గురువారం 04 మార్చి 2021
Editorial - Nov 29, 2020 , 01:55:29

పచ్చని పట్నంలో చిచ్చువద్దు

పచ్చని పట్నంలో చిచ్చువద్దు

అనేక పోరాటాలు, ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మరో పరీక్షను ఎదుర్కొంటున్నది. రాష్ట్ర పునర్నిర్మాణానికి కంకణబద్ధుడై ముందుకుసాగుతున్నకేసీఆర్‌ ప్రభుత్వ పాలనపై ఓ వర్గం కట్టగట్టుగొని దాడిచేస్తున్నది. అసత్యాలు, అర్ధసత్యాలతో దుష్ప్రచారం చేస్తూ ఇప్పుడు హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కుటిల పన్నాగాలకు దిగుతున్నది. దేశంలోనే ప్రజాస్వామ్య మనుగడ ప్రమాదంలో పడింది. జాతీయవాదం నీడలో రాజ్యాంగంపై దాడి జరుగుతున్నది. ప్రజల ఉద్వేగాలతో ఆటలాడుకునే వికృత క్రీడ సాగుతున్నది. పాకిస్థాన్‌, చైనాలను బూచిగా చూపి ఓట్ల వేటకు దిగడం, బాధ్యతలేని సోషల్‌ మీడియాను వేదికగా చేసుకొని మతం ముసుగులో యువకులను ఉన్మాద మానసిక స్థితిలోకి తీసుకెళుతుండటం ఎంతమాత్రం సముచితం కాదు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ఆదర్శంగా అభివృద్ధి చెందుతున్నది. దేశంలో మరెక్కడా లేని పథకాలు, ప్రగతిక్రమం అంతటా ప్రశంసలు అందుకుంటున్నది. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి.. ప్రజల ప్రశాంత జీవనానికి భంగం వాటిల్లకుండా శాంతిభద్రతల పరిరక్షణ అన్నింటా టీఆర్‌ఎస్‌ సర్కారు ప్రత్యేకతను చాటుతున్నది. ఇలాంటి వాతావరణాన్ని దెబ్బతీసేలా విషప్రచారంతో, విద్వేషభావనతో బీజేపీ ఇప్పుడు అధికారంకోసం విద్వేషాలు రెచ్చగొట్టటం ప్రమాద సంకేతం. ఓ హెచ్చరిక. విజ్ఞులైన ప్రజలు ఆలోచించుకుని అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సందర్భమిది. ఏ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తే ప్రజలకు, నగరానికి, రాష్ర్టానికి ఎలాంటి ఫలితాలు వస్తాయో అంచనా వేసుకోవాలి. 

ఈ ఆరేండ్ల కాలంలో హైదరాబాద్‌ను ప్రభుత్వం విశ్వనగరం దిశగా తీసుకెళ్ళింది. కొత్త మున్సిపల్‌ చట్టం, టీఎస్‌ఐపాస్‌, టీఎస్‌బీపాస్‌ తీసుకువచ్చింది. పరిశ్రమలు, పెట్టుబడులు పెరిగాయి. ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి. కరోనా కాలంలోనూ రూ.ఐదు వేల కోట్ల పెట్టుబడులు రాష్ర్టానికి వచ్చేలా చేసింది. ఇలా అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచింది. మహానగరంలో మత కల్లోలాలు లేవు. రౌడీషీటర్ల సమస్య లేదు. మహిళల రక్షణకు ప్రత్యేకంగా షీ టీంలను ఏర్పాటుచేసింది. చీమ చిటుక్కుమన్నా పసిగట్టేలా సెంట్రల్‌ కమాండింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దుర్గం చెరువుపై తీగల వంతెన నిర్మించింది. ప్రజారోగ్యానికి పెద్దపీట వేసి నగరవ్యాప్తంగా 350 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసింది. 

వందేండ్లలో రెండోసారి  నగరాన్ని భారీ వరదలు ముంచెత్తి అవస్థలపాలు చేశాయి. ఇలాంటి కష్టాలు ఎదురైనపుడు పాలకులు ఎలా స్పందించారనేదే ముఖ్యం. ముంబై, చెన్నై నీట మునిగితే తేరుకునేందుకు నెలలు పట్టింది. హైదరాబాద్‌లో రికార్డుస్థాయిలో వానకురిసినా, కాలనీలు నీట మునిగినా నాలుగు రోజుల్లోనే తేరుకున్నాయి. ప్రభు త్వం వేగంగా స్పందించి బాధితులకు సహాయం చేస్తూ భరోసా కలిగించింది. ఇదిలా ఉంటే ప్రతిపక్షాలు మాత్రం బురద రాజకీయం నడిపాయి. వానలు పడ్డప్పుడు పత్తాలేని నేతలు ఇప్పుడు ఓట్ల కోసం వికృత చేష్టలకు దిగుతున్నారు. బాధితులను ఎగదోస్తూ ఆందోళనలు చేస్తున్నరు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యత మరిచి వ్యవహరించటం గర్హనీయం. 

రాష్ట్రంలో  హిందువులు, ముస్లింలు, పార్సీలు, సిక్కులు అంతా కలిసిమెలిసి జీవిస్తున్నారు. సహజీవనం సాగిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ అన్ని పండుగలను ఆదరించారు. రాష్ట్ర ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తూ పూజలు చేశారు.  అన్ని మతాలను సమానంగా ఆదరిస్తున్నారు. అదేవిధంగా అనేక సందర్భాల్లో జాతీయ దృక్పథంతో వ్యవహరించారు. ట్రిపుల్‌ తలాక్‌ లాంటి బిల్లులకు మద్దతు పలికారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబించినపుడు నిరసించారు. ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ, విద్యుత్‌ సంస్కరణ బిల్లులపై వ్యతిరేకతే అందుకు ఉదాహరణ. జీఎస్టీ చెల్లింపులపై కేంద్రం వ్యవహార శైలిని తప్పుబట్టారు. 

అభివృద్ధికి అండగా నిలువడమా.. లేదంటే విద్వేషాలు, విష ప్రచార మాయలో పడి భవిష్యత్తును పణంగా పెట్టుకోవడమా? హైదరాబాదీలు ఆలోచించుకోవాలి. రాజకీయాల కోసం పచ్చని భాగ్యనగరంలో చిచ్చు రాజేస్తున్నారు. మతాల మధ్య విద్వేషాలను సృష్టిస్తూ చలి మంటలు కాచుకోవాలనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు విజ్ఞతతో నిర్ణయం తీసుకోవాలి. ఏమాత్రం పొరపాటు చేసినా గ్రహపాటు తప్పదు. ప్రశాంత జీవనానికి భంగం కలుగకమానదు. అప్రమత్తతే రక్ష. 

పుట్ట రమేష్‌

VIDEOS

logo