శనివారం 06 మార్చి 2021
Editorial - Jan 14, 2021 , 01:15:07

సరికొత్త క్రాంతి

సరికొత్త క్రాంతి

పాలకాయల రేగుబండ్ల స్నానాలాడి,  క్రొంబట్టు పుట్టమ్ము కూర్చిగట్టి,/ నువ్వులు బెల్లంబున్‌ మెక్కి పచ్చని జామ పండులను ముచ్చటగ నమిలి,/ క్రొత్త బియ్యపు కూడు గుడిచి త్రేన్పులు తీసి పచ్చ దోసల మునిపంట గొరికి,/ చకిలాలు కరకర చప్పుళ్ళు చేయగా దవడలాడించి రేబవళులందు/.. ముంగిళుల రంగవల్లికల్‌ మురిసిపోవ/ భుగభుగ భుగాయమానమై భోగిమంట /లన్ని దిక్కుల వెలుగొంది అందగింప/వచ్చె సంక్రాంతి, మానవాళికి శాంతి’.. అంటూ సంక్రాంతి శోభను దాశరథి రమణీయంగా వర్ణించాడు. హేమంత రుతువులో.. చలిచలి వేళ అడుగిడుతుంది సంక్రాంతి. అందుకే ‘అహములు సన్నములయ్యె, దహనము హితమయ్యె, దీర్ఘ దశలయ్యె నిశల్‌/ బహు శీతోపేతంబై యుహుయహూ యని వణకె లోకముర్వీనాథా’ అని హేమంత రుతువులో పరిస్థితిని వర్ణించాడు పోతన. వణికించే చలిలో- నువ్వులు- బెల్లం తినడం, కొత్త బియ్యపు భోజనం సంక్రాంతి పండుగ ప్రత్యేకత! తెలంగాణ వారితో సహా చంద్రమాన కాలగణనాన్ని పాటించే వారు కూడా సూర్యుడి మకర సంక్రమణం ఆధారంగా జరుపుకోవడం సంక్రాంతి ప్రత్యేకత.  

ఎంత అభివృద్ధి చెందినా, వ్యవసాయమే సమాజానికి జీవనాధారం. ప్రకృతి సహకరించి పంట చేతికి వచ్చినప్పుడు రైతన్నలే కాదు, ఊరు ఊరంతా జరుపుకొనే సంబరమే సంక్రాంతి. పేర్లు వేరు కావచ్చు, రాష్ట్రమేదైనా సంక్రాంతి అంటే కొత్త పంటల పులకరింపులు! హర్యానా, హిమాచల్‌, పంజాబ్‌లో మాఘి, బీహార్‌లో తిల్‌ సంక్రాంతి, అస్సాంలో మాఘ్‌ బిహు, తమిళనాడులో తాయి పొంగల్‌, బెంగాల్‌లో పౌష్‌ సంక్రాంతి, గుజరాత్‌లో ఉత్తరాయణ్‌- పేరు ఏదైనా దేశమంతా జరుపుకునే పంటల పర్వదినమిది. ఏడాది  పొడుగునా రైతులకు తోడ్పాటుగా ఉన్న పశువులను అలంకరించి ఆదరించడం మన సంస్కృతిలోని గొప్పదనం. కొందరు పక్షుల కోసం ఇంటి ముందు వడ్ల కంకులు కడతారు! నువ్వులు, బెల్లం కలిపి అతిథులకు పెట్టి ‘తీపి తిని తియ్యగ మాట్లాడు, నువ్వులు బెల్లం తిని నూరేళ్ళు బతుకు’ అని శుభాకాంక్షలు తెలుపుతారు. ప్రజల మధ్య అన్యోన్యతకు ఇది నిదర్శనం. 

తెలంగాణ సమాజానికి సంక్రాంతిలో సరికొత్త క్రాంతి కనబడుతున్నది. తెలంగాణ ఏటేటా సాధించిన విజయం సంక్రాంతి సంబరాల్లో ప్రస్ఫుటమవుతున్నది. ఒకప్పుడు దండగగా కనిపించిన వ్యవసాయం స్వపరిపాలనలో పండుగగా మారింది. వ్యవసాయం, కులవృత్తులకు ప్రోత్సాహం లభించి గ్రామీణ సమాజం సంపద్వంతమైన సంక్రాంతి ఇది. కంట తడిలేని కమనీయ సంక్రాంతి ఇది. క్షామం నుంచి సంక్షేమానికి సంక్రమణం జరిగిన సంక్రాంతి ఇది. అందుకే గ్రామాలలో ఇంటింటా నవ్వులు వినిపిస్తున్నాయి. ముంగిళ్ళలో రంగవల్లులు మురిపిస్తున్నాయి. తెలంగాణ మహా కవి దాశరథి అన్నట్టు- ‘ఎంత హాయి! సంక్రాంతి వేళ!/ బంతి పూల బంగారు మాల!/ కవి కలానికి కైపెక్కె నేడు / రైతు ముఖము రంగెక్కె నేడు’!

VIDEOS

logo