మంగళవారం 02 మార్చి 2021
Editorial - Jan 22, 2021 , 00:09:37

సంపూర్ణ వ్యక్తిత్వం పోరాట తత్వం

సంపూర్ణ వ్యక్తిత్వం పోరాట తత్వం

  • తెలంగాణలో ఓ వైపు భూస్వామ్య 

వ్యవస్థ, మరోవైపు కడు పేదరికం, వెనుకబాటుతనం నెలకొని ఉండేవి. రజాకార్లు, భూస్వాములు, సంఘవ్యతిరేక శక్తులు దురాగతాలకు పాల్పడ్డారు. తెలంగాణ లోని  నాటి పరిస్థితులు కేవలం మతపరమైనవో, రాజకీయపరమైనవో కావు. సామాజిక, ఆర్థిక అంశాలతో ముడిపడిన సంక్లిష్ట పరిస్థితులు. అలాంటి సమస్యకు మతపరంగానో, రాజకీయపరంగానో మాత్రమే పరిష్కారం చూపించే ఆస్కారం లేదు. సంక్లిష్టమైన శస్త్రచికిత్స అవసరం పడింది. 

ఆ సమయంలో ప్రజాకంటక విధానాలపై సమరశంఖం పూరించి ప్రజల్ని ఉద్యమ బాటలో నడిపించిన గొప్ప నాయకుడు స్వామి రామానంద తీర్థ. ఆయన నాయకత్వ ఔన్నత్యం చరిత్రలో నిలిచిపోతుంది. రామానందతీర్థ అడుగు జాడల్లో నడిచిన శిష్యుడు, ఉరిమే ఉత్సాహంతో ఉద్యమంలో పాల్గొన్న యువనేత పీవీ నరసింహారావు. నిజాం వ్యతిరేక పోరాటంతో ఉద్యమ ప్రస్థానం మొదలుపెట్టిన పీవీ అంచెలంచెలుగా ఎదిగి దేశానికి ప్రధాని అయ్యారు. నవభారత నిర్మాతగా కీర్తి గడించారు. 

కర్ణాటకలో జన్మించిన స్వామి మహారాష్ట్రలో విద్యాభ్యాసం చేసి తెలంగాణను రాజకీయ కార్యక్షేత్రంగా మలచుకున్నారు. సన్యాసిగా గుర్తింపు కలిగిన స్వామీజీ విశ్వాసం, సేవ, త్యాగాలకు సంబంధించి శిష్యుల్లో స్ఫూర్తిని రగిల్చారు. ఆయన బోధించే అంశాలు ఎలాంటి సందిగ్ధం లేకుండా స్పష్టంగా ఉంటాయి. సంపూర్ణ, నిష్కల్మషమైన లక్ష్యాలు సాధించే క్రమంలో సమయానుకూల వ్యూహరచన చేసేవారు.

స్వామీజీ తన ఉపన్యాసాల ద్వారా 

ఆశావహ దృక్పథాన్ని, చైతన్యాన్ని కలిగించేవారు. ప్రత్యేక రాజకీయ ఆకర్షణ శక్తిగా నిలిచిన స్వామి పీడిత ప్రజల పక్షాన పోరాడి, వారి జీవితాల్లో మెరుగైన మార్పు సాధించాలని తపించారు. ఉద్యమ పంథా ఎంచుకున్న తర్వాత స్వామీజీతో చాలా మంది విభేదించారు. కొంత మంది మధ్యలోనే విరమించారు. కానీ స్వామీజీ దృఢంగా నిలబడి ముందుకు సాగారు.  

తెలంగాణ సమాజంలో పైపైన కనిపిస్తున్నది కేవలం వ్యాధి లక్షణం మాత్రమే అని, అసలు జబ్బు మూలాలు భూమిలో  ఉన్నాయని స్వామి రామానంద తెలిపారు. భూ పరిమితులు అశాంతికి ఎలా కారణమవుతున్నాయో వివరించేవారు. పరిష్కార మార్గంగా భూసంస్కరణల చర్చకు తెరలేపిన దార్శనికుడు స్వామీజీ. సంఘవ్యతిరేక శక్తులు మనుషుల్ని కుడుతున్న దోమల వంటి వారని ఈసడించుకున్నారు. అలాంటి వారిని మూలాల్లోంచి అంతమొందించాలని చెప్పేవారని పీవీ ఒక వ్యాసంలో పేర్కొన్నారు. తెలంగాణను, రామానంద తీర్థ పోరాటాన్ని వేరు చేసి చూడలేం. తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసిన వాళ్లలో రామానంద తీర్థ అగ్రగణ్యులు. 1903 అక్టోబర్‌ 3న జన్మించిన రామానంద తీర్థ 1972 జనవరి 22న మరణించారు. స్వామీజీ వేసిన బాటలో ఉద్యమ ప్రస్థానం ప్రారంభించిన పీవీ.. నిజాం పాలన అంతమొందిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత ఎన్నో చారిత్రక ఘట్టాల్ని ఆవిష్కరించారు. రామానంద తీర్థ మరణించినప్పుడు 1972లో పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. స్మారక కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారు.

(నేడు స్వామి రామానంద తీర్థ వర్ధంతి)

పి.వి.ప్రభాకర్‌ రావు 

(వ్యాసకర్త పీవీ తనయుడు) 


VIDEOS

logo