శనివారం 23 జనవరి 2021
Editorial - Dec 03, 2020 , 02:01:11

స్వచ్ఛతలోనూ మేటి

స్వచ్ఛతలోనూ మేటి

భారతదేశంలో 2021 నాటికి పట్టణీకరణ 45 శాతం దాటుతుందని అంచనా. అత్యంత పట్టణీకరణ జరుగుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి. ఆర్థికవృద్ధికి, ప్రజల నాణ్యమైన జీవన ప్రమాణాల పురోగతికి పట్టణాలు చోదకశక్తులని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.సౌలభ్యవంతమైన వ్యాపారం, సౌకర్యవంతమైన జీవితానికి తోడ్పాటునిచ్చే ఎన్నో పథకాలను, నూతన విధానాలను ప్రవేశపెట్టింది.ప్రజలకు అనుకూలంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతున్నది. రాష్ట్రం ఏర్పడినాక ఈ ఆరేండ్ల పాలనలో పారిశుద్ధ్య నిర్వహణలోనూగుణాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఇది మరొక అభినందనీయ, ఆదర్శనీయ ప్రయత్నం.

ఆరోగ్యవంతమైన మానవ జీవనానికి అవసరమైన సదుపాయాల్లో పరిశుభ్రత ప్రాధాన్యం తక్కువ కాదు. పారిశ్రామిక, ఎలక్ట్రానిక్‌, మానవ విసర్జిత వ్యర్థాల నిర్వహణ ఎంతో ముఖ్యం. అన్నివిధాలా మెరుగైన రాష్ట్రంగా మార్చాలనుకుంటున్న ప్రభుత్వం పారిశుద్ధ్య నిర్వహణలోనూ తనదైన ప్రత్యేకతను చాటుతున్నది. గతంలో మురుగునీటి శుద్ధి అంటే హైదరాబాద్‌లోనే కనిపించేది. కానీ ఇప్పుడు మున్సిపాలిటీల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీకి దీటుగా మిగతా నగరాల్లో బాధ్యతను ఎంఏయూడీ, సీఅండ్‌ఎండీఏ చేపట్టింది. అందుకు దేశంలోనే తొలిసారిగా 1997లో గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఫీకల్‌ స్లడ్జ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎఫ్‌ఎస్టీపీ) ప్రారంభించారు. పలు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు యుద్ధప్రాతిపదికన పూర్తవుతున్నాయి. బహిరంగ మల విసర్జనరహిత దిశగా రాష్ట్రం అడుగులు వేస్తున్నది.

అనారోగ్యం, శిశు మరణాలు, ఇతర అనారోగ్యాలు రావడానికి బహిరంగ మలవిసర్జన ఒక కారణమై ఉండవచ్చని భావిస్తూ వచ్చాం. దానికి నివారణగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నది. మిషన్‌ భగీరథ ప్రాజెక్టు ద్వారా అన్ని గ్రామాలకు పట్టణాలకు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా తాగునీరు సరఫరా చేసే సంకల్పం కొనసాగుతున్నది. ఇది పూర్తయితే మరుగుదొడ్ల వాడకం గణనీయంగా పెరుగుతుంది. వినియోగం కోసం సరఫరా చేసిన నీటిలో 70-80 శాతం మురుగునీరు ఉత్పన్నమవుతుంది. మురుగునీటిని శాస్త్రీయంగా శుద్ధి చేయకుంటే అది మరింత ప్రమాదకరమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దార్శనికతతో అన్ని పట్టణాల్లో మురుగు నిర్వహణ కోసం ఎఫ్‌ఎస్టీపీ, ఎస్టీపీల స్థాపనపై దృష్టిపెట్టింది. మరుగుదొడ్లు నిర్మించడమే కాదు వాటిలో ఉత్పత్తయ్యే వ్యర్థాలను శుద్ధిచేసి నిర్వహించే అంశాన్ని గుర్తించడంలో దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇప్పుడు భారీ సంఖ్యలో పట్టణాలు ఓడీఎఫ్‌ ++ దిశగా అడుగువేస్తున్నాయి. వరంగల్‌, సిరిసిల్ల పట్టణాల్లో పైలట్‌ ప్రాజెక్టు కింద నెలకొల్పిన ఎఫ్‌ఎస్టీపీలు విజయవంతంగా నడుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 71 పుర పట్టణాల్లో భౌగోళిక సారూప్యం, ఇతర కార్యనిర్వహణ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏడు క్లస్టర్‌ ప్యాకేజీలను ఏర్పాటు చేశారు. ప్రతి క్లస్టర్‌లో 10-11 పురపాలక సంఘాలుంటాయి. సిద్దిపేట, నిర్మల్‌లో ప్లాంట్ల నిర్మాణం చివరి దశలో ఉన్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లోపు 71 ప్లాంట్లు వాడుకలోకి తేవాలనేది ప్రభుత్య లక్ష్యం.

 వెయ్యి మంది జనాభాకు ఒక టాయిలెట్‌ ఉండటమనేది హక్కుగా పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ నిర్దేశించింది. సమ్మిళిత పట్టణ పారిశుద్ధ్య సాధన దిశలో సురక్షిత, ప్రజావసరాలకు సరిపడా మరుగుదొడ్లను నిర్మించడం ఒక ముందడుగు. ప్రతి పట్టణంలో మొబైల్‌ టాయిలెట్లను అందుబాటులోకి తేవడం, మహిళల అవసరాలను తీర్చడానికి, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి మహిళా మరుగుదొడ్లను ఏర్పాటుచేయడం ప్రభుత్వ కార్యాచరణలో భాగమవుతున్నాయి. పట్టణ మహిళా స్వయం సహాయక సమాఖ్య, ఆసక్తిగల పౌరసమాజ సంస్థలు- ఉదాహరణకు తెలంగాణ వికలాంగుల సమాఖ్య వంటి వాటికి పబ్లిక్‌ టాయిలెట్‌ నిర్మా ణం, నిర్వహణ అప్పగించడం ద్వారా కొందరికి జీవనోపాధి కలుగుతున్నది. 

ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో పచ్చదనం, పరిశుభ్రత, పౌరసేవలు, వాటికి సాంకేతిక తోడ్పాటు, పారిశుద్ధ్యం, మంచినీటి పరఫరా, వ్యర్థాల నిర్వహణ, మౌలిక వసతుల కల్పన, ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక చర్యలను నిర్దేశించింది. సమగ్రాభివృద్ధి కార్యక్రమాల అజెండా ఇది. అన్ని పట్టణాల్లో వైకుంఠధామాలు ఉండాలని, ప్రస్తుతం ఉన్న శ్మశానవాటికలను వైకుంఠధామాలుగా మార్చాలని నిర్ణయించారు. పురపాలక సంస్థలు తమ సాధారణ బడ్జెట్‌లో కచ్చితంగా 10 శాతం నిధులను పచ్చదనం కోసం కేటాయించాల్సి ఉంటుంది. దేశంలో పట్టణాభివృద్ధికి ఈ స్థాయిలో సమీకృత చర్యలు, కార్యక్రమాలు చేపట్టిన అతికొద్ది రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కొత్త చట్టం తేవడం, నెలనెలా జీతాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవడం సంతోషకరం. అలాగే పారిశుద్ధ్య నిర్వహణలో గుణాత్మక మార్పులకు ప్రథమ సారథులైన లక్షకు పైగా ఉన్న స్వచ్ఛ కార్మికుల స్థితిగతుల మెరుగుదలకు చర్యలు చేపట్టాల్సి ఉన్నది. వారికి ఉద్యోగ భద్రత, సామాజిక గౌరవం లభించాలి.

-డాక్టర్‌ గాదె వెంకటేశం


logo