శుక్రవారం 22 జనవరి 2021
Editorial - Jan 14, 2021 , 01:15:07

శాస్త్రవేత్తకూ తప్పని వివక్ష

శాస్త్రవేత్తకూ తప్పని వివక్ష

ఇటీవల పాకిస్థాన్‌కు చెందిన ఒక వీడియోను సోషల్‌ మీడియాలో వేల మంది చూడటంతో ఆ విషయం మళ్లా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది! నిజానికి అది కొత్త సంగతి కాదు, ఓ రకంగా చెప్పాలంటే 1974, లేదా మరో రకంగా చెప్పాలంటే 1953, లేదా ఇంకా వివరంగా చెప్పాలంటే అంతకుముందు నుంచి ఈ సమస్య రగులుతూనే ఉంది. ప్రఖ్యాత న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ అబ్దుస్‌ సలాం పోస్టర్‌పై కొందరు నల్లరంగు పోస్తున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తున్నది. ఈ విషయం మొదటిసారి తెలుసుకున్నవారికైతే తప్పక ఆశ్చర్యం కలుగక మానదు. కానీ వివరాల్లోకి వెళ్తే కొంత నిర్వేదంతో పాటు ఆవేశం కూడా వస్తుంది!

అబ్దుస్‌ సలాం అహ్మదీయ తెగకు చెందిన వ్యక్తి. పాక్‌లో మత ఘర్షణలు తక్కువేం కాదని చరిత్ర చెప్తున్నది. 1953లో అహ్మదీయులకు వ్యతిరేకంగా ఘర్షణలు జరిగాయి. ఈ సందర్భంలోనే అబ్దుస్‌ సలాం పాక్‌ నుంచి కేంబ్రిడ్జి వెళ్లిపోయారు. అయితే జనరల్‌ అయూబ్‌ ఖాన్‌ ముస్లింలలోని విభేదాలను పెద్దగా పట్టించుకోలేదు కనుకనే అబ్దుస్‌ సలాంను 1960లో సైంటిఫిక్‌ అడ్వయిజర్‌గా నియమించారు.

ప్రస్తుతం పాకిస్థాన్‌లోని ఝంగ్‌ పట్టణంలో అబ్దుస్‌ సలాం 1926 జనవరి 29న జన్మించారు. ఉర్దూ, ఇంగ్లీషు సాహిత్యం మీద అభిరుచిగల అబ్దుస్‌ సలాంకు గణితం అంటే ఆసక్తి. బీఏ మేథమెటిక్స్‌ విద్యార్థిగా శ్రీనివాస రామానుజం ప్రతిపాదించిన గణిత సమస్యల మీద కృషిచేసి పరిశోధన పత్రం వెలువరించిన నాటికి, ఆయనకు 20 ఏండ్లు కూడా నిండలేదు. కేంబ్రిడ్జిలోని కేవెండిష్‌ లాబోరేటరి నుంచి క్వాంటం థియరీపై పీహెచ్‌డీ పొందారు. ఈ పట్టా వచ్చేముందే ఆయన పరిశోధనకు ప్రాచుర్యంతో పాటు ‘యూరమ్స్‌ ప్రైజ్‌' కూడా లభించింది. పాల్‌ డిరాక్‌, రిచర్డ్‌ ఫెన్‌మన్‌ వంటివారిని కలతపెట్టిన పరిశోధన సమస్యను సులువుగా పరిష్కరించింది అబ్దుస్‌ సలాం. 1951లో డాక్టరేట్‌ సాధించిన తర్వాత లాహోర్‌ తిరిగి వచ్చి గవర్నమెంట్‌ కాలేజీ యూనివర్సిటీలో మేథమెటిక్స్‌ ప్రొఫెసర్‌గా చేరారు. 1953లో అల్లర్ల కారణంగా పాక్‌ నుంచి తిరిగి కేంబ్రిడ్జికి వెళ్లిపోయారు. 33 ఏండ్లకే రాయల్‌ సొసైటీ సభ్యుడిగా (1959లో) చరిత్ర సృష్టించారు.

1960-1974 దాకా పాక్‌ శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖకు సలహాదారుగా కొనసాగారు. 1974లో పాకిస్థాన్‌ నుంచి వెళ్లిపోయారు. 1979 నోబెల్‌ బహుమతిని ఫిజిక్స్‌లో షెల్డన్‌ గ్లాషో, స్టీవెన్‌ వెయిన్‌బెర్గ్‌తో సంయుక్తంగా పొందారు. నిజానికి అప్పటివరకు ఒక ముస్లిం (అన్వర్‌ సాదత్‌, ఈజిప్ట్‌)కు మాత్రమే నోబెల్‌ వచ్చింది. అబ్దుస్‌ సలాం తొలి ముస్లిం సైన్స్‌ నోబెల్‌ గ్రహీత. తర్వాతికాలంలో సైన్స్‌ విభాగాల్లో 1999లో ఒకరికి, 2015లో మరొకరికి లభించాయి. ఆయన 1996 నవంబర్‌ 21న ఇంగ్లండ్‌, ఆక్స్‌ఫర్డ్‌లో చనిపోయారు!

మరిప్పుడు ఈ వీడియో ఏమిటి? ఆయన పోస్ట ర్‌కు రంగులు పూయడం ఎందుకు? పతాక శీర్షికల వరకే బయటి రాష్ర్టాల, దేశాల వార్తలు పరిమితం కావడంతో ఇలాంటి విషయాలు అందరి దృష్టికి రావడం లేదు. ముస్లింలలో సున్నీలు, షియాలుంటారని తెలుసు. వీరే కాకుండా అహ్మదీయులూ ఉంటారు. అబ్దుస్‌ సలాం అహ్మదీయ తెగకు చెందిన వ్యక్తి. పాక్‌లో మత ఘర్షణలు తక్కువేం కాదని చరిత్ర చెప్తున్నది. 1953లో అహ్మదీయులకు వ్యతిరేకంగా ఘర్షణలు జరిగాయి. ఈ సందర్భంలోనే అబ్దుస్‌ సలాం పాక్‌ నుంచి కేంబ్రిడ్జి వెళ్లిపోయారు. అయితే జనరల్‌ అయూబ్‌ ఖాన్‌ ముస్లింలలోని విభేదాలను పెద్దగా పట్టించుకోలేదు కనుకనే అబ్దుస్‌ సలాంను 1960లో సైంటిఫిక్‌ అడ్వయిజర్‌గా నియమించారు. 1974లో పాక్‌ పార్లమెంట్‌ అహ్మదీయులను ముస్లింలు కారని ప్రకటించింది. ప్రభుత్వోద్యోగాలకు అర్హత లేకుండా చేశారు. పాస్‌పోర్ట్‌ కావాలంటే కూడా సాధ్యం కాని పరిస్థితి సృష్టించారు. దీనికి నిరసనగా అబ్దుస్‌ పాక్‌ నుంచి వెళ్లిపోయారు. 1992లో లాహోర్‌లోని గవర్నమెంట్‌ కాలేజీ పూర్వ విద్యార్థులను ప్రస్తావిస్తూ అప్పటి ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ లాఘవంగా అబ్దుస్‌ పేరును విస్మరించారు. అయితే 2016లో యురోపియన్‌ న్యూక్లియర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ సందర్శించి, ప్రఖ్యాత అబ్దుస్‌ సలాం కృషి ఏమిటో తెలుసుకున్నారు. అంతేకాదు, జెనివాలో అబ్దుస్‌ సలాం పేరిట ఉన్న రోడ్డు మీద షికారుకు కూడా వెళ్లివచ్చారు.

నవాజ్‌ షరీఫ్‌ పాక్‌ తిరిగివచ్చాక 2016 డిసెంబర్‌ 29న క్వాద్‌-యి-అజామ్‌ యూనివర్సిటీ అధికారులకు ప్రధాని కార్యాలయం ఒక ఉత్తరం రాసింది. ఆ క్యాంపస్‌లో ఉండే నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఫిజిక్స్‌ సంస్థ పేరును ప్రొఫెసర్‌ అబ్దుస్‌ సలాం సెంటర్‌ ఫర్‌ ఫిజిక్స్‌గా మార్చాలని కోరింది. అబ్దుస్‌ సలాం 1964లో ఇటలీలోని ట్రీస్టి నగరంలో ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ థిరిటికల్‌ ఫిజిక్స్‌ను స్థాపించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక గన్న సంస్థ. అటువంటి రీతిలో కనీసం చిన్న స్థాయిలోనైనా దీనిని వృద్ధి చేయాలని శిష్యుడు రియాజుద్దీన్‌ సహాయంతో 1980లలో ప్రయత్నించారు. 

మతపరమైన వివక్ష ప్రపంచస్థాయి శాస్త్రవేత్త మీద ఏ స్థాయిలో ఉందనడానికి ఈ చారిత్రక విశేషాలూ, వీడియో విశేషాలు సాక్ష్యం. ఆ గొప్ప శాస్త్రవేత్త కనుమూసి పాతికేండ్లయినా ఆ ద్వేషం అలా కొనసాగడం బాధాకరం!

నాగసూరి 

వేణుగోపాల్‌


logo