మన పట్నం: మన ఓటు

హైదరాబాద్ దేశంలో ఐదో పెద్ద నగరం. ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతాలను మించి హైదరాబాద్ ఈ ఏడేండ్లలో వేగంగా ఎదిగింది. కోటి జనాభా దాటింది. వంద కిలోమీటర్ల మేర విస్తరించింది. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అంతర్జాతీయ సదస్సులకు వేదికగా మారిపోయింది. బెస్ట్ లివింగ్ సిటీగా ప్రశంసలూ పొందింది. అలాంటి నగరం వరదలకు గురైతే, ఢిల్లీ పాలకులు వచ్చి చూసిన దాఖలా ఉన్నదా? కానీ ఇప్పుడు గల్లీ ఎన్నికలకు మాత్రం ఢిల్లీ నేతలు క్యూ కట్టారు! యూపీ ముఖ్యమంత్రి, బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి రావడం ఆశ్చర్యం! చివరకు ప్రధాని సైతం కొవిడ్ వ్యాక్సిన్ తయారీ పరిశీలన పేరుతో హైదరాబాద్‌కు వచ్చివెళ్లారు. స్వామి కార్యం కన్నా తమ స్వకార్యమే లక్ష్యంగా ప్రధాని హైదరాబాద్ వచ్చివెళ్లారనేది బహిరంగ రహస్యమే. గల్లీ బాట పట్టిన ఢిల్లీ నేతలకు హైదరాబాద్ పట్ల నిజంగానే ప్రేమ ఎంత అనే చర్చ ఉండనే ఉన్నది!
నివర్ తుఫానుతో ఇటీవల చెన్నై నగరం సహా తమిళనాడు రాష్ట్రం అతలాకుతలమైతే, ప్రధాని మోదీ అన్ని రకాల సహాయాన్ని ప్రకటించారు. ఎక్కడ ఆపద వచ్చినా ఆదుకోవడం కేంద్ర పాలకుల బాధ్యత. అదే వరదల కారణంగా హైదరాబాద్ వారంపాటు అతలాకుతలమైంది. అప్పుడు కూడా ప్రధాని వచ్చి ఉంటే సంతోషించేవాళ్లం. కోరిన విధంగా రూ.1350 కోట్ల వరద అందించాల్సిన బాధ్యత అయనది. చెన్నై పట్ల ఒక తీరు, హైదరాబాద్ పట్ల మరో తీరు! ఈ ద్వంద్వ వ్యవహారం ఏందీ? కేంద్ర ప్రభుత్వం దగ్గర, బీజేపీ దగ్గర జవాబు ఉన్నదా? హైదరాబాద్‌కు సాయం చేయాల్సిన బాధ్య త లేదా? ఇదేనా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించే తీరు?
దేశ ప్రయోజనాలు ఇమిడి ఉన్న ప్రతి బిల్లుకూ కేసీఆర్ మద్దతు ప్రకటించారు. దేశ ప్రయోజనాలు లేని బిల్లులను మాత్రమే వ్యతిరేకించారు. కానీ రాజకీయ రంగుటద్దాలతో రాజ్యమేలుతున్న ఢిల్లీ పార్టీ హైదరాబాద్ పట్ల ఎల్లప్పుడూ వివక్షకు పాల్పడుతూనే వస్తున్నది. తెలంగాణ రాష్ట్రం పట్ల, రాజధాని హైదరాబాద్ పట్ల ప్రధాని మోదీలో ఏనాడూ ప్రేమలేదు. నలుగురు ఎంపీలను గెలిపించిన రాష్ర్టాన్ని పట్టించుకోని మోదీ, రేపు జీహెచ్ఎంసీని పట్టించుకుంటా డనే గ్యారంటీ ఎక్కడ? ‘పిల్ల నుంచి తల్లిని వేరు చేశార’ని తెలంగాణ పట్ల తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన వైఖరి మారుతుందని ఆశించవచ్చా? కొత్త రాష్ర్టానికి ఏమైనా చేద్దామనే సోయి ఆయనలో ఎన్నడూ కనిపించలేదు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలను, పాలనా తీరును, తెచ్చిన పెట్టుబడులను, అవలంబిస్తున్న ఆర్థిక విధానాలను ఢిల్లీ పాలకులు పలువరు ప్రశంసించిన సందర్భాలకేం కొదువ లేదు. ప్రశంసలతో కడుపు నిండదు. ఆపదలో, అవసరాల్లో, అభివృద్ధిలో ఆదుకున్నదే గీటురాయవుతుంది. అన్ని మహా నగరాలను సమానంగా చూసే విశాల దృక్పథం లేని పార్టీ.. హైదరాబాద్‌ను ఎలా ఉద్ధరిస్తుందని నగరవాసులు విశ్వసిస్తారు?
కేంద్రం సహకరించకపోయినా.. ఆరేండ్లలో హైదరాబాద్ నగరాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సెంటర్‌గా, పెట్టుబడులకు కేంద్రంగా మార్చడంలో కేసీఆర్ ప్రభు త్వం విజయం సాధించింది. అలజడులు, అల్లర్లులేని నగరంగా భాసిల్లుతున్నది. స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్ ఉన్న లోకల్ పార్టీయే హైదరాబాద్‌కు అవసరమని అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్‌కు ఇప్పుడు ఒక బ్రాండ్ ఇమేజ్ సమకూరింది. మరో ఐదేండ్లలో హైదరాబాద్ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకొని దేశంలో అత్యున్నత నగరంగా వెలుగొందాలంటే.. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఢిల్లీని కాదు, హైదరాబాద్‌నే గెలిపించుకోవాలి. మన హైదరాబాద్‌ను ఎలా చూడాలన్నది మన నగర ఓటర్ల చేతుల్లోనే ఉన్నది.
కల్లూరి శ్రీనివాస్‌రెడ్డి
తాజావార్తలు
- 'సన్‌షైన్ మంత్ర' ఫాలో కండి: రకుల్
- మధ్యాహ్నం కునుకు.. ఆరోగ్యానికి ఎంతో మంచిది..!
- ఎర్రకోటపై జెండా పాతిన రైతులు
- మిషన్ భగీరథ..అచ్చమైన స్వచ్ఛ జలం
- సైడ్ ఎఫెక్ట్స్ భయంతో కొవిడ్ వ్యాక్సిన్‌కు దూరం
- అనుచిత వ్యాఖ్యలు..వివాదంలో మోనాల్ గజ్జర్
- క్యాండీలు తినేందుకు ఉద్యోగులు కావలెను..
- ట్రాక్టర్ పరేడ్ : మెట్రో స్టేషన్ల మూసివేత
- అడ్డుకున్న పోలీసులపైకి కత్తి దూసిన రైతు
- నిలకడగానే శశికళ ఆరోగ్యం: వైద్యులు