బుధవారం 27 జనవరి 2021
Editorial - Jan 14, 2021 , 01:15:07

ఉత్తమ కాల మహిమ

ఉత్తమ కాల మహిమ

ఈ పండుగ ప్రతి సంవత్సరమితర పండుగలు వచ్చినటుల ఒకే దినము రాదు. ఏలన, ఈ పండుగ సూర్యుని సంచారమును బట్టి యేర్పడును. సూర్యుడారుమాసముల కాలము దక్షిణాయనమందుండి పిమ్మట ఉత్తరాయణమునకు బోవును. ఆ సందర్భమునీ పండుగను జేయుదురు. సాధారణముగానిది మార్గశీర్ష మాసమందు వచ్చును; లేదా పుష్యమాసమందైనా వచ్చును.

ఈ పండుగనాడు నువ్వులు, నెయ్యి, గొంగళ్లు బీదలకు దానము చేయవలయునని వ్రతకారులాదేశించినారు. దీనియందు మంచి యర్థము కలదు. ఈ పండుగ శీతకాలమందు వచ్చును. కావున పై మూడు వస్తువులుష్ణమును గలిగించునవి కాన నీ విధి చెప్పబడినది. 

సంక్రమణమునాడు జనులు ఉపవసించి పితరులకు తిలోదకములు విడిచి తామును నూలపిండితో శరీరమును రుద్దుకొని స్నానము చేయుదురు. కొన్ని ప్రాంతములందు సంక్రాంతి పండుగ మూడు దినముల వఱకు కూడా చేయుచుందురు. ప్రతి దినము ఇంటి ముంగట నలికి, రంగురంగుల పిండితో మ్రుగ్గులు పెట్టి, గోమయముతో గురుగులు చేసి, వానిలో నానా విధములగు రంగుల పూలను, నూలు బియ్యమును, రేగు పండ్లను పెట్టి యిండ్లనలంకరించికొందురు. ప్రతి దివసము కొందఱు నూలనంటించిన రొట్టెలను జేసి భుజింతురు. సజ్జలు పండు భూములలో నివసించువారు సజ్జ రొట్టెలకు నిండుగా నూలనంటించి చేసి భుజింతురు. సంక్రాంతి పండుగ చలికాలమందు వచ్చును. సజ్జలు ఉష్ణము గలిగించు స్వభావము కలవి. పండుగనాడు నానా విధములగు కూరలన్నింటిని గలిపి వండుదురు. ఆ దినము బ్రాహ్మణులకు కూరగాయలను, ధాన్యమును, దక్షిణనునిచ్చెదరు.

మొదటి దినము చేయు పండుగను భోగి యందురు. రెండవ దినము మకర సంక్రాంతి యని యందురు. పండుగనాడు బ్రాహ్మణులకు కుంకుమ, సుగంధ ద్రవ్యములు, తండులములు, గుడము, పుష్పములు, వస్త్రములు మున్నగువానిని స్త్రీలు దానము చేయవలయునని పురాణములు బోధించుచున్నవి. ఈ పండుగ కేవలము సూర్యుని ఉద్దేశించి చేయబడునట్టిది. దక్షిణము నుంచి యుత్తరాయణమునకు బోవును గాన నీ పండుగ జేయబడును. 

సంక్రాంతి మాసమున కొకసారి వచ్చును. జ్యోతిశ్శాస్త్రమందు 12 నక్షత్ర రాసుల నేర్పాటుచేసియున్నారు. ఒక్కొక్క మాసమందు సూర్యుడొక్కొక్క రాశియందు వచ్చుటచే నామాసమందా నక్షత్రముతో సంబంధించిన సంక్రాంతి యని యందురు. ఈ సంక్రాంతులలో ముఖ్యమైనది మకర సంక్రాంతి. అనగా నా దివసము సూర్యుడు మకరరాశి యందు వచ్చును. కర్కాటకము నుండి మకర సంక్రాంతి వఱకు సూర్యుడించుక దక్షిణాభిముఖముగా సంచరించుట చేత నీకాలమును దక్షిణాయనమని యందురు. తిరుగ మకర సంక్రాంతి నుండి కర్కాటక సంక్రాంతి వఱకు సూర్యడించుక యుత్తరాభిముఖుడై సంచరించుటచే నీకాలమునుత్తరాయణమని అందురు. 

ఉత్తరాయణము దేవతలకు ముఖ్యమనియు, దక్షిణాయనము పితృదేవతలకు ముఖ్యమనియు చెప్పుదురు. కావుననే ఉత్తరాయణ కాలముత్తమ కాలమనియు, దక్షిణాయన కాలము కీడు కాలమనియు జనులు విశ్వసింతురు. మఱియు దక్షిణాయన కాలమందు దక్షిణ దిశ ద్వారము తెఱచియుంచి, యుత్తరద్వారము మూసియుంచుదురనియు, నుత్తరాయణకాలమందే యుత్తర ద్వారము తెఱచి యుంచుదురనియు జన విశ్వాసము. ఇందుచే దక్షిణాయన కాలమందు మరణించినవారి కుత్తమగతి యుండదనియు, భీష్ముడు దక్షిణాయనములో యుద్ధభూమిపై బడిన వాడైనను ఉత్తరాయణము వఱకు ప్రాణముల నిలుపుకొనియుండెననియు జెప్పుదురు. మకర సంక్రాంతి నాడు సూర్యుడుత్తరాయణగతుడగుటచే జనులీనాడు సంక్రాంతి పండుగ చేయుదురని విశదమగును.

హిందీ గ్రంథకారులగు భవానీ ప్రసాదు యభిప్రాయ మొకటి గమనింపదగినది. అదేదన: ఈ పండుగనాడు నువ్వులు, నెయ్యి, గొంగళ్లు బీదలకు దానము చేయవలయునని వ్రతకారులాదేశించినారు. దీనియందు మంచి యర్థము కలదు. ఈ పండుగ శీతకాలమందు వచ్చును. కావున పై మూడు వస్తువులుష్ణమును గలిగించునవి కాన నీ విధి చెప్పబడినది.

నువ్వుల ద్రవ్యగుణమును గుఱించి వైద్య గ్రంథములందిది యుష్ణము గలిగించునదని వ్రాసినారు. మఱియు కంబలి విషయమై చెప్పవలసింది లేదు. ‘కం బలవంతం న బాధతే శీతః’ యని శ్లిష్టోక్తిగా నొక కవి వర్ణించియున్నాడు. ‘నెయ్యి ఓజస్సు, తేజస్సు, అగ్ని దీపనము కలిగించునదని వైద్య గ్రంథములు చాటుచున్నవి. కాన అత్యంత శీతలముండు నుత్తర హిందుస్థానమందీ పండగనాడీ వస్తువుల దానము చాల సమంజసము.’ సంక్రాంతి సర్వసాధారణముగా చలికాలమందు వచ్చును. ఈ సందర్భముననే శ్రీనాథకవి తన శివరాత్రి మాహాత్మ్యమందిట్లు రమ్యముగా వర్ణించినాడు:

ఇండ్ల మొదలను నీరెండ నీడికలను 

ననుగుదమ్ముడు నన్నయ నాటలాడు

అత్తయును కోడలును గుమ్ములాడు కుమ్ము

గాచు చోటికి మకర సంక్రాంతి వేళ

( సురవరం ప్రతాపరెడ్డి రచించిన ‘హిందువుల పండుగలు’ పుస్తకం నుంచి..) 

సురవరం ప్రతాపరెడ్డిlogo