రగులుతున్న రైతు

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనోద్యమంతో దేశ రాజధాని ఢిల్లీ దిగ్బంధంలో చిక్కుకున్నది. రైతుసంఘ నేతలతో కేంద్రం జరిపిన రెండో దఫా చర్చలు విఫలమయ్యాయి. కొత్త చట్టాలపై రైతులు లేవనెత్తుతున్న అంశాల అధ్యయనానికి ఐదుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామన్న కేంద్రం ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. ఇటీవల తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని అవి డిమాండ్ చేస్తున్నాయి. వ్యవసాయ మార్కెట్లు, మద్దతు ధరల విషయంలో ఆలోచిస్తామని కేంద్రం చెప్తున్న మాటలను రైతులు విశ్వసించకపోవటం గమనార్హం. దీంతో గురువారం జరుగనున్న మరో విడత చర్చలపై ఉత్కంఠ నెలకొన్నది.
మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మూడు నెలలుగా పంజాబ్, హర్యానా రాష్ర్టాల రైతులు ఉద్యమిస్తున్నారు. మొదట స్థానికంగా నిరసనలు సాగినప్పటికీ, క్రమంగా ఢిల్లీకి రంగం మా రింది. 35 రైతు సంఘాల నేతృత్వంలో వేలాది మంది రైతులు ఢిల్లీకి బయలుదేరారు. తరలివస్తున్న కర్షకులను సరిహద్దుల్లోనే నిలిపేసేందుకు కేంద్రం పెద్దఎత్తున పోలీసు బలగాలను దింపిం ది. అంచెలంచెలుగా బారికేడ్లను ఏర్పాటు చేసింది. శత్రు సేనలను నిలువరించే రీతిలో రహదారులపై కందకాలను తవ్వింది. వేలాది ట్రాక్టర్లతో వస్తున్న రైతులపై బాష్పవాయు గోళాలు, నీళ్ళు చిమ్మడంతోపాటు విచక్షణారహిత లాఠీ చార్జీలు చేయిస్తున్నది. వందల మంది రైతులు గాయపడ్డారు. ఇప్పటికే ఒక రైతు నేత చలితీవ్రతతో చనిపోయినా రైతులు ఉద్యమాన్ని కొనసాగించడం సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నది.
పంజాబ్, హర్యానా రైతులు ముందు నిలిచి ఆందోళనకు దిగినప్పటికీ, ఈ ఉద్యమంలో అన్ని రాష్ర్టాల భాగస్వామ్యం, మద్దతు ఉన్నది. వందలాది రైతు సంఘాలు ఐక్యంగా ఈ ఆందోళనకు పిలుపు ఇవ్వడం గమనార్హం. విద్యార్థులతో పాటు సమాజంలోని వివిధ ప్రజాసమూహాలు రైతులతో గొంతుకలుపుతున్నాయి. క్రీడాకారులు తమకు లభించిన పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి అవార్డులను వెనుకకు ఇచ్చేస్తామంటూ రైతులకు బాసటగా నిలుస్తున్నారు. రైతుల ఉద్యమం ఢిల్లీకి చేరిన నేపథ్యంలో కేంద్రం పట్టుదలకు పోకుండా సంయమనంతో వ్యవహరించాలి. ఈ మూడు వ్యవసాయ చట్టాలను తేవడానికి ముందే కేంద్రం వివిధ వర్గాలతో చర్చలు జరిపితే బాగుండేది. ఇప్పటికైనా రైతు ప్రతినిధులతో, రాష్ర్టాల ముఖ్యమంత్రులతో విస్తృతస్థాయిలో చర్చలు జరిపి కొత్త వ్యవసాయ విధానాన్ని ఖరారు చేయాలి.
తాజావార్తలు
- రామునిపట్ల వద్ద రెండు బైక్లు ఢీ: ఇద్దరు మృతి
- రూపేశ్ను హతమార్చింది కిరాయి హంతకులే: బీహార్ డీజీపీ
- సీఎం కేసీఆర్ చెబితే చట్టం చేసినట్టే : మంత్రి తలసాని
- వాటాల ఉపసంహరణే దిక్కు: రాజన్
- శ్రీశైలంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
- టీకా వేయించుకున్న 51 మందికి స్వల్ప అస్వస్థత
- త్రిభంగా మూవీ రివ్యూ: అలాంటి వాళ్ల కోసమే చిత్రం అంకితం
- ముఖేశ్ ‘రిలయన్స్’కే శఠగోపం..6.8 కోట్ల చీటింగ్
- బర్త్ డే రోజు వివాదం.. క్షమించమని కోరిన విజయ్ సేతుపతి..
- తలపై రూ.8 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు మృతి