శనివారం 27 ఫిబ్రవరి 2021
Editorial - Dec 08, 2020 , 23:45:31

కర్షకుడిపై కార్పొరేట్‌ పెత్తనం

కర్షకుడిపై కార్పొరేట్‌ పెత్తనం

ఇటీవల కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను చేస్తూ రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా చెప్పుకొచ్చింది. కానీ రైతు లోకం ప్రధాని మోదీ మాటలను నమ్మటం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను దేశంలోని వివిధ రాష్ర్టాల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టారు. అదిప్పుడు ప్రతి పల్లె, గల్లీకి చేరింది. విపక్ష పార్టీలన్నీ రైతు ఉద్యమానికి మద్దతు తెలుపుతూ, చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చివరికి దేశంలోని సకల సామాజిక సమూహాలు కవులు, కళాకారులు, నటులు, క్రీడాకారులు కూడా రైతు ఉద్యమానికి బాసటగా నిలిచారు. చివరికి దేశ వ్యాప్త బంద్‌తో కొత్త చట్టాలను వెనక్కు తీసుకోవాల్సిందేనని మోదీ ప్రభుత్వానికి హెచ్చరిక పంపారు.

నూతన వ్యవసాయ చట్టాలు: 1. నిత్యావసర సరుకుల చట్టం-2020, 2. రైతు ఉత్పత్తుల, వాణిజ్య వ్యాపార చట్టం-2020, 3. రైతుల ధర హామీ, వ్యవసాయ సేవల ఒప్పంద చట్టం-2020. నిత్యావసర సరుకుల బిల్లు-1955కు సవరణలు చేసి ‘నిత్యావసర సరుకుల బిల్లు-2020’ను ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంట్లో నిత్యావసర సరుకులైన తృణ, పప్పుధాన్యాలు, నూనె ఉత్పత్తులు మొదలైనవాటిని ఎవరైనా, ఎన్ని రోజులైనా, ఎంత ధాన్యాన్నైనా నిల్వ చేసుకునే సౌలభ్యం కల్పించారు. దీనివల్ల రైతుల దగ్గర తక్కువ ధరకే కొన్న వ్యాపారులు, వాటిని వారి గోడౌన్లలో నిల్వ చేసుకొని మార్కెట్లలో కృత్రిమ కొరత సృష్టించి ఆహారకొరతకు పాల్పడే అవకాశం ఉంది. దీనివల్ల ఉత్పత్తిదారుడైన రైతు, వినియోగదారులు ఇద్దరూ నష్టపోతారు. ప్రైవేట్‌ వ్యక్తులు, వ్యాపారస్థులు లాభపడతారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలను నిలువరించలేక పోతున్న ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి మార్కెట్లు వెళ్లినతర్వాత  ఏ విధంగా నిలువరించగలుగుతుందనేది రైతుల ప్రశ్న.

ప్రజల డిమాండ్‌కు సరిపడా సైప్లె ఉంటుందని, ప్రైవేట్‌ మార్కెట్లపై, వ్యక్తులపై నిఘా ఉంటుందని ప్రభుత్వం చెప్తున్నది. కానీ ఆచరణలో ఇది ఎంతవరకు సాధ్యపడుతుందో అనుభవమే. ‘రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార చట్టం-2020’ ద్వారా స్వేచ్ఛాయుత మార్కెట్‌కు దారులు తెరిచారు.  ఈ చట్టం ప్రకారం రైతులు తాము పండించిన ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా అమ్ముకునే వీలుంది. అంటే మార్కెట్‌ రుసుములు లాంటి వివిధ రకాలైన పన్నులను కట్టనవసరం లేదు. ఈ చట్టం ప్రకారం పంట కొనుగోళ్లు జరిగిన మూడు రోజుల్లో రైతులకు డబ్బులు చెల్లించాలి. అలాగే  ఈ చట్టం ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌కు అనుమతిచ్చింది. దేశంలో 86 శాతం చిన్న, సన్నకారు రైతులు తాము పండించిన పంటను వేరే రాష్ర్టానికి తరలించి అమ్ముకునే పరిస్థితి ఉంటుందా? కానీ రైతుల దగ్గర వ్యాపారులు కొని మార్కెట్ల ధరలకు అనుగుణంగా ఆ పంటలను దేశంలో ఎక్కడికైనా తరలించి అమ్ముకొని లాభాలు గడించే అవకాశం ఉన్నది. ఈ చట్టం రైతుల కంటే వ్యాపారులకే ఎక్కువ మేలు చేసేలా ఉందనటంలో సందేహం లేదు.

‘రైతుల ధర హామీ వ్యవసాయ సేవల ఒప్పంద చట్టం- 2020’. ఈ చట్టం ప్రకారం రైతు ఒక సంస్థతో గాని, ఒక వ్యక్తితో గాని ఒప్పందం కుదుర్చుకోవచ్చు. ఏ పంట వేయాలి, ఎలాంటి సాగుబడి విధానాన్ని అవలంబించాలి, ఏ రకమైన పురుగుమందులు వాడాల నేది ఒప్పందంలో రాసుకోవాలి. అలాగే ఆ పంటకు సంబంధించిన ధరను ముందుగానే నిర్ణయించుకోవచ్చు. రైతు ఉత్పత్తులను కొనుగోలుదారుడు లేదా ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ రైతు దగ్గరికే వచ్చి కొనుగోలుచేయాలి. ఒప్పందంలో ఏవైనా అవకతవకలు జరిగినట్లయితే ఇరుపక్షాలకు పెనాల్టీ విధించే అధికారం ఆర్డీవోకు ఉంటుంది. ఈ చట్టం ప్రకారం తలెత్తే వివాదాల్లో సివిల్‌ కోర్టులు జోక్యం చేసుకోరాదు. ఇక్కడే అసలైన సమస్య ఉంది. దేశంలో నిరక్షరాస్యులైన రైతులు ఎక్కువగా ఉన్నందున ఈ బడా వ్యాపారులు, కార్పొరేట్‌ కంపెనీలు ఒప్పందం పేరుతో కాగితాలపై తమకు అనుకూలంగా రాసుకొని రైతును మోసం చేసే అవకాశం ఉంది. వివాదాల్లో అప్పిలేట్‌ అథారిటీ ఎంతమేరకు రైతుకు న్యాయం చేకూర్చగలదనేది ప్రశ్న.

కల్తీ విత్తనాలను, పురుగు మందులను అరికట్టలేని ప్రభుత్వాలు భవిష్యత్తులో కార్పొరేట్‌ కంపెనీల ఆగడాలనెలా అరికడతాయి? బడా కార్పొరేట్‌ కంపెనీలతో భారతీయ సామాన్య రైతుకు పోటీ పెట్టి రైతు శ్రేయస్సు కోసమే అంటే నమ్మేదెలా? ఈ విధమైన ప్రశ్నలే నేటి రైతు ఉద్యమానికి హేతువులయ్యాయి. ఏదేమైనా.. సమకాలీన చరిత్రలో ఈ రైతు ఉద్యమం ఓ మైలు రాయిగా నిలుస్తుందనటంలో సందేహం లేదు.

(వ్యాసకర్త: కె. శ్రావణ్‌కుమార్‌  ఓయూ విద్యార్థి నేత)

VIDEOS

logo