విష ప్రచారాల వికృత క్రీడ

ఒక గెలుపు అహంకారంతో కూడిన విద్వేషాన్ని అరాచకాన్ని సృష్టిస్తుందా? అని ఒకసారి ఆలోచిస్తే అవుననే అనిపిస్తుంది. గెలుపు ఓర్పును ఇస్తుంది. కాని బీజేపీకి విద్వేషాన్ని ఇచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి ప్రసార మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో బీజేపీ నాయకుల మాటలు చూస్తుంటే నాలుగు ఓట్ల కోసం, రెండు సీట్ల కోసం హైదరాబాద్ నగరంలో ఏదో విధ్వంసాన్నో అరాచకాన్నో సృష్టించేటట్లే ఉన్నాయి. ఎన్నికల ప్రచారం ప్రజలకు హామీలుగానో, వాగ్దానాలుగానో ఉండాలి. కానీ బీజేపీ నాయకుల మాటలు విద్వేషాన్ని విషాన్ని చిమ్మే విధంగా ఉన్నాయి. తప్పుడు ప్రచారాలతో, అబద్ధాలతో ప్రజలను, ముఖ్యంగా తెలంగాణ యువతను తప్పుదారి పట్టిస్తున్నారు. రేపటి తరాన్ని విషప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వాన్ని చిటికెలో కూల్చేస్తాం అని బీజేపీ నాయకులు అంటున్నారు. గల్లీ స్థాయి నాయకుల నుంచి కేంద్రస్థాయి నాయకుల దాకా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాసమస్యల పరిష్కారం, సమాజ అభివృద్ధి కీలక అజెండా కావాల్సిన ఎన్నికల సమయంలో ఆ ప్రాథమిక అంశాలను పక్కదారి పట్టిస్తున్నారు. భావోద్వేగాలకు గురిచేసే మతం, ఆలయం, విదేశాల ప్రస్తావనతోనే ప్రచారం సాగిస్తున్నారు. వీరి మాటల్లో హిందు పదం తప్ప చట్టం, శాసనం, రాజ్యాంగం, సామాజిక న్యాయం అనే పదాలు వినిపించవు. వీరి మాటలు హైదరాబాద్ మహానగరంలో తరతరాలుగా సోదర భావంతో బతుకుతున్న రెండు మతాల వారు విడిపోయి, శత్రువులుగా మారాలని కోరుకుంటున్నట్లు స్పష్టమవుతుంది. ఈ మాటలు తెలంగాణ లౌకికతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. తెలంగాణవాదులు, బుద్ధిజీవులు, తీవ్రంగా ఆలోచించవలసిన అంశమిది.
2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి బీజేపీ దేశవ్యాప్తంగా ప్రాంతాలపై, రాష్ర్టాలపై వివక్ష చూపుతున్నది. విద్వేష రాజకీయాలను ఎగదోస్తున్నది. ఈ ఆరేండ్ల కాలంలో ఎన్నో చట్ట వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ వస్తున్నది. ప్రైవేట్ సంస్థల అభివృద్ధి కోసం ప్రభుత్వ సంస్థలను మూసేస్తున్నది. రిలయన్స్ గ్యాస్ కోసం భారత్ గ్యాస్‌ను దెబ్బతీసింది. జియో నెట్వర్క్ కోసం బీఎస్ఎన్ఎల్ను బలహీనపరిచింది. ఎంతోకాలంగా ప్రజలకు బీమా ధీమా ఇస్తున్న ఎల్ఐసీని మూసేసే ప్రణాళిక సిద్ధం చేసింది. బీజేపీ చట్ట వ్యతిరేక విధానాలు ఇన్నన్ని కావు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడి స్వయం ప్రతిపత్తి కలిగిన యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, సీబీఐ, ఈడీ, న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్, సమాచార హక్కు చట్టం తదితరాలన్నింటిని దెబ్బతీస్తున్నది. ఉన్నత విద్య ప్రమాణాలను, పరిశోధనలను పెంపొందించే యూజీసీని ముక్కలు ముక్కలు చేసింది. సృజనాత్మక విద్యను నిరోధిస్తున్నది. అలాగే ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్స్ రిసెర్చ్‌ను బలహీనపరిచింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రిసెర్చ్‌కు వారి అనుకూల నేతృత్వాన్ని పెట్టుకున్నది. యూజీసీ నిధులను తగ్గించింది. ఎంతోమంది బలహీన వర్గాల విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసింది. అత్యున్నత ప్రామాణిక విద్యాసంస్థల అధిపతులను ఇష్టారాజ్యంగా మార్చి, తమకు, తమ ఆలోచన విధానాలకు అనుకూలంగా ఉన్నవారిని నియమించుకున్నది. అలాగే విశ్వవిద్యాలయాల్లో నచ్చని సిలబస్‌ను తొలగించింది.
నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద ఎన్నో నేరారోపణలు ఉన్నాయి. అలాగే అతని ముఖ్య అనుచరుడిగా ఉన్న ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆరోపణలు ఉన్నాయి. మోదీ ప్రధాని కాగానే ఈ ఇద్దరిపైన అన్ని కేసుల్లో ఎలాంటి విచారణ లేకుండానే కోర్టుల ద్వారా క్లియరెన్స్ తెచ్చుకున్నారు. ప్రతిపక్ష రాజకీయ నాయకుల మీద కక్ష సాధింపులకు సీబీఐని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను దుర్వినియోగపరుస్తున్నారు. మహర్ల సాహసానికి ప్రతీక అయిన బీమాకోరేగావ్ను చరిత్రపుటల్లో లేకుండా చేయడానికి అక్కడ పథకం ప్రకారం విధ్వంసం, హింస సృష్టించారు. ఈ హింసాకాండకు ప్రధాన కారకులైన ఆరెస్సెస్ నాయకులను రక్షించడానికి, మధ్యలో నరేంద్రమోదీ హత్య కుట్రను సృష్టించారు. ఈ కుట్రలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది మేధావులనూ, ప్రజాస్వామికవాదులనూ అర్బన్ నక్సలైట్ల పేరుతో అరెస్టు చేసి జైల్లో వేశారు.
అవినీతిరహిత భారత్‌ను నిర్మిస్తామని చెప్పిన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ సంపదను పిడికెడు మంది కార్పొరేట్ దిగ్గజాలకు కట్టబెడుతున్నది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో హింస రోజురోజుకు పెరిగిపోతున్నది. కొన్ని తీవ్ర ఘటనలు మీడియా ద్వారా దేశ ప్రజలను, రాజకీయ పార్టీలను, నాయకులను, మేధావులను కలవరపెట్టి వారిలో కదలిక తెచ్చాయి. అలాంటివారి అభిప్రాయాలు ప్రజలకు చేరకుండా మీడియాను కూడా బీజేపీ నియంత్రిస్తున్నది. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులను నియామక అధికారులు కాకుండా బీజేపీ నాయకులే నియమించే ధోరణి చోటుచేసుకుంటున్నది. న్యాయవ్యవస్థలను కూడా ప్రభావితం చేసే వైఖరి కనిపిస్తున్నది. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ నడిచే తీరు కాదిది. అన్ని ప్రజాస్వామిక విలువలను కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కాలరాస్తుండటం ఆందోళనకరం.
తెలంగాణ విషయంలో బీజేపీ మొదటినుంచీ అవకాశవాద రాజకీయాలకే పాల్పడుతూ వస్తున్నది. ఆ పార్టీ నాయకులు ఢిల్లీలో ఒక మాట, రాష్ట్రంలో ఒక మాట మాట్లాడుతారు. వారి మాటల వెనుక కుట్రలు, దగా దాగుంటాయి. ప్రజలను మతం పేరుతో ఉద్వేగాలకు, ఆక్రోశాలకు గురిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఓటుగా మలుచుకోవాలనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. గత ఆరేండ్లుగా తెలంగాణలో యువతను లక్ష్యం చేసుకొని రాజకీయ క్రీడ కొనసాగిస్తున్నారు. యువతలో హిందుత్వ భావజాలాన్ని చొప్పించి ఈ ప్రాంతాన్ని కాషాయీకరణ చేయాలనుకుంటున్నారు. తెలంగాణలో విస్తరించడానికి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతిదానిని హిందుత్వ కోణంలో చూస్తూ చరిత్రను వక్రీకరిస్తారు.
హైదరాబాద్‌లో లౌకికవాదాన్ని దెబ్బతీయడానికి జీహెచ్ఎంసీ ఎన్నికలను వాడుకుంటున్నారు. ఒక ఎంపీ టీఆర్ఎస్ ఫ్లెక్సీలను దగ్గరుండి చింపేయిస్తే, మరో ఎంపీ హైదరాబాద్‌పై సర్జికల్ స్ట్రైక్ అంటున్నారు. ఇదేనా సామరస్య వైఖరి? ఈ పరిణామం తెలంగాణ సంస్కృతికి, జీవన విధానానికి మంచిది కాదు. ఒక ప్రాంత అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడేశక్తి ఆ ప్రాంత ప్రాంతీయ పార్టీ వల్లనే సాధ్యం. ఇలాంటి మతతత్వ పార్టీల వల్ల విధ్వంసం, విచ్ఛిన్నమే తప్ప నిర్మాణం, ప్రగతి ఎన్నటికీ సాధ్యం కాదు. విద్వేషాన్ని అడ్డుకుందాం. సామరస్య ప్రగతి బాటన సాగుదాం.
మాందాల భాస్కర్
తాజావార్తలు
- పైన పటారం అనే సాంగ్‌తో అనసూయ రచ్చ
- కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయినట్టే: విజయ్ రూపానీ
- ట్రైలర్‌తో ఆసక్తి రేపిన గాలి సంపత్ టీం
- 200 మంది ఖైదీలు పరారీ.. 25 మంది మృతి
- రాజన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి
- ఇస్రో సరికొత్త అధ్యాయం.. పీఎస్ఎల్వీ-సీ51 కౌంట్‌డౌన్ షురూ..
- నేటితో ముగియనున్న మేడారం చిన్న జాతర
- సల్మాన్‌కు ధన్యవాదాలు తెలిపిన రాఖీ సావంత్ తల్లి
- నైజీరియాలో 317 మంది బాలికలు కిడ్నాప్..
- మాఘ పూర్ణిమ.. కాళేశ్వరంలో శ్రీవారికి జలాభిషేకం