సోమవారం 08 మార్చి 2021
Editorial - Jan 19, 2021 , 00:38:20

సృజనాత్మక పారిశ్రామికవేత్త

సృజనాత్మక పారిశ్రామికవేత్త

కిషన్‌రావు 83 ఏండ్ల వయసులో ఈ నెల 12న తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని గోషామహల్‌ పాఠశాలలో చదువుకున్న కిషన్‌రావు చిన్నవయసులోనే పారిశ్రామికరంగాన్ని ఎంచుకున్నారు. ఐదుగురితో ప్రారంభమైన చుట్టల పరిశ్రమ 1967 నాటికి 2 వేల మందికి ఉపాధి ఇచ్చింది. ఆంప్రో బిస్కెట్ల అమ్మకాల్లో 1975 నాటికి దేశంలోని ఇతర బిస్కెట్‌ కంపెనీలతో పోటీపడింది.

ఇటీవల మరణించిన తెలంగాణ తొలితరం పారిశ్రామికవేత్త మ్యాడం కిషన్‌రావును  బాంబినో సేమియా సృష్టికర్త అనే గుర్తు చేసుకుంటారు. కానీ ఆయన పారిశ్రామిక రంగంలో మొదటి అడుగు ఘంట చుట్టల తయారీతో పడింది. దాన్ని ఆయన తన సోదరుడు జనార్దనరావుతో కలిసి 1953లో స్థాపించారు. పొగాకు రెమ్మల్ని కొనుక్కొని చుట్టలుగా చేసుకొని తాగే కాలంలో ఆయన ఘంటా చుట్టలను ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత 1970లో ఆంప్రో బిస్కెట్ల పరిశ్రమ, 1982లో బాంబినో వెర్మసిల్లి స్థాపన జరిగింది. 

జర్మనీలోని ఓ ట్రేడ్‌ ఫేర్‌కు వెళ్లినప్పుడు కిషన్‌రావు అక్కడ సేమియా తయారీ యంత్రాన్ని చూశారు. పండుగలప్పుడు తన తల్లి చేతులతో సేమియాను తయారుచేస్తూ పడే బాధను గుర్తుంచుకున్న కిషన్‌రావు వెంటనే దానిని కొనాలనుకున్నారు. అలా 1982లో హైదరాబాద్‌కు 37 కిలో మీటర్ల దూరంలోని బీబీనగర్‌లో బాంబినో వర్మసిల్లి పరిశ్రమ స్థాపన జరిగింది. అది మన దేశంలోని మొదటి సేమియా ఫ్యాక్టరీ. యంత్రాలపై తయారయ్యే బాంబినో సేమియా సన్నగా, ఎక్కువకాలం నిల్వ ఉండటం వల్ల ప్రజలకు చేరువైంది. పండుగలకే కాకుండా ఎప్పుడంటే అప్పుడు సేమియా పాయసం రుచిచూసే భాగ్యాన్ని కిషన్‌రావు కల్పించారు. అమ్మకాలు పెరగడంతో ఢిల్లీ, ఇండోర్‌, నాగపూర్‌, తిరుపతిలలో బాంబినో ఫ్యాక్టరీ శాఖలను స్థాపించారు.

పాయసంగానే కాకుండా ఇతర వంటకాల కోసం సేమియాకు మార్పులు చేశారు. అలా మనకు సేమియా ఉప్మా పరిచయమైంది. సేమియాతో చేసే వంటకాల పోటీలను నిర్వహించి దాని వాడకం విస్తృతిని పెంచగలిగారు. ప్యాకెట్‌ కవర్లపై వివిధ రెసిపీలు తయారుచేసే పద్ధతులను ప్రచురించి అందరికి తెలిసేలా చేశారు. బాంబినో దేశంలో నెంబర్‌ వన్‌గా కొనసాగడమే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, కెనెడా, నెదర్లాండ్స్‌ తదితర దేశాలకు ఎగుమతవుతున్నది.

ఎప్పుడూ ప్రచారం కోరుకోని కిషన్‌రావు సామాజిక సేవా కార్యక్రమాల్లో మాత్రం ముందుండేవారు. 2014లో విశాఖ హుద్‌హుద్‌ తుఫాను బాధితులకు తమ కంపెనీ ఉత్పత్తులను ఉచితంగా పంపిణీ చేశారు. ఆ కృషికి గుర్తింపుగా ‘అవుట్‌లుక్‌' పత్రిక కిషన్‌రావు ముఖచిత్రంతో సంచికను వెలువరించింది. జమ్ముకశ్మీర్‌, చెన్నై, అస్సాం, బీహార్‌ తదితర రాష్ర్టాలలో వరద బాధితులకు తమ సంస్థ తరపున సేవలందించారు. కాచిగూడలోని కాపు సంఘం ఆవరణలో వేయి మందికి సరిపడా హాలును నిర్మించారు. కిషన్‌రావు వినూత్న దృష్టి, సేవాభావం పారిశ్రామికవేత్తలకు ఆదర్శప్రాయం.

బి.నర్సన్‌ 

VIDEOS

logo