ఆదివారం 17 జనవరి 2021
Editorial - Dec 01, 2020 , 00:47:02

దార్శనిక ప్రగతి

దార్శనిక ప్రగతి

ఉన్నత విద్యకోసం విద్యారుణాలను పలు రాష్ర్టాలు ఇస్తున్నా ఇక్కడ విదేశీ విద్యకు కూడా ప్రభుత్వం సాయమందిస్తున్నది. ఒక్కో విద్యార్థికి 20 లక్షల చొప్పున పూర్తి ఉచిత గ్రాంటు ఇస్తున్నది. అలా మహాత్మా జ్యోతిబాఫూలే ఓవర్సీస్‌ విద్యానిధి పథకం ద్వారా ఇప్పటికే 1100 విద్యార్థులను విదేశాలలో చదివిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు పేదవర్గాలను ఆదుకుంటున్నాయి. ఒకేచోట నాణ్యమైన విద్య, వసతి, పౌష్టిక ఆహారంతో మహాత్మా జ్యోతిబాఫూలే రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలు నడుస్తున్నాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరదృష్టి, దార్శనికత మార్గదర్శకమైనవని ప్రభుత్వం చేపట్టిన పథకాలు రుజువు చేస్తున్నాయి. అనేక రాష్ర్టాలు ఇక్కడి పథకాలను నమూనాగా తీసుకుంటున్నాయి. దేశంలో ఎక్కడాలేని విధంగా విభిన్న సంక్షేమ పథకాల వల్ల వివిధ వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారు.  ఆధునిక టెక్నాలజీలో ముందంజ, భారీ స్థాయిలో పెట్టుబడులతో పలు రకాల పరిశ్రమల విస్తరణ ఏకకాలంలో సాధిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే. 

సమాజంలో అణగారిన బడుగు బలహీన వర్గాలకు అన్ని పార్టీలు, ప్రభుత్వాలు అనేక వాగ్దానాలు చేసినా అమలులో ఫలితాలేమీ లేవు. వివిధ రంగాల్లో సముచిత ప్రాతినిధ్యాన్ని పొందలేదు. అందుకే కేసీఆర్‌ ప్రభుత్వం కుల, మత వివక్ష లేకుండా అందరూ సమాన హోదాతో, గౌరవంతో మనుగడ సాగించే సమాజం కోసం కృషి చేస్తున్నది. కీలకమైన విద్య, వైద్యం, ఆవాసం, ఉపాధి విషయాల్లో ఆదర్శనీయంగా ఆచరణాత్మకంగా వ్యవహరిస్తున్నది. ప్రగతి వికాసంలో ఆదర్శంగా నిలుస్తున్నది.

వివిధ కుల వృత్తి దారులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఆదుకుంటున్నది. దీంతో ఆయా వర్గాలు ఆర్థికంగా బలోపేతమవుతున్నాయి. నైపుణ్య శిక్షణ అందిస్తూ, సబ్సిడీపై అధునాతన యంత్ర పరికరాలు అందజేస్తున్నది. నాయీబ్రాహ్మణ, రజక, మేదర, శాలివాహన, పూసల, వడ్డెర, సగర, వాల్మీకి, బోయ, భట్రాజ్‌, కుమ్మరి, విశ్వబ్రాహ్మణ వంటి వర్గాలను 13 ఫెడరేషన్ల ద్వారా ఆదుకుంటున్నది. అలాగే బీసీల్లోని సంచార, అర్ధ సంచార, విముక్త, ఇతర జనాధిక్యం లేని కులాలకు వందశాతం సబ్సిడీతో ఆర్థికంగా చేయూతనందిస్తున్నది. ఆయా కులాల ఆత్మగౌరవ ప్రతీకలుగా కుల భవనాలు నిర్మిస్తున్నది. దీనికోసం రూ.80 కోట్లను మంజూరు చేసింది. ఆయాకులాలన్నీ కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరుస్తున్నాయి. విద్వేష  విషప్రచారాలతో అందలం ఎక్కడానికి చేసే డ్రామాలు, కపట రాజకీయాలను ఈ వర్గాలు విశ్వసించవు. వివిధ వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్న  ఈ ప్రభుత్వానికే పూర్తి మద్దతు తెలుపుతున్నాయి.

డాక్టర్‌ వకుళాభరణం 

కృష్ణమోహన్‌రావు