ప్రత్యక్షర సత్యం. గుమ్మన్న గారి శర్మ నిరంతరం పరిమళించే పద్యపారిజాతం, ‘ప్రతిభావంతుడైన కవి’ అని సి.నారాయణరెడ్డి గారిచే ‘విశిష్ట వ్యక్తిగా ప్రస్తావించబడినారు. ఆధ్యాత్మిక, సాహిత్య సేవలో గుమ్మన్న గారు ఆదర్శప్రాయులని’ డాక్టర్‌ శివానందమూర్తి గారిచే.. ఇంకా గురుమదనానంద సరస్వతీ పీఠం, డాక్టర్‌ సామల సదాశివ గారిచే ప్రశంసలను పొందిన మహామనీషి. 

1934లో మెదక్‌ జిల్లా దుబ్బాక మండలం పోతారెడ్డిపేట గ్రామంలో అన్నపూర్ణ, రాధాకృష్ణయ్య దంపతులకు గుమ్మన్నగారి లక్ష్మీ నరసింహశర్మ జన్మించారు. వారిది పౌరోహిత్య యాజ్ఞిక వృత్తుల్లో పేరు తెచ్చుకున్న కుటుంబం. వారి తండ్రి మెదక్‌ జిల్లా మొత్తంలో ఉత్తమ యాజ్ఞికుల్లో ఒకరుగా గుర్తింపు పొందారు. సమకాలీన తెలంగాణ సంస్కృతిలో భాగమైన ఖానిగీ పాఠశాలల్లోని కంచయ్య పంతులు వీధి బడిలో తొలుత ఉర్దూను, కొన్ని శతకాలను నేర్చుకున్నారు. ఆ తర్వాత పోతారెడ్డిపేట, భిక్కనూరు, బీబీపేట, సిద్దిపేట ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. రామాయంపేటలో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశారు. గుమ్మన్న గారికి పాఠశాల దశలోనే పైడిమర్రి లక్ష్మీ నారాయణ శాస్త్రి శిక్షణలో తెలుగు, సంస్కృత భాషా సాహిత్యాల్లో మంచి పునాది ఏర్పడింది. అక్కడి ఉపాధ్యాయుల ప్రేరణతోనే గుమ్మన్న గారిలో కవిత్వ బీజాలు పడ్డాయి. చాదర్‌ఘాట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ (ఎఫ్‌.ఏ) చదివారు. తెలుగు అధ్యాపకులు పల్లా దుర్గయ్య, వేటూరి ఆనందమూర్తి, ఇరివెంటి కృష్ణమూర్త్తి గార్ల బోధనలతో తెలుగు భాషా సాహిత్యాలపై మంచిపట్టు కుదిరింది. పల్లా దుర్గయ్య నిర్వహించే సాహిత్య కార్యక్రమాల్లో హాజరైన దాశరథి కృష్ణమాచార్యులు, వట్టికోట ఆళ్వారుస్వామి, బిరుదరాజు రామరాజు, బూర్గుల రంగనాథరావు లాంటి సాహితీవేత్తల సమక్షంలో గుమ్మన్న గారికి పద్యాలు చదివే అవకాశం లభించడం, రాబోయే కాలంలో గుమ్మన్న గారి రస హృదయావిష్కరణ అవధాన నిర్వహణకు నేపథ్యంగా చెప్పుకోవచ్చు.

1965లో డీఓఎల్‌ పూర్తిచేసిన తర్వాత గుమ్మన్న గారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఓయల్‌ పట్టా పొందారు. డిగ్రీ పాసైన వెంటనే పండిట్‌ ట్రైనింగ్‌ కోసం వరంగల్‌ చేరిన గుమ్మన్న గారికి అక్కడ మంచి కవిత్వ వాతావరణం లభించింది. ఆ తర్వాత అవధాన సరస్వతి, వాగీశ్వర స్తుతి, ఆద్యమాతృక, పద్యోద్యానం మొత్తం ఐదు కావ్యాలను వెలువరించారు. అక్కడ కవి సమ్మేళనాల్లో పరిచయమైన కాళోజీ నారాయణరావు, పేర్వారం జగన్నాథం లాంటి కవుల సమక్షంలో పద్యరాగాలాపన గంధర్వ గానమే అయ్యింది.  

గౌరీభట్ల రామకృష్ణశాస్త్రి గుమ్మన్నగారికి అవధాన గురువు. వారు గొప్ప కవి పండితులు. ‘ఏకవీర కుమారీయం’ కావ్యకర్త కూడా. 1956లో గుర్వాజ్ఞతో వెంకట్రావుపేటలో వేణుగోపాలస్వామి ఆలయంలో గుమ్మన్నగారు తన మొట్టమొదటి అవధాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. పరాశరం గోపాలకృష్ణమూర్తి పండితుడు రెండవ అవధాన గురువు.  దోర్బల విశ్వనాథ శర్మ గుమ్మన్న గారికి మూడవ అవధాన గురువు. ఆ తర్వాత గుమ్మన్న గారు సుమారు 350 అవధానాలను దిగ్విజయంగా నిర్వహించారు.

‘చదువన్‌ లేదొక కావ్యమైనను మదుత్సాహమ్మేయౌ; గాన స

న్ముద వెలుందింపగ నేర్తునో? ఇచట లేనో? ఏది యెట్లైనా న

య్యది శ్రీశ్రీ పరమేశ్వరీ కృపయె ఔనంచున్‌ మనమ్మందు నిం

చెదనో సర్వసదస్సులారా! విజయశ్రీ యౌత్‌! ఎల్లప్పుడున్‌'

అనేది గుమ్మన్నగారి ప్రారంభ అవధానంలో ఎంతో వినమ్రంగా తనను గురించి వ్యక్తీకరించుకున్న పద్యం. 

వస్తుత: కవి అయిన గుమ్మన్నగారి అవధానాలు నిరంతరం గుబాళించడానికి కారణం వారి అనితర పద్యసాధనే. వారి అవధానాల్లో ప్రారంభంలో వాగీశ్వరీ స్తుతి ఒక ప్రత్యేకాంశంగా భాసిల్లుతుంది. సిద్దిపేటలో స్వభాను సంవత్సరములో నిర్వహించిన అవధానంలో ...

‘శ్రీమద్వాఙ్మయ సంప్రదాయక జయశ్రీరాజదష్టావధా

నామోదార్హసభ ‘స్వభాను’ సుషమా ప్రాంచద్ధ్యుతిన్‌ సిద్ధిపూ

స్సామర్థంబు వెలుంగ ‘వేంకటగిరీశ’ స్వచ్ఛ పాదార్చనా

ప్రామాణ్యంబున నిల్తునన్ననుమతింపన్‌ రమ్ము వాగీశ్వరీ’

అన్న స్తుతిలో స్థలకాలాదులను తెలియజేస్తూ, హాజరైన సహృదయులను అవధాన సరస్వతీ సేవకు సంసిద్ధుల్ని చేయడం కనిపిస్తుంది.

అవధానంలో ప్రేక్షక శ్రోతల్ని ఆశ్చర్యచకితుల్ని చేసే విభాగం ‘సమస్యాపూరణం’. పృచ్ఛకుడు లోకవిరుద్ధంగా ఉన్న విషయాన్ని సమస్యగా చేసి ఒక పద్యపాదాన్ని ఇస్తాడు. అవధాని తనకిచ్చిన పద్యపాదంలోని లోక విరుద్ధభావాల్ని పదగతంగానో, అర్థగతంగానో విరిచి చమత్కారయుక్తంగా, లోకామోదమైన భావంతో పాదాన్ని పూరించాల్సి ఉంటుంది. 31 జనవరి 1960లో సిద్దిపేటలో జరిగిన అవధానంలో గుమ్మన్న గారికి ‘చీరను పురుషుడు దాల్చె నీ గ్గౌమనుచున్‌' అని సమస్య ఇచ్చారు. దాన్ని అవధాని...

‘పారాసౌర విచక్షణ

లేరంజుగాను భరతనృత్యమునన్‌ శ్రీ నారద వేషము వేయగ చీరను పురుషుడు దాల్చె నీగ్గౌమనుచున్‌'

అని శాస్త్రీయ నృత్యంలో పురుషులైనా పట్టు పీతాంబరాలను ధరించేటువంటి ఆహార్య సంప్రదాయాన్ని సద్య: స్ఫురణతో పూరించి సభాసదులందరినీ ఆనంద కడలిలో ముంచెత్తారు. 

సమస్యా పూరణాల్లోనే కాక ‘దత్తపది’ పూరణాల్లో కూడా గుమ్మన్నగారిది ప్రత్యేక ప్రశంసార్హ ప్రతిభ. గణ, గుణ, రణ, ఋణ అనే పదాలతో రామాయణ పరంగా వర్ణించమని 1987వ సంవత్సరంలో నిజామాబాద్‌లో జరిగిన అవధాన కార్యక్రమంలో నారాయణాచార్యులు గుమ్మన్నగారిని కోరగా..

“గణ గణ మోయు గంటయనగా 

వినిపించెడు రామగాథ, భూ

గుణవతి జాత సీత కథ, క్రొవ్విరి బాటల పీట దీర్చం, ప్రే

రణమున సౌఖ్య కష్టముల రాశి జనమ్మున కౌనటంచనన్‌

ఋణముల నీగి రాకసి నరేశులు రావణు సంహరించుటన్‌”

అని వృత్యనుప్రాస అలంకారంలో ఎంతో చమత్కారంగా వర్ణించారు. 

నల్లవాగు గురుకుల పాఠశాలలో జరిగిన అవధానంలో ఒక పృచ్ఛకుడు రండ, బండ, ముండ, కొండ అనే పదాలతో శ్రీరామ కళ్యాణాన్ని వర్ణించమనగా గుమ్మన్నగారు...

“రండఖిలార్ష సంస్కృతి పరంపరులార! కనంగ పున్నె పుం

బండవు రాము పెండ్లిగనవచ్చును, సీతకు దగ్గవాడు రా

ముండనవచ్చు, సీత వలపున్‌ తలపున్‌ తెలియంగ వచ్చు మే 

ల్కొండనవచ్చు అచ్చపు వెలుంగు నిలంగన వచ్చు నిచ్చయిన్‌”

అని అశ్లీలత ధ్వనించే పదాలను మంచి అర్థంలోకి వచ్చే విధంగా సరసంగా విరిచి మార్చి మంగళకరంగా ముగించారు. ‘రండ’ పదాన్ని రండు + అఖిలార్ష అని, ‘బండ’ పదాన్ని పున్నెపున్‌ + పండు + అవు అని, ‘ముండ’ పదాన్ని రాముండు + అనవచ్చు అని, ‘కొండ’ పదాన్ని మేల్కొండు + అనవచ్చు అని పదాలను విరుస్తూ రసవంతమైన వర్ణన చేసిన గుమ్మన్నగారు ప్రతిభావంతులైన కవి. 

అవధాన నిర్వహణలో సీమాంధ్ర ప్రాంతంలో సి.వి.సుబ్బన్న శైలిని ప్రత్యేకంగా చెప్పుకుంటున్నట్లుగా, తెలంగాణ ప్రాంతంలో గుమ్మన్నగారి శైలిని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ‘ఆశుధార, అద్భుతమైన గాత్రం, సద్య: స్ఫూర్తితో కూడిన వైదుష్యం, ధారణ, నిర్లిప్తత, రాజీలేని వైఖరి, ఛందో భాషణం అనే ప్రత్యేక అంశంలో పద్యాల్లో మాట్లాడటం’ అనే విశిష్ట అంశాల సమాహారం గుమ్మన్నగారి లక్ష్మీ నరసింహశర్మ అవధానం. రెండు పదులు కూడా దాటని పిన్నవయస్సులో అష్టావధానాన్ని ప్రారంభించి ఏడు పదులు దాటిన తర్వాత కూడా అవధానాన్ని నిర్వహించిన మహోన్నత శిఖరం శ్రీ గుమ్మన్నగారు. వెంకట్రావుపేటలో ప్రారంభించిన అవధాన కార్యక్రమం తెలుగునేల నలుచెరగులా నిర్వహించి ప్రక్రియావ్యాప్తికి ఎనలేని కృషి చేసి ప్రాంతాలకతీతంగా కవిపండితుల ప్రశంసలు, ఎన్నో సన్మానాలు పొందిన ధన్యజీవి. అవసాన కాలంలో గుమ్మన్నగారు ఎంతో ఆత్మవిశ్వాసంతో మరెంతో సంతుష్ట జీవికయై పరమేశ్వరునితో పలికిన చివరి పలుకులతో ఈ వ్యాసానికి ముగింపు పలకడం సముచితం. 

‘అంతట నిండి యుండిన మహా పరమేశ్వర! నీ యొసంగిన

ట్లింతయ చాల్‌ కృతజ్ఞుడను. ఈ భవగాంగ ఝరీ తరంగ సం

క్రాంతి మహత్త్వమున్‌ కనుటకై అవకాశమొసంగి, నీ దయా

వంతుడటన్న మేల్‌ బిరుదు వాస్తవమన్న వచ: ప్రశస్తకా’

- డాక్టర్‌ బోయిన్‌పల్లి ప్రభాకర్‌

94909 01050,

(26 జనవరి గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ వర్ధంతి)

తెలంగాణ ప్రజలకు భాష ఓ పిలుపు మాత్రమే కాదు. చరిత్ర మారినా చెదరని అస్తిత్వం. అందుకే తెలంగాణ ఘన సాహిత్యానికి పెద్దపీట వేస్తూ చెలిమెను నిర్వహిస్తున్నది మన పత్రిక. అలసిసొలసిన వేళల్లో కళారూపాలైనా, పోరుబాటల్లో పాటలా మారినా, ఆత్మగౌరవాన్ని కథతో నినదించినా... తనదైన శైలి తెలంగాణది. ఆ సాహిత్యంలో మీకు ఎలాంటి అభిరుచి ఉన్నా, కలాన్ని కదిలించండి. ఆసక్తిగా, సూటిగా తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన రచనలు చేయండి.

VIDEOS

logo