శుక్రవారం 05 మార్చి 2021
Editorial - Jan 22, 2021 , 00:09:37

ట్రంపిజం మధ్య కొత్త పయనం

ట్రంపిజం మధ్య కొత్త పయనం

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ నాలుగేండ్ల పదవీకాలం ముగిసింది. కానీ దేశంలో ఆయన గీసిన విభజన రేఖలు పూర్తిగా చెరిగిపోవడానికి ఎంతకాలం పడుతుందో తెలియదు. కొత్త అధ్యక్షుడిగా వచ్చిన జో బైడెన్‌ ముందు ఈ విభజిత అమెరికా సమాజాన్ని కలపడం ఎలా అనే సమస్య ప్రధానమైంది. ట్రంప్‌ పరిపాలన ముగిసింది కానీ ట్రంపిజం ఇంకా బతికే ఉంది. వచ్చే నాలుగేండ్లు జో బైడెన్‌తోపాటు అమెరికా ప్రజలను ఇది వెంటాడుతూనే ఉంటుంది. సమాజాన్ని విభజించడం చాలా సులువు, కానీ కలపడం అత్యంత కష్టసాధ్యం. అమెరికా సమాజం ఈ సవాళ్లను ఎదుర్కోవలసి ఉంది.

సవాళ్లలో చాలావాటిని ఎదుర్కొనే సత్తా కొత్త అధ్యక్షుడైన 78 ఏండ్ల జో బైడెన్‌కు ఉందని చెప్పడానికి ఆయన సుదీర్ఘమైన పాలనా అనుభవం ఒక గీటురాయి. కానీ ట్రంపిజం వల్ల అవాంఛనీయ ప్రతికూల పరిణామాలు సంభవించే అవకాశమూ ఉంది. మొత్తంగా అమెరికాను అగ్రరాజ్యంగా నిలపడానికి చేసే ప్రయత్నం కొత్త అధ్యక్షుడికి కత్తి మీద సాము లాగానే ఉంటుంది.

రెండు వందల సంవత్సరాల ఆదర్శ ప్రజాస్వామ్య రాజ్యం అమెరికా. లిబరల్‌ డెమోక్రాటిక్‌ సిద్ధాంతంతో పని సంస్కృతి ఉన్న సమాజం. ఇన్నోవేషన్‌, ఎంట్రప్రెన్యూర్షిప్‌, వైవిధ్య భరిత స్వేచ్చాయుత వాణిజ్యం ఇవన్నీ అమెరికా సమాజంలోని లక్షణాలు. ఆ దేశ ప్రజాస్వామ్య విధానాలు కొన్ని ఇప్పటికీ చాలా దేశాలకు అనుసరణీయం. అలాంటి ఘనచరిత్రకు 45వ అధ్యక్షుడైన డొనాల్డ్‌ ట్రంప్‌ మచ్చ తెచ్చేలా వ్యవహరించారు. ప్రపంచానికే ప్రజాస్వామ్య పాఠాలు చెప్పే అమెరికా తలదించుకునేలా ప్రవర్తించారు. పదవి నుంచి దిగిపోయేటప్పుడు కూడా కొత్త అధ్యక్షుడిని వైట్‌హౌస్‌లోకి స్వాగతించే కనీస మర్యాదను పాటించలేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు రీగన్‌ ప్రారంభించిన సంప్రదాయం.. కొత్త అధ్యక్షుడికి సూచనలు సలహాలు ఇస్తూ రాసే లేఖను కూడా దొంగతనంగా తన సొరుగులో పెట్టి వైట్‌హౌస్‌ నుంచి పలాయనమయ్యారు. 

ట్రంప్‌ రాజకీయ పరిణతి లేకుండా తీసుకున్న చాలా చర్యలు సమాజాన్ని కలపడం కాకుండా విడదీశాయి. అనేక వ్యవస్థలను ఆయన ధిక్కరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు ఆపేశారు. తన పాలనలో అత్యంత వికృతంగా ప్రవర్తించారు. మాస్క్‌ను పూర్తిగా పెట్టుకోలేదు. వ్యాక్సిన్‌ విషయంలో కూడా అనేక రాజకీయాలు చేశారు. హింసకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే హింసను ప్రోత్సహించారు. చివరి మూడు నాలుగు నెలల పదవీకాలంలో మరిన్ని తప్పులు చేశారు. ఆయన చేసిన మరిన్ని చెడ్డ పనుల గురించి చెప్పుకోవాలంటే చాట భారతమే అవుతుంది. మన దేశంలో కుల మతాల ధోరణి ఎలా ఉందో అమెరికాలో కూడా తెల్ల జాతి వర్ణ అహంకారం అలాగే ఉంది. ట్రంప్‌ ఈ ఆధిపత్య భావనను ఉపయోగించుకొని అమెరికా సమాజంలో చీలికలు తీసుకువచ్చారు. తెల్లజాతి క్రైస్తవులకు తాము మైనార్టీలో పడిపోతామనే భయాన్ని, వారిలో ఒక రకమైన అభద్రతాభావాన్ని సృష్టించారు. ఇక రెండో విషయం ఆర్థికపరమైనది. తమ తల్లిదండ్రుల కంటే తమ ఆదాయం పడిపోతుందేమో అన్న భయం, తమ పిల్లలకు ఇంకా తక్కువ వస్తుందేమోననే భయం వారిని వెన్నాడింది. దీనితో ఇప్పటిదాకా అమెరికాలో ఎప్పుడో రెండు మూడు తరాల కింద వెళ్లి సెటిల్‌ అయినవారు కూడా ట్రంప్‌నకు మద్దతిచ్చారు.

జనవరి 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తూ తన మొదటి ప్రసంగంలో.. యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా    ప్రజలను ఐక్యంగా ఉంచుతానన్న జో బైడెన్‌ మొదటి మాటే ఆయనకు మొదటి సవాలుగా మారనుంది. విభజిత అమెరికా సమాజాన్ని కలిపే పని మొదట చేయాలి. విదేశాంగ విధానం విషయంలో ఇప్పటికిప్పుడు చేసే మార్పులు ఏమీ కనిపించకపోయినా చైనాతో వ్యతిరేకత కొనసాగిస్తారా లేదా సఖ్యత సాధిస్తారా అన్నది వేచిచూడాలి. ఎందుకంటే ట్రంప్‌ అమెరికా ప్రజలను చైనాకు వ్యతిరేకంగా తయారుచేసి పెట్టారు. అందువల్ల బైడెన్‌ తాత్కాలికంగానైనా చైనాకు వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుంది. ఇక అమెరికా ఆర్థికరంగం కుదేలైపోయింది. కొవిడ్‌ 19 సందర్భంగా ప్రకటించిన ఉద్దీపన పథకాలు ఒకరకంగా ఆర్థిక సంక్షోభానికి దారితీశాయి. ఇప్పటికే డాలర్ల ముద్రణ విపరీతంగా పెరిగిపోయింది. ఉత్పత్తి లేకుండా డాలర్లు ముద్రించడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. ఈ ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోవడానికి జో బైడెన్‌ ఏం చేస్తారని ప్రపంచం చూస్తున్నది. చైనాతో పోల్చుకుంటే అమెరికా ఉత్పత్తి రంగంలో వెనుకబడింది. 

ప్రపంచంలో నంబర్‌ వన్‌గా తన స్థానం నిలబెట్టుకోవాలంటే అమెరికా ఉత్పత్తి రంగంలో పెనుమార్పులు చోటుచేసుకోవాలి. 750 కోట్ల మంది జనాభా గల ప్రపంచంలో పద్దెనిమిది శాతంతో చైనా మొదటి స్థానంలో, కొంచెం అటు ఇటుగా భారత్‌ రెండోస్థానంలో ఉంది. ఆర్థిక సంస్కరణల తర్వాత చైనా తన విజ్ఞతతో దూరదృష్టితో ఉత్పత్తి రంగంలో అనేక అద్భుతాలు సాధించింది. ప్రపంచ మార్కెట్‌ పోటీలో అమెరికా వెనుకబడకుండా ఉండాలంటే అమెరికాలో తయారీ రంగం మరింత అభివృద్ధి చెందాల్సి ఉంది. వచ్చే నాలుగేండ్లలో ఎదురయ్యే సవాళ్లలో చాలావాటిని ఎదుర్కొనే సత్తా కొత్త అధ్యక్షుడైన 78 ఏండ్ల జో బైడెన్‌కు ఉందని చెప్పడానికి ఆయన సుదీర్ఘమైన పాలనా అనుభవం ఒక గీటురాయి. ఆరుసార్లు అమెరికా సెనేటర్‌గా, ఒకసారి ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఆయన రాజకీయ రంగంలో చూపిన సంయమనం, నిగ్రహం, అందరినీ కలుపుకొనిపోయే మనస్తత్వం ఇప్పుడు పరిపాలనలో అనుకూల అంశాలవుతాయి. ఇవెలా ఉన్నప్పటికీ మరోవైపు అమెరికా సమాజంలో ట్రంపు సృష్టించిన ట్రంపిజం వల్ల అవాంఛనీయ ప్రతికూల పరిణామాలు సంభవించే అవకాశమూ ఉంటుంది. మొత్తంగా అమెరికాను అగ్రరాజ్యంగా నిలపడానికి చేసే ప్రయత్నం కొత్త అధ్యక్షుడికి కత్తి మీద సాము లాగానే ఉంటుంది.

బండారు 

రామ్మోహనరావు

VIDEOS

logo