సోమవారం 01 మార్చి 2021
Editorial - Jan 17, 2021 , 00:28:47

లోభంపై కావ్య ఖడ్గం

లోభంపై కావ్య ఖడ్గం

సంప్రదాయ కవిత్వాన్ని, ఆధునిక భావజాలాన్ని మేళవించిన అరుదైన మహా కవి మామిడిపల్లి సాంబశివ శర్మ. ఆయనకు శివుడంటే ఎంత భక్తో, అసమానతలు లేని సమాజమంటే అంత ప్రీతి. అన్ని సాహిత్య ప్రక్రియలు ఆయనకు కరతలామలకమే.

నటుడు, దర్శకుడయిన సాంబశివ శర్మ మూలంగా వేములవాడ నాటకరంగంలో స్వర్ణయుగం ఆవిష్కృతమైంది. చిన్న పంచెతో మోకాళ్ళకు పైగా కట్టుకున్న ధోవతి. పైన మరో చిన్న పంచె. చంకలో దుడ్దు కర్ర, చేతిలో పుస్తకాల సంచి. వేముల వాడ వీధుల్లో పద్యాలు అల్లుతూ పైకి చదువుతూ తిరిగేవారు. దాదాపు పద్నాలుగు సుప్రభాతాలు రాశారు. వేములవాడ, కాళేశ్వరం, బాసర దేవదేవుళ్ళు ఆయన సుప్రభాతంతోనే మేలుకుంటారు. త్రికరణ శుద్ధిగా సామ్యవాదాన్ని నమ్మిన సాంబశివ శర్మ ఏనాడూ తన కోసం నాలుగు రాళ్ళు వెనుకేసుకోలేదు. పూట గడిస్తే చాలన్నట్టు బతికేవారు. పీవీ నరసింహారావు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనను వేముల వాడ ఆస్థాన పండితుడిగా నియమించి కుటుంబానికి భుక్తి కల్పించారు. ఇల్లు శిథిలమైపోవడంతో స్థానిక సాహితీవేత్తలు చందాలు సేకరించి నిలువనీడ కల్పించారు. 

సాంబశివ శర్మ శతజయంతి సంవత్సరం సందర్భంగా‘చెలిమె’ అందిస్తున్న రెండవ  వ్యాసమిది. ఆయన కృతుల్లో మకుటాయమానమైన  కావ్యం ‘లోభ సంహారం’పై వ్యాసమిది. 

కీర్తిశేషులు మామిడిపల్లి సాంబశివ శర్మ మధుర ఝుంకారము, జయశ్రీ, కుంజ విహారము, ముక్తాహారముల వంటి ఖండ కావ్యాలను, సుప్రభాత రచనలను, నాటకాలను, ద్విపద సాహిత్యాన్ని అందించారు. సమాజ సంస్కరణే  తన అంతిమ లక్ష్యంగా లోక కురీతిమీద కుటిల స్వభావాలమీద , క్రూర మనస్థితిపై తన ‘లోభ సంహారం’ కావ్య ఖడ్గాన్ని ఝుళిపించారు. 

‘గబ్బిలము మంత్రి, రాజు ఘూకంబు, ప్రజలు పైడి కంటెలు, సేనాని పంతురాగ / కటిక చీకటి నగరంబు, గాలి కోట, పన్ను లేదు, దున్నుట లేదు, పంట లేదు’ అంటూ వర్తమాన పరిస్థితిన ఎత్తిచూపారు. అక్రమాలు, అరాచకం విచ్చలవిడిగా తిరిగేది రాత్రిపూటే. ఆ చీకటి రాజ్యం లో గబ్బిలాలు గుడ్లగూబలు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి, అందుకే వాటి నివాసం కూడా గాలి కోట అంటాడు కవి. 

సంప్రదాయ కవితను, ఛందోబద్ధ కవితను అంటరానివిగా నూతన వ్యవస్థ నిర్మాణానికి పనికిరానివి గా భావించే కాలంలో     పదునైన భావ సంచాలనంతో సృష్టించిన కావ్యం లోభ సంహారం. లోభం అనగా పిసినారితనం. ధన దాహం స్వార్థచింతన దురాలోచన అవినీతి ప్రధాన రూపాలుగా విజృంభించి మానవ స్వభావాలను కాలుష్య కాసారాలుగా మారుస్తున్న వైనంపై కవి తన పద్యాలలో నిరసనను వ్యక్తం చేశారు.   

‘కూట ప్రవాద కలిలం కులశీల దూరం  

కాలం కళంకిత మనస్కజనానుకూలం  

ఉద్వీక్ష్య సాంబకవినా శివ భక్తి భాజా  

నిష్పాదితా కృతిరియం కుపథం నిరుంధ్యాత్‌'.

కుటిల వాదాలతో కూడుకున్న కులశీలాలను పక్కనబెట్టి, చెడు ఆలోచనలు గల మనసు లతో వ్యవహరించే జనులకు అనుకూలమైన ఈప్రస్తుత కాలాన్ని పరిశీలించి శివ భక్తి పాత్రుడనయిన సాంబ కవిగా రచించి అందిస్తున్న నా ఈ కృతి సమస్త దుర్మార్గాలను అడ్డుకొను గాక అని తన కావ్య ప్రస్తావనలో తెలియజేశారు.

సాంబకవి తన ముందుమాటలో ‘సంఘంలో నీతినియమాలు నశించాయి. ప్రేమ, త్యాగము, దయ మచ్చుకైనా కానరాకున్నాయి. ఈ పాపము పరిహారం కావలసిన సమయం ఆసన్నమైంది’ అంటారు. దేశంలో వసతులు, సంపదలు ఏ కొద్దిమంది చేతుల్లోనో బందీ అయి ఉండకూడదు అన్న ఆధునిక భావన ఆ రోజుల్లోనే కవిలో ఉండడం గమనార్హం. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశం బాగుపడుతుందని ఎలా కలగన్నాడో చెబుతూ

 ‘హక్కులు భారతీయులవి యంచు / స్వతంత్రత వచ్చే నంచుమా / ప్రక్కన బల్లెమైన పరదేశపు పాలన పోయె నంచు మా / యక్కరలెల్ల దీర్చి మాము హాయిగ నుంచు ప్రభుత్వమింక చేజిక్కెనటంచునుబ్బితిమి ‘సీ’ యవి స్వప్న సమంబు లాయెరా.. ’అంటూ ఆనాటి నిరాశా స్థితిని కళ్ళకు కట్టారు.

దేశంలో నిండి ఉన్న నదీ జలాలు సహజ సంపదలు అభివృద్ధులు అన్నీ ఉన్నా ‘దండుగయె కాదె చేతికందని ఫలంబు’ అని వాపోతారు. ‘పండినవి సస్యములా ? మహా పాతకములా? పెరిగినవి విభవమ్ములా? విప్లవములా ? తలచినది విశ్వ హితమా? నిర్దయుల మతమా?’ అని ఈ సమాజాన్ని నిగ్గదీస్తాడు.  ‘బొంకులాడు పదధరుల్‌ మాతృభూమికి బరువుగాదే’ అంటారు. 

లోభాన్ని ఆదరించే అవినీతిపరులను గురించి వివరిస్తూ -వీళ్లంతా పాపభీతి లేకుండా పరులను హింసిస్తూనే ఉన్నారని, మేకవన్నె పులులై గంగిరెద్దుల వేషాలు కట్టి మోసగిస్తూ అందలాలు అందుకుంటారని వీళ్లంతా కప్ప కూత ఫణులనీ, మేకవన్నె పులులనీ, తేనె పూసిన కత్తులనీ, అందుకే ఓ లోభమా వీళ్లు నిన్ను ఆశ్రయించి నీ ప్రాపకాన్ని పొందుతున్నారని విమర్శిస్తారు.

‘ఇన్ని  పాపాలను గాదెలో పోసి ఎందుకు కాపాడుతున్నావు’ అంటారు. లోభమా ! ఇలా నిలదీసి నిన్నడిగితే  లేదు లేదందువా? బుద్ధి లేదా? సిగ్గు లేదా? మా మీద దయనీకు లేదా చెపుమా  అని లోభాన్ని ప్రశ్నిస్తారు.

‘ధరలను చూసిన పెంచు వారికి దయా దాక్షిణ్య ముల్‌ సున్న/ఆఫీసుల లంచగొండితనమున్‌ త్రోయంగరాదౌర’ అని కుండబద్దలు కొట్టి  ‘బాపురే భారత వాస సౌఖ్యమిదియా ? పొల్పేది బల్పేదకున్‌' అని వేదన పడతారు.

సంఘానికి వివేక దృష్టి  దృష్టి లేకపోతే రిక్తులైన అశక్తులను పట్టించుకునే రాజే కరువు అవుతాడంటూ ‘సంఘమునకు  వివేక లోచనము లేదు, రిక్తులనశక్తులన్‌ మలుపు రేడు లేడు’ అని వాపోతాడు. ఇలా కావ్యం నిండా సామాజిక రుగ్మతల మూలాలను ఆలోచనాత్మకంగా వివరించారు. చివరలో  ‘మారుపడకున్న మనకు సేమంబులేదు/ ఖలులు నశియింప కున్న సౌఖ్యంబు లేదు’  అంటారు.

అంతేకాక ఈ లోభమాయ ఎక్కడ ఎక్కడ ఉందో వివరిస్తూ ‘శాసన మందు మాయ, జన సంఘము లందున మాయ, దేవతావాసము లందున మాయ, పద వాసుల నాల్కల యందు మాయ, ఆఫీసుల యందు మాయ, మహాఫీసులయందున మాయ, పాంసులా హాసమునందు మాయ, భిషగగ్రగణ్యులందున మాయ లోభమా’ అని వివరిస్తారు.

 పది తలలుగా విస్తరించిన దుర్మార్గాలను 

తుదముట్టించాలి అంటే వాటికి మూలమైన లోభాన్ని ముందుగా సంహరించాలి. అలాంటి లోభం ఇప్పుడు దేశం నలుమూలలా పాకిపోయి వెతికిన చోటల్లా వికృతంగా ఎదురు పడుతూనే ఉంది. పంచ మహా పాతకాలు చేయిస్తూ పట్టుబడకుండా ఉండే దుష్ట శక్తి ఈ లోభం. విశ్వవ్యాప్తంగా తన 

ప్రతాపాన్ని చవి చూపిస్తున్న ఈ లోభం ఎక్కడెక్కడ దాక్కుని ఉందో తెలుపుతూ లోభ సంహారం ద్వారా లోక శ్రేయస్సు ఎలా కలుగుతుందో వివరించే కావ్యం ఇది. 

సంపదలు సృష్టించిన వారికి వాటి ఫలితాలు అందడం లేదు అంటూ మరెవరికీ అందుతున్నాయి అంటే లక్క ఇల్లు కాల్చి నిక్కిన నక్కలకు అందుతున్నాయి అని నిజాల నిప్పులు చెరుగుతారు. ‘నీలుగుబోతులున్‌, ఖలులు, నీచులు దుష్పాలకులుగా ఉంటే ఇంకా సేమం ఎక్కడ ఉంటుంది’ అని ప్రశ్నిస్తారు కవి.

సమాజంలో మానవత్వం నశించి, మనుషుల మధ్య సమానత్వం అంతరించి, పాప చింతన, దుర్వర్తన వేళ్లూనుకొని మనిషిని మనిషి దోచే వ్యవస్థగా మారుతున్న వైనాన్ని సాంబశివ శర్మ పలు కోణాలనుంచి దర్శింపజేస్తారు.  

తాను అనుభవించిన పేదరికాన్ని, పేదరికం లోని దుఃఖభాజనమైన స్థితిని గురించి దిగులు పడుతూ ‘కొడవలి నేల జారినది, కొంగు బజారున జారె, నెన్నియో గడబిడలయ్యె, నా పనులు గట్టుకు మోసిన కట్టెలయ్యె, నా యొడయెడ ఏమిసెప్పుదునయో బ్రతుకిట్టుల బండలయ్యెరా, కుడువను కూడు, కట్టుకొన గుడ్డయు లేక కృషి నుంచే నా యొడల్‌, నడుము మరింత సన్నమయె, నవ్వు మొగమ్మది పెంకయయ్యెరా’ అంటూ కన్నీరు పెట్టించారు. అంతేకాదు

ఇప్పటి సమాజంలో ఎవరు ఆదర్శవంతులో చెబుతూ ‘ఉదరమ్ములో దాగి యుండునసూయకు / స్వస్తి చెప్పిన వాడే శాంతిదూత / ఎదలోన ఎదిగిన ఈర్ష్యకు నుత్తర పూజ చేసిన వాడే పుణ్యమూర్తి/ మనసులో నిండిన మచ్చరమ్ముకు తిలాంజలి నొసగిన వాడే శాస్త్రవేత్త / పుర్రెలో పుట్టిన పొగరున కుత్తరక్రియలొనర్చిన వాడె ప్రేమవేది / అంతరంగ దోషాలకుద్యాపనంబు /బాహ్య భేద భావాలకుద్వాసనంబు జేసిమను మానవుడె జగజ్జేత సుమ్మి’ అని ప్రకటించారు.

మన సమాజాన్ని పట్టిపీడిస్తున్న లోభం వికృత రూపాలనూ, స్వరాలను ప్రతి పద్యపాదంలో చిత్రించారు. సమాజంలో వేళ్ళూనుకున్న లోభ సంహారానికి ప్రతి ఒక్కరూ మనసా వాచా కర్మణా సంసిద్ధులుగావలసిందేనని పిలుపునిచ్చారు. 

 (మామిడిపల్లి సాంబశివ శర్మ శతజయంతి సంవత్సరం సందర్భంగా )

- వఝల శివకుమార్‌ 9441883210 


VIDEOS

logo