శుక్రవారం 22 జనవరి 2021
Editorial - Dec 01, 2020 , 00:47:02

భిన్నత్వంలో ఏకత్వం.. మనం

భిన్నత్వంలో ఏకత్వం.. మనం

భారతదేశం ప్రాచీన కాలం నుంచి సహనశీలతకు ప్రతీక. ప్రపంచంలో ఇంతటి అద్భుత చరిత్ర కలిగిన ఏకైక దేశం భారత్‌ అనడంలో అతిశయోక్తి లేదు. ఎవరి వ్యక్తిగత విశ్వాసాలు, జీవన విధానాలు ఎలా ఉన్నప్పటికీ.. ఇతరుల విశ్వాసాలు, జీవన విధానాల్ని గౌరవించడం మన సంప్రదాయం. ఇదే లక్షణం భారత్‌ను సుసంపన్నమైన నాగరికత, విభిన్న సంస్కృతుల నిలయంగా మార్చింది. నేడు మతతత్వం సమాజాన్ని పట్టి పీడిస్తున్నది. మత ఘర్షణలకు దారితీసి ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నది. జ్ఞానవంతమైన దేశానికి లౌకికవాదం విశేష లక్షణం. అభివృద్ధి సాధించిన ఆధునిక దేశాలు లౌకికవాదాన్ని తమ ప్రజావిధానాల్లో కీలకంగా కొనసాగిస్తున్నాయి. ఒక మతస్థులు అత్యధికంగా ఉన్న దేశాల్లోనూ పాలనలో మతప్రమేయం లేకుండా చూసుకుంటున్నారు.

విభిన్న విశ్వాసాలు, మతాల పట్ల ప్రభుత్వం పక్షపాతం లేకుండా బాధ్యతగా వ్యవహరించాలి. భిన్నమతాలు, విశ్వాసాలు, సంప్రదాయాలకు నిలయమైన మన దేశంలో పాలకులకు, ప్రజలకు దిశానిర్దేశం చేసే మౌలిక సూత్రం.. లౌకికవాదం. రాజ్యాంగస్ఫూర్తితో లౌకికవాదం పట్ల ప్రజల్లో విశ్వాసం నింపాల్సిన బాధ్యత పాలకులది. ఈ బాధ్యతను పీవీ సమర్థంగా నిర్వర్తించారు. 1990 దశకంలో ఆధునిక భారత నిర్మాణం దిశగా లౌకికవాదానికి సవాళ్లు ఎదురయ్యాయి. అప్పుడు పీవీ లౌకికవాద పరిరక్షణకు విశేష కృషి చేశారు. అవాంఛనీయ పరిణామాలు దేశానికి శ్రేయస్కరం కాదని లౌకికత కోసం తపించారు. 

‘మత స్వేచ్ఛ, మతం ఆధారంగా వివక్ష చూపడంపై నిషేధం.. ప్రాథమిక హక్కులుగా ఉన్నాయి. సమాజంలో అందరి అభ్యున్నతి కోసం ఆయా వ్యవస్థలు బాధ్యతల్ని నిర్వర్తించాలి. రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదం కోర్టులో ఉంది. న్యాయస్థానం ఆదేశాల్ని అందరం గౌరవించాలి’ అని 1991 నవంబర్‌ 2న జరిగిన జాతీయ సమగ్రతా మండలి సమావేశంలో పీవీ సందేశమిచ్చారు.

స్వతంత్ర భారతంలో అత్యంత సంక్షోభ సమయమది. అలాంటి పరిస్థితుల్లో ప్రజలంతా ఒక్కటే అన్న స్ఫూర్తితో ఉజ్వల భారత నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరముందని పీవీ చెప్పారు. దేశ నిర్మాణానికి మౌలిక సూత్రమైన మతసామరస్యానికి ముప్పు వాటిల్లకూడదని వ్యవ హరించారు. జాతీయ సమస్యల పరిష్కారానికి ఎన్‌ఐసీ వేదికగా నిలువాలని చెప్పారు.

‘మతతత్వం అత్యంత ప్రమాదకరమైన వైరస్‌. ఇది విద్వేషాన్ని కలిగిస్తుంది. సాటి మనుషుల మధ్య అగాధాన్ని సృష్టిస్తుంది. మతపరమైన హింసను నిలువరించేందుకు మన దేశ శక్తిని, వనరుల్ని మళ్లించాల్సిన పరిస్థితులు తలెత్తితే అది దురదృష్టకరం. అక్షరాస్యత, విద్యా, వైద్యరంగాల అభివృద్ధి, ఆహార పంపిణీ, నివాస సదుపాయం, ఉద్యోగ, ఉపాధి కల్పన వంటి బాధ్యతలు మనపై ఉన్నాయి. ఇవన్నీ సాధించాలంటే సమాజంలో శాంతి, ప్రజల మధ్య సహకార భావన కలిగి ఉండాలి’ అని  పీవీ ఉద్ఘాటించారు.

వినూత్నమైన విధాన నిర్ణయాల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయడానికి పీవీ ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. భారత్‌ను పెట్టుడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేందుకు కృషి చేశారు. అనేక దేశాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నందున.. ఆ పరుగులో భారత్‌ వెనుకడిపోవడానికి వీలు లేదని  చెప్పారు. కుల, మతాలకు అతీతంగా కృషి చేసినప్పుడే బలమైన, ఉజ్వల భారత నిర్మాణం సాధ్యమని తెలిపారు. ఇదే ఉద్దేశంతో పీవీ సమస్యల పరిష్కారంలో ప్రతిపక్షాల్ని కలుపుకునిపోయారు. దేశ ఐక్యత, సమగ్రతకు నష్టం వాటిల్లకుండా చూశారు. 

రాజకీయాలు, వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా దేశ నిర్మాణమే ధ్యేయంగా కలిసిరావాలని పీవీ పిలుపునిచ్చారు.  సున్నితమైన విషయంలో రెండు మతాల మనోభావాల్ని గౌరవించేలా సామరస్యపూర్వక పరిష్కారానికి కృషి చేశారు. భారతావని అవాంఛనీయ అనుభవాలు, బలమైన గాయాల్ని చవిచూసింది. భారతీయ ప్రాచీన అస్తిత్వమైన భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. దేశ నిర్మాణంలో సహనశీలత, సౌభ్రాత్రంతో పనిచేయాలన్న పీవీ ఆశయాలను ఆ మహనీయుని శత జయంతి ఉత్సవాల సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరముంది. దేశ నిర్మాణంలో ఐక్యతే కీలకమన్న స్ఫూర్తి అనుసరణీయం కావాలి.

(వ్యాసకర్త: పీవీ తనయుడు)

పి.వి.ప్రభాకర్‌ రావు


logo