శుక్రవారం 05 మార్చి 2021
Editorial - Dec 25, 2020 , 00:24:57

బాతిక్‌ బాలయ్య

బాతిక్‌ బాలయ్య

బాతిక్‌ చిత్రాల కోసం తేనెటీగల మైనం, ప్యారాసిన్‌ మైనం సమపాళ్లలో కలిపి మరిగించి వాడుతారు. మరుగుతున్న మైనంలో కలం ముంచి గుడ్డపై మొదట వేసుకున్న చిత్రం గీతలపై గీస్తారు. మైనం దారం, ఇనుపచువ్వల ద్వారా స్కెచ్‌ గీతలపై కారి, గీతలను మైనంతో కప్పివేస్తుంది. అప్పుడు దాన్ని కావాలనుకున్న రంగులో ముంచితే, బట్ట అంతా రంగు అద్దుకుని, స్కెచ్‌ గీతలు మాత్రం మైనం వల్ల తెల్లగా మిగిలిపోతాయి. అక్కడక్కడ మైనం పగుళ్లు ఏర్పడి రంగులోనికెళ్ళి ఏర్పడే గీతలు కళాత్మకంగా మిగులుతాయి. ఎన్ని రంగులు కావాలనుకుంటే అన్ని రంగుల్లో అన్నిసార్లు ముంచవచ్చు. కానీ బాతిక్‌ చిత్రకళలో సాధారణంగా పసుపు, ఎరుపు, నీలం ప్రాథమిక రంగులనే వాడుతారు. ఎక్కడ ఏ రంగు కావాలనుకుంటే, మరో రంగులో ముంచేముందు కావాలనుకున్న రంగుపై మైనంతో కప్పుతారు.


ప్రపంచ ప్రసిద్ధ జానపద చిత్రకారుడు జామినీరాయ్‌ని మించిన సృజనాత్మక శక్తిగల కాపు రాజయ్యకు శిష్యుడై చిత్రకళారంగంలో పాదం మోపి, బాతిక్‌ హస్తకళలో భేష్‌ అనిపించుకుని బాతిక్‌ బాలయ్యగా స్థిరపడినవారు యాసాల బాలయ్య. అశీతి దాటినా కళాసాధనలోనే కాలం గడుపుతూ కాలధర్మం చెందారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా బాతిక్‌ కళను మలిచినందుకు ఆయనకు నివాళులర్పించాలి. ఎంతో ప్రాచీనమైన ఈ కళ ఇండొనేషియా, మలేషియా దేశాలలో బహుళ జనాదరణ పొందింది. ఈ కళను ఇక్కడ బాలయ్య ప్రాచుర్యంలోకి తెచ్చి హస్తకళగా గుర్తింపు రావడానికి దోహదపడ్డారు. సిద్దిపేట సమీపంలోని ఇబ్రహీంపూర్‌కు చెందిన యాసాల దుర్గయ్య, విశాలాక్షి దంపతులకు 1939లో జన్మించిన బాలయ్య చిన్ననాటి నుంచే చిత్రకళ పట్ల ఆకర్షితులయ్యారు. పొగచూరిన వంటింట్లో చీపురు పుల్లతో తీరొక్క చిత్రాలు వేసేవారు. ‘అదేమిటి దయ్యాల బొమ్మలు వేస్తున్నావంటూ పెద్దలు నిరుత్సాహపరిచినా చిత్రకళను విడువకుండా సాధన చేశారు. 


సిద్దిపేటకు వచ్చిన తరువాత చదువు కొనసాగిస్తూనే, స్థానికుడైన ప్రముఖ చిత్రకారుడు రాజయ్య దగ్గర చిత్రకళా మెలకువలు నేర్చుకున్నారు. డ్రాయింగ్‌ లోయర్‌, హయ్యర్‌ పరీక్షలకు ఆయన వద్ద తర్ఫీదు పొంది ఉత్తీర్ణుడయ్యారు. ఆ తర్వాత సుప్రసిద్ధ చిత్రకారుడు విద్యాభూషణ్‌ వద్ద కొంతకాలం శిక్షణ పొందారు. తనదైన శైలిలో వందల చిత్రాలు గీస్తూ పోయారు. మరోవైపు ఎంఏ, బీఈడీ పూర్తిచేసి ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా సిద్దిపేట, మెదక్‌, సదాశివపేట, నారాయణరావుపేట తదితర ప్రాంతాల్లో పనిచేశారు. ఎక్కడ పనిచేస్తున్నా ప్రతిరోజూ మూడు నాలుగు గంటలు చిత్రకళకు కేటాయించి వృత్తిని, ప్రవృత్తిని జమిలిగా కొనసాగించారు. ప్రముఖ చిత్రకారుడు డాక్టర్‌ లక్ష్మాగౌడ్‌ వద్ద బాతిక్‌ కళ నేర్చుకున్నారు. వేల సంఖ్యలో బాతిక్‌ చిత్రాలు వేశారు. 

పల్లెపట్టులలోని ప్రకృతి, పండుగలు పబ్బాలు, పొలాలు, వరినాట్లు, కోతలు, కోలాటం, కోడిపందాలు, మేకలు, చేపలు పట్టేవారు, నీలాటి రేవులు, పల్లెపడుచులు, బింబప్రతిబింబాలు మొదలైన సమస్త గ్రామీణ జీవితానికి అద్దం పట్టే బాతిక్‌ చిత్రాలను బాలయ్య వేశారు. గణేశుడు, వేంకటేశ్వరస్వామి, రామప్ప, నాగినులు, కోణార్క శిల్పాలు తదితరాలను బాతిక్‌ బాణిలో సృష్టించారు. పలు వార, మాసపత్రికల్లో ఆయన చిత్రాలు ప్రచురితమయ్యాయి. కొన్ని చిత్రాలు గ్రీటింగ్‌ కార్డులుగా, క్యాలెండర్లుగానూ రూపొందాయి. 


ఈ కళకు అమెరికా, రష్యా, ఇంగ్లాండ్‌ తదితర యూరపు దేశాల్లోనూ ఎంతో ఆదరణ ఉంది. నూలు వస్త్రం, కొన్ని సందర్భాలలో పట్టువస్త్రంపై కూడా బాతిక్‌ చిత్రాలు వేస్తారు. కానీ బాలయ్య అందులోనూ తనదైన ప్రత్యేకతను సాధించారు. నిత్యజీవితంలో ధరించే దుస్తులు.. ముఖ్యంగా చీరెలు, లంగాలు, ఓణీలు, కర్టెయిన్లు, టీవీ కవర్లు, టేబుల్‌పై వేసే గుడ్డలు, దిండు గలీబులు, దుప్పట్లు మొదలైనవాటిని కళాత్మకమైన వస్ర్తాలుగా తీర్చిదిద్దారు. ఇలాంటి విశిష్ట కళను పుణికిపుచ్చుకున్న బాలయ్య 1972 నుంచి దాదాపు డజను సార్లు దేశవిదేశాల్లో సమష్టి చిత్రకళా ప్రదర్శనల్లో పాల్గొని తన నైపుణ్యాన్ని చాటారు. 1975 నుంచి వ్యష్టి చిత్రకళా ప్రదర్శనలను ప్రారంభించారు. హైదరాబాద్‌, ఢిల్లీ, బెంగళూరు తదితర నగరాల్లో తన ప్రదర్శనలతో కళాభిమానుల ప్రశంసలు పొందారు. దాదాపు నలభై ప్రదర్శనలు అమెరికాలోని పలు నగరాల్లో ఏర్పాటుచేయడం విశేషం. కేవలం చిత్రకారుడిగానే కాకుండా ఉత్తమ ఉపాధ్యాయుడిగా 1994లో అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌శర్మ నుంచి జాతీయ అవార్డును స్వీకరించారు. చిత్రకళాప్రవీణ, శ్రమశక్తి, వాసవి నవరత్న, ఆంధ్రప్రదేశ్‌ కళానీరాజనం పురస్కారాలను పొందారు. ఆయన బాతిక్‌ చిత్రాలకు హస్తకళల అభివృద్ధి సంస్థలో ఎంతో డిమాండ్‌ ఉంది. బాలయ్య రూపొందించిన వర్ణచిత్రానికి తొలుదొలుత 1963లోనే గూడూరు లలితకళామందిర్‌ అవార్డు లభించింది. ఆ తర్వాత డజనుకుపైగా అవార్డులు గెలుపొందారు. వాటిలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు, హైదరాబాద్‌ ఆర్ట్స్‌ సొసైటీ రజత పతకం ఉన్నాయి. అఖిలభారత లలితకళలు, హస్తకళల సొసైటీ బాలయ్యను పరిణత కళాకారుడిగా సత్కరించింది.

లేపాక్షి, రామప్ప, కోణార్క్‌, మణిపాల్‌, హైదరాబాద్‌లలో పలు చిత్రకళాసంస్థలు నిర్వహించిన శిబిరాల్లో పాల్గొని, పలు పోకడలకు చెందిన చిత్రాలు గీసి ఎందరెందరితోనో మెప్పు పొందారు. అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌ మ్యూజియం, కేంద్ర లలితకళా అకాడెమీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సాలార్‌జంగ్‌ మ్యూజియం, రాష్ట్ర మ్యూజియం, పలువురు కళాభిమానులు బాలయ్య చిత్రాలను సేకరించారు. తనకు ఇంతపేరు తెచ్చిన బాతిక్‌ కళపై బాలయ్య ఇటీవల ప్రామాణికమైన గ్రంథాన్ని వెలువరించారు. 

VIDEOS

logo