శనివారం 16 జనవరి 2021
Editorial - Nov 29, 2020 , 01:55:29

కన్యాకుమారిలో దాగిన తత్తం

కన్యాకుమారిలో దాగిన తత్తం

అర్థాసక్తులు, పరమార్థాసక్తులు- అని లోకంలో రెండు విధాల వక్తలు, శ్రోతలు ఉన్నారు. వక్త శ్రోతలు ఇద్దరూ పరమార్థప్రియులైతే కథారసగంగాతరంగ నిమజ్జనం శ్రోతల అంతరంగాలలోని వ్యథను శాశ్వతంగా తొలగించి సుఖశాంతులు కలిగిస్తుంది. ఇది ఫలశ్రుతి. అలాకాక, వక్త శ్రోతలు విరుద్ధ స్వభావులైతే- అనగా ఇద్దరిలో ఏ ఒకరైనా గోవర్ధన ప్రియులు కాక ధనప్రియులైతే రసోదయం కాక రసభంగమే- రసాభాసే దక్కుతుంది. ఇది ఫలచ్యుతి. అచ్యుత భగవానుడు ఆనందమయుడు, ప్రేమ-రసమయుడు. పరాభక్తి సాధకునికే ఈ అనుభూతి లభించేది. తైత్తిరీయ ఉపనిషత్తు, ‘జ్ఞానం బ్రహ్మ, ఆనందం బ్రహ్మ’- అని చెబుతూ చివరకు ‘రసోవైసః’ అని ముక్తాయింపు ఇస్తుంది. రసస్వరూపమైన ఈ బ్రహ్మానుభవమే మనుష్యసాధనకు చరమ- పరమ లక్ష్యం.

శౌనకాది మహర్షులు సూత పౌరాణికునితో- ‘మహాశయా! సత్పురుషుల సభలో హరికథలు, హరిభక్తుల గాథలు తప్ప అన్యకథానులాపాలు ఉండవు. వక్త వైయాసకి, శ్రోత విష్ణురాతుడు- ఇద్దరూ వాసుదేవ పరాయణులే. వసు(ధన, సంపద) దేవ పరాయణులు కారు. ఇది అపూర్వమైన యోగం. అమోఘమైన సంయోగం. ఇదే మా శ్రవణ కుతూహలానికి కారణం. సూతా! శుక పరీక్షిత్‌ సంవాదాన్ని మాకు తు.చ. తప్పకుండా చెప్పమ’ని అర్థించారు... శుకుడన్నాడు- రాజా! భగవంతుడు నిష్కాములకు తప్ప ఇతరులకు భజనీయుడు కాడా? అని శంకించవద్దు- 

క. కామింపకయును సర్వము

గామించియునైన ముక్తిగామించి తగన్‌

లోమించి పరమ పురుషుని

నేమించి భజించు దత్తనిపుణుండధిపా!

‘నరేంద్రా! అకామః- ఏ కోరికా లేనివాడైనా, సర్వకామః- అన్ని కోరికలు కోరేవాడైనా, మోక్షకామః- ఇతరమేమీ కోరక కేవలం కైవల్యం కాంక్షించేవాడైనా తీవ్రమైన తమకంతో మనస్సును అరికట్టి తత్తం- పరమార్థం తెల్సుకున్న ప్రజ్ఞావంతుడు పరమపురుషుడైన పుండరీకాక్షుని మాత్రమే పరాభక్తితో స్వాధీనపరచుకొని సేవిస్తాడు’ అని పై పద్యానికి అర్థం. మూలశ్లోకానికి మిక్కిలి విధేయమై ‘కామించి, లోమించి, నేమించి’- ఈ అనుప్రాస అందంతో వీనులవిందైన కందం ఇది. భగవంతుడు నిష్కాములకు, నిఃశ్రేయస (మోక్ష) కాములకు తప్ప ఇతరులకు (సకాములకు) భజనీయుడు- సేవింపతగవాడు కాడా? అన్న జనసందోహపు సందేహాన్ని భంజించి- భగ్నం చేసి, సకామ భక్తులకు కూడా సర్వేశ్వరుని ధర్మరాజ్యంలో పౌరసత్వం ప్రసాదించిన పవిత్ర పద్యరాజమిది! ‘చతుర్విధా భజంతే మాం... ఆర్తో జిజ్ఞాసుః అర్థార్థీ జ్ఞానీ చ’- అన్న గీతావాక్యంతో అన్వయిస్తే అకాముడు జ్ఞానీ భక్తుడు. మోక్షకాముడు జిజ్ఞాసువు. ఇక సర్వకాములందరూ ఆర్త లేక అర్థార్థీ భక్తులు. ఈ ‘సర్వకాము’లను కూడా పరమాత్మ ‘సుకృతినః’- పుణ్యపురుషులని పరిగణించటం గమనార్హం. ఎందుకని? అంటే, వారందరూ (సర్వః శర్వః శివః స్థాణుః- విష్ణు సహస్రనామస్తోత్రం) ‘సర్వ’ (సర్వము తానయైన వాడు) స్వరూపుడైన తననే కామిస్తున్నారు- కోరుతున్నారు కదా! ఈ భక్తి సంస్కారబలంతో వారు కూడా సాధన- అభ్యాస క్రమంలో అగ్రగాములవుతూ ఎప్పటికైనా తప్పక, ముందు ముముక్షువులు- మోక్షకాములై తర్వాత అకాములు- ముక్తులు, భక్తులు అవుతారు. ముక్తులంటే సరే, భక్తులేమిటని? అంటే ‘అ’కామః- ‘అ’ అనే అక్షరానికి విష్ణువని (అక్షరాణాం అకారోస్మి- అక్షరాలలో అ కారం నేనే అని గీత) అర్థం. అనగా విశేషంగా, అకాములంటే ముక్తిని కూడా కోరక కేవలం విష్ణువును- విష్ణుభక్తిని మాత్రమే కోరువారు. భాగవత పురాణ దృష్టిలో భక్తికి ఫలం భక్తే కాని ముక్తి కాదు!

సీ. వాసుదేవ శ్లోకవార్త లాలించుచు

గాలమే పుణ్యుండు గడుపుచుండు

నతని యాయువు దక్క నన్యుల యాయువు

నుదయాస్తమయముల నుగ్రకరుడు

వంచించి కొనిపోవు వాడది యెఱుగక

జీవింతు బెక్కేండ్లు సిద్ధమనుచు

నంగనా పుత్త్ర గేహారామ విత్తాది

సంసార హేతుక సంగ సుఖము

తే. దగిలి వర్తింప గాలంబు తఱియెఱింగి

దండధర కింకరులు వచ్చి తాడనములు

సేసి కొనిపోవ బుణ్యంబు సేయనైతి

బాపరతి నైతినని బిట్టు పలవరించు.

పరీక్షిన్నరేంద్రా! ఘన యశస్సు కలిగిన నవ ఘనశ్యాముని నిత్యనూతన లీలాకథలు వింటూ కాలాన్ని సార్థకం చేసుకొనే పుణ్యాత్ముని ఆయువు తప్ప అన్యుల ఆయువును ఆదిత్యుడు ఉదయ, అస్తమయాల చేత వంచించి అపహరించుకు పోతున్నాడు. ఇది గమనించలేని మూర్ఖుడు తన బతుకు శాశ్వతమని భ్రమించి తన భవనాలు, వనాలు, ఆలుబిడ్డలు, ధనాలు ధాన్యాలు, వస్తువాహనాల లంపటంలో తగుల్కొని సంసార సుఖం మరగి మైకంలో పడి ఉంటాడు. ఆ మత్తులో తెలియకుండా గమ్మత్తుగా వాని ఆయువు తీరిపోగా అంతకు(యుము)ని దూతలు వచ్చి తిడుతూ, తన్నుతూ తీసుకుపోతూ ఉంటే- ‘అయ్యో! పుణ్యమనే ఊసే లేకుండా బతుకంతా పాపానికే ఒడిగట్టానే’ అని గోడు-గోడున ఏడుస్తాడు. మూలశ్లోకాన్ని పెంచి దానికి వ్యాఖ్యానంగా పోతన రూపొదించిన సీసపద్యమిది.

కన్యాకుమారి వంటి సముద్ర తీర ప్రదేశాలకు వెళ్లే పర్యాటకులు అక్కడ ఉదయ, అస్తమయాల సూర్యబింబం అందాలను తిలకించి, పులకరించి పోతారే గాని, ప్రతిరోజు అలా కనిపించి కనువిందు చేస్తూ, కనుమరుగవుతూ తపనుడు (సూర్యుడు) తెలియకుండానే తమ ఆయుష్కాలాన్ని వంచించి తస్కరించుకుపోతున్నాడనే తెలివి లేకుండా ఉన్నారే! ‘జీవింతు బెక్కేండ్లు సిద్ధమనుచు’- వయసుతో నిమిత్తం లేకుండా దినం దినం కళ్ల ముందు మరణించే అనేకమందిని చూస్తూ కూడా బతికి ఉన్నవారు- తాము మాత్రం చావకుండా అపరమార్కండేయులై స్థిరంగా ఉంటామన్నట్లు వ్యవహరిస్తున్నారంటే- ‘కిమాశ్చర్యమతః పరం’- ఇంతకన్నా వింత ఉన్నదా?

రాజేంద్రా! జీవిత కాల పర్యంతం జీవించి కడతేరటం మాత్రమే జీవన సాఫల్యం కాదు. మరి జీవిత రహస్య శోధన ఎప్పుడు?

సీ. అలరు జొంపములతో నభ్రంకషంబులై

బ్రదుకవే వనముల బాదపములు

ఖాదన మేహనాకాంక్షల బశువులు

జీవింపవే గ్రామ సీమలందు

నియతిమై నుచ్ఛాస నిశ్శాస పవనముల్‌

ప్రాప్తింపవే చర్మ భస్త్రికలును

గ్రామ సూకర శునక శ్రేణు లింటింట

దిరుగవే దుర్యోగ దీన వృత్తి

తే. నుష్ట్రఖరములు మోయవే యురుభరముల

బుండరీకాక్షునెణుగని పురుష పశువు

లడవులందు నివాసములందు బ్రాణ

విషయభరయుక్తితో నుంట విఫలమధిప.

‘అటవీ ప్రాంతాలలో అంబరాన్ని అంటుతూ పూలగుత్తులతో విటపీ (వృక్ష) జాతులు వసించటం లేదా? పల్లెపట్టుల్లో పశువులు ఆహార, మైథున (సంతానోత్పత్తి, స్పర్శసుఖం) వాంఛలతో బతకడం లేదా? ప్రాణం లేని కొలిమితిత్తులు జడములైనా ఎడం లేక గాలి పీల్చుకొని వదలటం లేదా? ఊరపందులు, కుక్కలు కూటికోసం దిక్కుమాలి దీనంగా వీధుల్లో ఇంటింటా తిరగటం లేదా? ఒంటెలు, గాడిదలు రొప్పుతూ రోస్తూ పెద్ద-పెద్ద బరువులు మోస్తున్నాయి కదా! ఈ పశుజీవితాలకు ఇంతకుమించి పరమార్థమేముంటుంది? మేటి జన్మ పొందిన పురుష పశువులు కూడా వీటితోనే పోటీపడుతూ పుండరీకాక్షుని- పరమాత్మను తెలియనేరక అరణ్యాలలోనో, ఆవాసాలలోనో ప్రాణ పరిపోషణకై ప్రయత్నిస్తూ విషయ సుఖాలకు వెంపరలాడటం విఫల జీవనం కాదా?’

‘తరవోపి హి జీవంతి జీవంతి మృగపక్షిణః, స జీవతి మనోయస్య మననేనోపజీవతి’- చెట్లు, చేమలు, పక్షులు మృగాలు బతుకుతున్నట్లే మనిషి కూడా బతికితే విశేషమేముంది? ఆత్మానుసంధాన తత్పరమైన మనస్సు కల్గినవాడే నిజంగా జీవిస్తున్నాడు. కానిచో జీవన్మృతుడే!- అని మహోపనిషత్‌ మంత్రం. ‘ఆత్మ చింతన కంటె ఇతరమైన శాస్ర్తాభ్యాసం ఒంటె కుంకుమ బరువును మోయునట్లు వ్యర్థమే’- అని నారదపరివ్రాజక ఉపనిషత్తు. మంచిగంధపు చెక్కలు మోసే గాడిదకు దాని బరువు తప్ప పరిమళ తెలియనట్లు, అనేక శాస్ర్తాలు చదివికూడా అర్థవిశేషం- పరబ్రహ్మను తెలియనివారు గాడిదల వలె శాస్ర్తాల బరువు మోస్తూ తిరిగేవారే కదా! ‘పుండరీకాక్షునెఱుగని పురుష పశువులు’- భగవంతుని భక్తి, తత్తజ్ఞానములు లేనివారు మానవరూపంలో సంచరించే మృగాలు- ‘మనుష్యరూపేణ మృగాశ్చరంతి’.

తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ

98668 36006