గురువారం 04 మార్చి 2021
Editorial - Dec 25, 2020 , 00:24:57

ప్రజాస్వామ్య విజయం

ప్రజాస్వామ్య విజయం

జమ్ముకశ్మీర్‌ స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగి ప్రధాన స్రవంతి రాజకీయ పక్షాల ప్రతినిధులు ఎన్నిక కావడం హర్షించదగిన పరిణామం. 370 అధికరణాన్ని రద్దు చేసి, లఢఖ్‌ను విడదీసి, జమ్ముకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన తరువాత జరిగిన మొదటి ఎన్నికలు ఇవి. కశ్మీర్‌ ప్రాంతంలోని పది జిల్లా మండళ్లలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ మరికొన్ని పార్టీలతో కూడిన కూటమి (గుప్కార్‌ అలయన్స్‌) తొమ్మిది గెలుచుకున్నది. జమ్ము ప్రాంతంలోని పది జిల్లా మండళ్లలో బీజేపీకి ఆరు దక్కాయి. జమ్ములో డెబ్బయి శాతానికి పైగా పోలింగ్‌ జరిగితే కశ్మీర్‌లో అందులో సగం జరిగింది. కశ్మీర్‌లోని గత అనుభవాలతో పోలిస్తే, ఈ సారి ప్రధాన స్రవంతి రాజకీయ పక్షాలు తమ ఉనికిని చాటుకోగలిగాయని చెప్పవచ్చు. ఈ సందర్భంలో ఏ పార్టీ గెలిచిందీ అనే కన్నా, ప్రజాస్వామిక రాజకీయాలు నిలిచాయా లేదా అనేదే ముఖ్యం.  

నెహ్రూ- షేక్‌ అబ్దుల్లా హయాం నుంచి ప్రధాన స్రవంతి రాజకీయ పక్షాలు బలహీనపడినప్పుడల్లా వేర్పాటువాదం బలపడుతున్నది. ఫరూక్‌ అబ్దుల్లా ప్రభుత్వాన్ని 1984లో కేంద్రంలోని కాంగ్రెస్‌ పెద్దలు కూలదోసినప్పుడు, గత్యంతరం లేక నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కాంగ్రెస్‌తో రాజీపడి 1986లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్నికలలో రిగ్గింగ్‌ జరిగిందనే అభిప్రాయం కూడా రావడంతో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ప్రతిష్ఠ కోల్పోయి మిలిటెన్సీ బలపడ్డది. 1990 దశకంలో కూడా ప్రధాన రాజకీయ పక్షాలు ఉనికిని కోల్పోయినప్పుడు వేర్పాటువాదం వేళ్లూనుకున్నది. కశ్మీర్‌లోయలో జాతీయ జెండా ఎగురవేయడమనేదే ఒక నినాదంగా మారిన పరిస్థితులవి. వాజపేయి ప్రభుత్వం ఎంతో చతురతతో మళ్లీ ప్రధాన రాజకీయ పార్టీలు కాలు మోపేలా చేసి శాంతిని స్థాపించింది. 

అబ్దుల్లాల సారథ్యంలోని నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ముఫ్తి నాయకత్వంలోని పీపుల్స్‌ డెమొక్రాటిక్‌ పార్టీ వంటివి కశ్మీర్‌ అస్తిత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, భారత దేశంలోనే ఉంటూ స్వయం ప్రతిపత్తిని కోరుతాయి. అటు ఢిల్లీని, ఇటు తమ ప్రజలను మెప్పించడానికి ప్రయత్నిస్తూ వారధిలా ఉన్నాయి. కానీ మిలిటెంట్లు భారత్‌లో కశ్మీర్‌ విలీనాన్నే ప్రశ్నిస్తున్నారు. కాగా ప్రధాన స్రవంతి రాజకీయ పక్షాలు భారత రాజ్యాంగం పట్ల విధేయత ప్రకటిస్తున్నాయి. బీజేపీ కేంద్ర నాయకులు తమ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయవచ్చు. జమ్ములోనే కాకుండా, కశ్మీర్‌ ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని భావించడంలో తప్పు లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌లోయలో రాజకీయ శూన్యత ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. ఒకవైపు సైనికులు, మరోవైపు తీవ్రవాదులు అనే పరిస్థితి రాకూడదు. స్థానిక ఎన్నికలు ఇచ్చిన సంకేతాన్ని గ్రహించి, కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా అతివాద, వేర్పాటువాద రాజకీయాలకు స్థానం లేకుండా చేయాలి. 

VIDEOS

logo