రెవెన్యూలో విలీనమే లాభకరం

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అందుబాటులోకి తెచ్చిన ధరణి పోర్టల్, దానిద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ సదుపాయం ప్రజలకు ఎంతో ఊరటను, సౌలభ్యాన్ని కలిగిస్తున్నది. భూముల వివరాలు వెనువెంటనే రిజిస్టర్లలో మార్పు కావడం రైతులకు ఆనందాన్ని కలిగించే విషయం. ఇదివరలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్లకు ఉన్న అధికారాలను తాసిల్దార్లకు బదలాయించడం వల్ల వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల సేవలు ప్రజలకు మరింత చేరువలోకి వచ్చినట్లయింది. ఇదివరలో మూడు నాలుగు మండలాలకు ఒక సబ్ రిజిస్ట్రార్ ఉండేవారు. ఇప్పుడు ప్రజలు దూరప్రయాణాలు లేకుండా తమ మండల కేంద్రాల్లోనే ఈ సత్వర సేవలు పొందగలుగుతున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖను రెవెన్యూలో విలీనం చేయాలనే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం అమలులోకి తేవాల్సిన అవసరమున్నది.
రాష్ట్రంలో 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుండగా అందులో కేవలం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పరిధిలోని వాటికే తప్ప మిగతా వందకుపైగా కార్యాలయాల్లో సగం పైబడి పని తగ్గిపోయింది. జిల్లాల్లోని సబ్-రిజిస్ట్రార్ ఆఫీసుల్లో వ్యవసాయ రిజిస్ట్రేషన్లు ఎక్కువ. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు తక్కువ. ఇపుడు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను తాసిల్దార్లకు బదిలీ చేయడం వల్ల ఆ పని లేకుండా పోయింది. తాసిల్దార్లకు వ్యవసాయ భూములే కాకుండా వ్యవసాయేతర భూముల (ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల) రిజిస్ట్రేషన్ల బాధ్యతను కూడా బదలాయిస్తే ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుంది. గ్రామీణ ప్రజలకు దూర భారం, వ్యయ ప్రయాసలు తగ్గుతాయి. రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖలో చాలామంది అధికారులకు సరైన పనిలేదు. జిల్లా అధికారులుగా విధులు నిర్వహిస్తున్న జిల్లా రిజిస్ట్రార్లు, పైన ఆజమాయిషీ చేసే డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్, డీఐజీ స్థాయి అధికారులకు అసలే పనిలేదు. స్థాయిని బట్టి ఉన్నతాధికారులకు వసతులు కల్పించాల్సి ఉంటుంది. వారికి సహాయంగా పీఏలు, దిగువన సూపరింటెండెంట్ తదితర సిబ్బంది ఉంటారు. ఇతరత్రా నిర్వహణ ఖర్చులుంటాయి. ఖజానా నుంచి ఇందుకు వెచ్చించే మొత్తాలు ఒకరకంగా చెప్పాలంటే వృథా అన్నమాటే. ఇలాంటి అనవసర పోస్టులను రద్దుచేసి, అధికారుల సేవలు ఇతరత్రా వినియోగించుకుంటే బాగుంటుంది.
రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖలో డీఐజీ పోస్టులను బ్రిటిష్ పాలన సమయంలో ఏర్పరిచారు. అప్పట్లో స్టాంపుల విలువ లక్షల్లో, కోట్లలో ఉండేది. దానికి కస్టోడియన్‌గా వ్యవహరించడానికి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ స్థాయి గల అధికారులను నియమించేవారు. ఆ పదవులు ఇప్పుడు అవసరం లేకున్నా అలాగే కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్ల శాఖలో డీఐజీ స్థాయి అధికారులను జోనల్ ఆఫీసర్లుగా నియమించేవారు. ప్రస్తుతం జిల్లాకు లేదా రెండు జిల్లాలకు ఒక డీఐజీ స్థాయి అధికారి ఉంటారు. నిజానికి వీరి పనిని జిల్లా రిజిస్ట్రార్లు నిర్వహిస్తున్నారు. కమిషనర్ ఉత్తర్వులను సబ్ రిజిస్ట్రార్లకు పంపడం, రిజిస్ట్రార్ల నుంచి వచ్చే కరస్పాండెన్స్‌ను కమిషనర్‌కు పంపడం తప్ప శాఖలో డీఐజీ స్థాయి అధికారులు ప్రత్యేకంగా చేసే పని ఏమీ ఉండటం లేదు. అవసరం లేనందున ఇప్పుడు ఈ పోస్టులను రద్దుచేయడమే మేలు. ఒకవేళ రిజిస్ట్రేషన్ల శాఖను కొనసాగించాలనుకుంటే కిందిస్థాయిలో సబ్-రిజిస్ట్రార్లు, పై స్థాయిలో కమిషనర్, ఒక అడిషనల్ కమిషనర్ ఉంటే సరిపోతుంది.
రిజిస్ట్రేషన్ శాఖను పూర్తిగా రెవెన్యూ శాఖలో విలీనం చేసి ఒకే గొడుగు కిందికి తీసుకురావడమే మారుతున్న కాలంలో సముచితం. మొత్తం ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రజల ముంగిటికి తీసుకువచ్చినట్లవుతుంది. వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ఒకే దగ్గర మండల కేంద్రాల్లో చేయించుకునే వెసులుబాటు ప్రజలకు కలుగుతుంది. రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బందిని రెవెన్యూ శాఖకు బదిలీ చేయడం వల్ల ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో పేరుకుపోయిన అలసత్వం, అవినీతి జాడ్యాలు తొలిగి రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ గాడిలో పడుతుంది. జవాబుదారీతనం పెంపొందుతుంది. వ్యవసాయేతర భూములను రిజిస్ట్రేషన్ చేసే సమయంలో స్టాంపు పేపర్లను ఉపయోగించకుండా ఈ-చలాన్ ద్వారా స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుము తీసుకొని ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇస్తే బాగుంటుంది. లేదా ఒక పాస్‌బుక్ లాంటిది ఇచ్చినా సౌకర్యవంతంగా ఉంటుంది.
(వ్యాసకర్త: రాచకొండ శ్రీనివాసరావు మాజీ తాసిల్దార్ మాజీ సబ్ రిజిస్ట్రార్)
తాజావార్తలు
- 18 వరకు మహారాష్ట్రలో టీకా నిలిపివేత. కొవిన్ వల్లే?!
- రామునిపట్ల వద్ద రెండు బైక్‌లు ఢీ: ఇద్దరు మృతి
- రూపేశ్‌ను హతమార్చింది కిరాయి హంతకులే: బీహార్ డీజీపీ
- సీఎం కేసీఆర్ చెబితే చట్టం చేసినట్టే : మంత్రి తలసాని
- వాటాల ఉపసంహరణే దిక్కు: రాజన్
- శ్రీశైలంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
- టీకా వేయించుకున్న 51 మందికి స్వల్ప అస్వస్థత
- త్రిభంగా మూవీ రివ్యూ: అలాంటి వాళ్ల కోసమే చిత్రం అంకితం
- ముఖేశ్ ‘రిలయన్స్’కే శఠగోపం..6.8 కోట్ల చీటింగ్
- బర్త్ డే రోజు వివాదం.. క్షమించమని కోరిన విజయ్ సేతుపతి..