ఆదివారం 17 జనవరి 2021
Editorial - Dec 04, 2020 , 03:44:19

బైడెన్‌తో భారత్‌కు మేలేనా?

బైడెన్‌తో భారత్‌కు మేలేనా?

అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ ఇకముందు భారత్‌తో ఎటువంటి సంబంధాలను కొనసాగిస్తారు? అక్కడ అధికార మార్పిడి భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?.. అనేవి ఇప్పుడు ఆసక్తికర చర్చనీయాంశాలుగా మారాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో అమెరికా అంతర్జాతీయ వర్తక, వాణిజ్యపరంగా భారత్‌తో మంచి సంబంధాలనే కొనసాగించింది. దేశాల మధ్యనే కాకుండా దేశాధినేతలైన ట్రంప్‌, నరేంద్ర మోదీ మధ్య కూడా స్నేహపూర్వక వాతావరణం నెలకొన్నది. భారత్‌, అమెరికా మధ్య ఆర్థిక, సైనిక, రాజకీయ, దౌత్యపరమైన సంబంధాలు బలంగా కొనసాగుతున్న సమయంలో ఇప్పుడు కొత్త అధ్యక్షుడిగా బైడెన్‌ గెలిచారు. ఆయన అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో పాకిస్థాన్‌, చైనాలతో సానుకూలంగా వ్యవహరించారు. అందువల్ల ఇప్పుడు ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తారనే ఆసక్తి రేకెత్తడం సహజం.

భారత్‌- అమెరికాకు సంబంధించి ప్రధానంగా మూడు కీలక అంశాల పట్ల నూతన అధ్యక్షుడి వైఖరి ఎలా ఉంటుందన్నది ముఖ్యం. మొదటిది వీసా నిబంధనల సరళీకరణ. రెండవది పాకిస్థాన్‌తో బైడెన్‌కు ఇదివరలో ఉన్న సత్సంబంధాల ప్రభావం. మూడవది ఇండో- అమెరికా వాణిజ్య సంబంధాలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌కు సానుకూల ప్రచారం పెరగడంలోనూ, ఆయన గెలుపులోనూ అక్కడి ఇండో- అమెరికన్ల మద్దతు కీలకమైనది. వీసా నిబంధనల విషయంలో ట్రంప్‌ మీద అక్కడి మన భారతీయులకు వ్యతిరేకత ప్రబలడం, మరోవైపు భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ ఉపాధ్యక్ష పోటీలో ఉండటం ఎన్నికల వాతావరణాన్ని మార్చివేసింది. ఇండో- అమెరికన్లు బైడెన్‌, కమల ప్రాతినిధ్యం వహిస్తున్న డెమొక్రటిక్‌ పార్టీకే మద్దతునిచ్చారు. వారిద్దరు కూడా భారత్‌ పట్ల, ప్రవాస భారతీయుల పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించారు. తాను అధ్యక్షుడినైతే వీసా నిబంధనలు సులభతరం చేస్తానని, అందరికి అనుకూల నిబంధనలు తెస్తానని బైడెన్‌ మాటిచ్చారు. కానీ, వీసా సులభతర ప్రక్రియ అంత సులువైన విషయమేమీ కాదు. ఒకవేళ బైడెన్‌ వీసా నిబంధనలు సరళీకరిస్తే అమెరికన్ల నుంచి నిరసన వ్యక్తమయ్యే అవకాశముంటుంది. అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడేందుకు ట్రంప్‌ మార్చిన వీసా నిబంధనలను సరళీకరించడం ఓ సాహసమే అవుతుంది. 

బైడెన్‌కు పాకిస్థాన్‌తో ఉన్న సంబంధాలు భారత్‌కు కలవరం కలిగించడం సహజం. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో బైడెన్‌ గెలువాలని పాకిస్థాన్‌ గట్టిగా కోరుకున్నది. గతంలో ఆయన పాకిస్థాన్‌లో అమెరికా దౌత్యవేత్తగా పనిచేసినప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలకు కృషిచేశారు. బైడెన్‌ కశ్మీరీలకు బహిరంగ మద్దతును ప్రకటించారు. గతేడాది భారత ప్రభుత్వం 370 అధికరణను రద్దు చేసినప్పుడు కూడా నిరసన వ్యక్తం చేశారు. బైడెన్‌ అధ్యక్షుడైతే తమకు సహాయ సహకారాల పునరుద్ధరణతోపాటు భారత్‌ను ఇబ్బంది పెట్టవచ్చని పాకిస్థాన్‌ భావించే అవకాశమున్నది. వాస్తవానికి, ట్రంప్‌ హయాంలో పాకిస్థాన్‌కు గత నాలుగేండ్లుగా అనేక ఎదురుదెబ్బలు తగిలాయి. ఇప్పుడు బైడెన్‌ ఎలా వ్యవహరిస్తారనేది కొంత ఉత్కంఠ రేపుతున్నప్పటికీ భారత్‌తో ట్రంప్‌ హయాంలో మాదిరి సంబంధాలనే కొనసాగించాల్సిన పరిస్థితులున్నాయి. ఎందుకంటే, నంబర్‌ వన్‌ స్థానం కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలను సమర్థంగా ఎదుర్కోవాలంటే అమెరికాకు భారత్‌ మద్దతు తప్పనిసరి అవసరమవుతుంది. భారత్‌తో మంచి సంబంధాలే ఉంటాయని బైడెన్‌ సైతం తన ఎన్నికల ప్రచారంలో తెలియజేశారు. అదే సమయంలో భారత్‌లో కాలుష్యంపై ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ఖండించారు. 

ట్రంప్‌ హయాంలో రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు పెంపొందాయి. ఎగుమతులు దిగుమతుల విలువలు పెరిగాయి. భారత్‌తో వాణిజ్య సంబంధాలపై బైడెన్‌ సానుకూలంగానే వ్యవహరించవచ్చన్న అభిప్రాయాలున్నాయి. అదనపు సుంకాలను తగ్గించే అవకాశాలున్నాయని వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి. ట్రంప్‌ హయాంలో కుదిరిన వాణిజ్య ఒప్పందాలను బైడెన్‌ సర్కార్‌ సమీక్షించే అవకాశం లేకపోలేదు. అలా చేస్తే భారత్‌కు మేలు జరిగినట్లే. ఎందుకంటే ట్రంప్‌ హయాంలో ఇరాన్‌ చమురు ఎగుమతులపై ఆంక్షలు విధించారు. అందులో భాగంగానే మనదేశం గత కొంతకాలంగా ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి క్రమేణా తగ్గించుకొని అంతమేర అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నది. రూపాయితో దిగుమతిని కాదని డాలర్‌తో దిగుమతికి భారత్‌ సిద్ధపడటానికి అమెరికా ఆంక్షలే కారణం. అమెరికా అధ్యక్ష పదవిలో ఎవరున్నా ఆ దేశానికి అగ్రస్థానమే ముఖ్యం. ప్రస్తుతం అమెరికాకు అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం చైనా. ఆ దేశాన్ని నిలువరించాలంటే అమెరికాకు భారత్‌ తోడ్పాటు తప్పనిసరి అవుతుంది. అందువల్ల కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌ కచ్చితంగా భవిష్యత్‌లో భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలనే కొనసాగించే అవకాశం ఉన్నది.

-డాక్టర్‌ రామకృష్ణ బండారు