మంగళవారం 02 మార్చి 2021
Editorial - Jan 22, 2021 , 00:09:37

స్వాభిమాన భవన్‌

స్వాభిమాన భవన్‌

శ్రమవిలువ, శ్రామిక కులాల కష్టాల గురించి తెలియనివారు.. తెలిసినవారు వ్యవహరించే తీరులో తేడాలుంటాయి. శ్రామిక కులాలు సామాజిక వివక్షను ఎదుర్కొంటాయి. ఆర్థిక స్థితిగతులు సాఫీగా సాగవు. ఆత్మగౌరవంతో జీవించే వారి గురించి క్షుణ్నంగా తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో అణగారిన కులాల ఆత్మగౌరవ భవనాల పేరిట కొత్త సంకల్పాన్ని చేపట్టారు. ఇది పార్టీలకతీతంగా అందరి అభినందనలను అందుకుంటున్నది. ఈ పథకాన్ని ఇటీవల కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు బహిరంగంగా మెచ్చుకున్నారు. మనస్ఫూర్తిగా అభినందించారు. ఆయన మాత్రమే కాదు అణగారిన కులాల ఆత్మగౌరవాన్ని కాంక్షించే ప్రతి నాయకుడూ పార్టీలకు అతీతంగా ఆ పథకాన్ని ఆహ్వానిస్తున్నారు. ముఖ్యమంత్రిని అభినందిస్తున్నారు.

తెలంగాణ ఉద్యమమే ఆత్మగౌరవ ఉద్యమం. ఆత్మగౌరవ ఉద్యమానికి అద్భుత నాయకత్వం వహించిన కేసీఆర్‌ దాని కొనసాగింపుగా ఇప్పుడు అణగారిన కులాల ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నారు. ఆత్మగౌరవ ప్రతీకలివి. సాధారణంగా పాలకులు పథకాలు చేపట్టినప్పుడు ఓట్ల దృష్టితో జనాధిక్య కులాలకు ప్రాధాన్యమిస్తుంటారు. కానీ కేసీఆర్‌ అందరిలాంటి వారు కాదు. జనం ఎక్కువున్నా, తక్కువున్నా ఓట్లకు అతీతంగా అన్ని కులాలకు సమప్రాధాన్యం ఇస్తున్నారు. కేసీఆర్‌ దృష్టిలో ఏ కులమూ తక్కువ కాదు, ఏ కులమూ ఎక్కువ కాదు. అందరూ అన్ని కులాలూ సమానమే. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, సంచార కులాలన్నీ సమానంగా బతకాలన్నదే కేసీఆర్‌ ఆకాంక్ష. ఈ దృష్టితోనే ఆత్మగౌరవ భవనాలకు పునాదులు వేశారు. హైదరాబాద్‌ మహానగరంలో దళితులు, ముఖ్యంగా మాదిగలకు బాబూ జగ్జీవన్‌రాం భవన్‌, గిరిజనులకు బంజారాభవన్‌, ఆదివాసులకు కుమ్రంభీం భవన్‌ల కోసం 60 కోట్ల నిధులు కేటాయించారు. హైదరాబాద్‌లో 10 ఎకరాల స్థలంలో 10 కోట్ల వ్యయంతో 36 సంచార కులాలకు కలిపి భవన్‌ నిర్మాణానికి సంకల్పించారు. అలాగే ఇటీవల మున్నూరు కాపు, దూదేకుల, గంగపుత్ర, విశ్వకర్మ, నాయీబ్రాహ్మణ, ఆరె క్షత్రియ, వడ్డెర, కుమ్మరి, ఎరుకల, ఉప్పర, మేటి, బుడగ జంగాల, మేదర, పెరిక, చాత్తాడ శ్రీవైష్ణవ, కటిక, బొందలి, ఎల్లాపి, భ్రటాజు, వాల్మీకి బోయ, నఖాస్‌, మేర, లోధా, కచ్చి, భూంజ్వ, దేవాంగ, పట్కారి, జాండ్ర, నీలి, పూసల,  ఉప్పర మొదలగు కులాల భవనాలకు స్థలాలు, నిధులు కేటాయించారు. కొన్ని భవనాల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమై శరవేగంగా పనులు సాగుతుండగా, మరికొన్ని భవనాల పనులు ప్రారంభం కానున్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా 24 గిరిజన భవనాల నిర్మాణాన్ని చేపట్టడం చారిత్రక ఘట్టం. రాష్ట్రం మొత్తంమీద కేవలం అణగారిన కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి 500 కోట్ల రూపాయల విలువైన భూములను, అంతకు మించిన నిధులను కేటాయించడం కేసీఆర్‌ చిత్తశుద్ధికి నిదర్శనం.

అణగారిన కులాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆత్మగౌరవ భవనాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. గ్రామాల నుంచి పట్టణాలకు, నగరాలకు, రాష్ట్ర రాజధానికి పనుల నిమిత్తం ప్రతిరోజూ చాలా మంది వస్తుంటారు. వారికి బస చేయడం ఎంతో ప్రయాసతో కూడుకున్న పని. ఈ ఆత్మగౌరవ భవనాలలో వీరికి ఉచితంగా వసతి దొరుకుతుంది. అంతేకాదు, వివిధ పనులకు సంబంధించి కావాల్సిన సమాచారం లభ్యమవుతుంది. పట్టణాలు, నగరాల్లో పెండ్లి, వివిధ శుభకార్యాలకు హాళ్లు దొరకడం ఎంత కష్టమైన, ఖరీదైన వ్యవహారమో తెలిసిందే. వేలు, లక్షలు ఖర్చు చేస్తే కాని దొరకని దుస్థితి. ఇకపై ఆ దురవస్థ తప్పుతుంది. ఆయా కులస్థులు దాదాపు ఉచితంగా తమ కార్యాలు నిర్వహించుకోవచ్చు. సభలు, సమావేశాలూ జరుపుకోవచ్చు. పండుగలు, పబ్బాలు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా నిర్వహించుకోవచ్చు. తమలో సంఘటితత్వాన్ని, సోదర భావాన్ని మరింతగా పెంపొందించుకోవచ్చు.

సమాజంలో వివిధ కులాల మధ్య అంతరాలు తొలిగి ఆయా సామాజిక వర్గాలు అన్ని విధాలా సమాన స్థాయికి చేరుకోవాలి. ఈ క్రమంలో కులసంఘాల పాత్ర కూడా కీలకమే. ఆయా కులాల్లోని ధనవంతులు, విద్యావంతులు తమ వర్గాల్లో విద్య, వికాసాల కోసం కృషి చేయాలి.  అణగారిన కులాల అభివృద్ధి విషయంలో ఇప్పుడు ప్రభుత్వాల పాత్ర పెరుగుతుండగా, కులసంఘాలు, పెద్దలు ఉదాసీనంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇది  సముచితం కాదు. అలాంటివారు రాజకీయాలకు మాత్రమే పరిమితం కాకుండా అభివృద్ధి విషయంపై దృష్టి సారించాల్సిన అవసరమున్నది. కులాలు, ఉపకులాలంటూ దూరాలు పెంచుకోకుండా అందరూ కలిసి తమకున్న జ్ఞానాన్ని, ధనాన్ని కొంతైనా వెచ్చించి ఉదారత్వాన్ని చాటుకోవాలి. ఏ కార్యసాఫల్యానికైనా ఐక్యత కీలకం. నలుగురు ఒకచోట కూడాలంటే వారికంటూ ఓ చోటు ఉండాలి. ఇప్పుడు అణగారిన వర్గాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ద్వారా ఆత్మగౌరవ భవనాల రూపంలో ఆ వేదికలు రూపొందుతున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఐక్యతను, ఆత్మగౌరవాన్ని పెంచుకోవాలి. అభివృద్ధి పథాన దూసుకుపోవాలి.

(వ్యాసకర్త: గొల్ల కురుమ హక్కుల పోరాట సమితి వ్యవసస్థాపక అధ్యక్షుడు)

గోసుల శ్రీనివాస్‌ యాదవ్‌

VIDEOS

logo