అసత్య వాక్కులా.. ఆచరణశీలతా?

ఎన్నికల సందర్భంలో రాజకీయ పార్టీలు రకరకాల వాదనలు వినిపించటం, వారి భావజాలాలను ప్రకటించటం జరుగుతుంది. ఇది సహజం. అయితే ఇప్పటి ఈ వాదనల హోరులో కొట్టుకుపోకుండా విజ్ఞులైన తెలంగాణ ప్రజలు ఆయా పార్టీల మూలాలు, అవి ఇప్పటిదాకా వ్యవహరించిన తీరు తెలుసుకోవటం చాలా ముఖ్యం. అప్పుడే మేలుచేసే రాజకీయ పార్టీ ఏదో, వంచించే పార్టీ ఏదో గ్రహించగలుగుతారు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ భావజాలానికి ఔచిత్యమున్నదా అని విశ్లేషించుకోవాల్సిన అవసరమున్నది.
తెలంగాణ ప్రస్తుతం ఉన్న ప్రాంతం, ఒకప్పుడు పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లోని కొన్ని ప్రాంతాలతో కలిసి నిజాం రాజ్యంగా ఉండేది. నిజానికి భారతదేశంలో 1948లో విలీనం కాకముందు అది ఒక స్వతంత్ర దేశం. ఇతర దేశాలతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న సంపన్నదేశం. బ్రిటిష్ పాలనలో ‘హిందూ’ అనే మతప్రభావంతో ఉన్న భారతదేశానికి, నిజాం రాజ్యంలో ఉండి తమ సనాతన ధర్మాన్ని పాటించిన తెలంగాణ ప్రాంతానికి సాంస్కృతికంగా, భావజాలపరంగా ఎంతో వ్యత్యాసం ఉంది. అసలు రెండు ప్రాంతాల ప్రజల ఆలోచనల్లో పొంతనే ఉండదు. దేశ స్వాతంత్య్రం తరువాత చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న చాలా భాగాలు కేంద్ర ప్రభుత్వ జోక్యంతో భారతదేశంలో విలీనమయ్యాయి. కానీ కశ్మీర్, హైదరాబాద్ రాజ్యాలు కాలేదు. అవి పెద్దవేకాక, వైవిధ్యమైనవి కూడా. కశ్మీర్ దేశవాసులలో అధికభాగం ముస్లిములు కాగా, పురాతన కాలంనుంచీ అక్కడి రాజులు సనాతనధర్మానికి చెందినవారు. హైదరాబాద్ రాష్ట్రంలో దాదాపు ఐదు శతాబ్దాలు పరిపాలన చేసిన రాజులు ముస్లిములు కాగా, అధికభాగం ప్రజలు సనాతన ధర్మానికి చెందినవారు. భారతదేశంలో జరిగినట్టు సనాతన ధర్మ విధ్వంసం హైదరాబాద్ రాష్ట్రంలో జరుగలేదు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పలు చారిత్రక ఘటనలను తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటుంది. సర్దార్ పటేల్ పేరును వినియోగించుకోవడం అందులో భాగమే. పరివార్ భావజాలంతో 1980లో ఏర్పడిన భారతీయ జనతాపార్టీ పూర్తిగా భారతీయ జనసంఘ్ పార్టీ లాగానే వ్యవహరిస్తున్నది. భావోద్వేగాలను రెచ్చగొట్టడమేగానీ ప్రజల అభివృద్ధికి, రాష్ర్టాల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వడం లేదు. ప్రత్యేకించి తెలంగాణ విషయానికి వస్తే ఆ పార్టీ చేసిన, చేస్తున్న అన్యాయాల చిట్టా చాలా పెద్దదే.
ఒక ఓటు రెండు రాష్ర్టాలు అని ఆంధ్ర రాజకీయ నాయకుల పరిపాలన కింద కునారిల్లుతున్న తెలంగాణను బీజేపీ మభ్యపెట్టి, ఎన్నికల వాగ్దానాలలో చేర్చి వదిలేసింది. అధికారంలోకి వచ్చాక వేరే మూడు రాష్ర్టాలు అలవోకగా చేసిన ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఏమాత్రం పట్టించుకోలేదు. కేంద్రంలో బీజేపీ పరిపాలన ఉన్నంతసేపు ఎవరు అధికారంలో ఉన్నా ఆంధ్ర ప్రాంతాన్ని, అక్కడి రాజకీయ నాయకులను అనుసరించారే తప్ప, తెలంగాణకు ఒక్క విషయంలో కూడా సహాయం చేయలేదు. పైగా ‘ముస్లిమ్ రాజులు పరిపాలించిన రాజ్యం’ అని ఒక శత్రువులాగా ఈ ప్రాంతాన్ని ఈసడిస్తారు. ‘గంగా జమునా తెహజీబ్'ను గౌరవించరు. తెలంగాణ రాష్ట్ర బిల్లుకు లోక్‌సభలో, రాజ్యసభలో ఎన్ని రకాలుగా అడ్డం పడ్డారో చరిత్రలో రికార్డయింది. ఇక 2014 ఎన్నికలలో వారి ప్రసంగాలలో తెలంగాణ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. ప్రస్తుత ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్ర న్యాయమైన ఏర్పాటును అతి దారుణంగా ‘తల్లిని చంపి పిల్లను బయటకు తీశారు’ అని వర్ణించారు.
ఇక ఇక్కడ గెలిచిన బీజేపీ అభ్యర్థులు ప్రజలను ఎలా మభ్యపెట్టారో గుర్తు చేసుకోవాలి. గెలిపిస్తే నెల రోజులలోనే హైకోర్టులు విడదీసి ఏర్పాటు చేస్తామన్న రామచంద్రరావు తర్వాత టీవీ చర్చల్లో తప్ప బయట ప్రజలను కలిసిందే లేదు. ఇక రెండవ ఎలక్షన్లో నిజామాబాద్‌లో గెలిచిన అరవింద్ ఐదు రోజుల్లో పసుపుబోర్టు ఏర్పాటు జరుగుతుందని ఎన్నికల ప్రచారంలో మభ్యపెట్టారు. బోర్టు ఏర్పాటు జరగకపోతే తాను రాజీనామా చేస్తానని ప్రమాణం చేశారు. ఆ తర్వాత అతీగతీ లేదు. ఇక తాజాగా దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందనరావు కేంద్రనిధులు తెచ్చి నియోజకవర్గాన్ని స్వర్గం చేస్తానని చెప్పి, గెలిచాక తిరుపతి వెళ్లి గుండు కొట్టించుకొని ఆ ప్రమాణాన్ని కూడా హుండీలో వేసి వచ్చారు. తానామాట అనలేదని బుకాయిస్తున్నారు. అలాంటి వీరందరూ ఇప్పుడు హైదరాబాద్ రోడ్లమీద మళ్ళీ ప్రచారం సాగిస్తున్నారు. వరదల్లో బాధపడిన హైదరాబాద్‌ను ఆదుకున్నవారు లేరు. కర్ణాటక, గుజరాత్లో వెచ్చించిన డబ్బులో పావువంతైనా హైదరాబాద్ వాసులకు చేయాలన్న భావన లేనివారు, కనీసం ఆపదలో ఉన్న ప్రజలను పలుకరించనివారు ఇప్పుడు గెలిస్తే 25వేలు బహుమతిగా ఇస్తామంటున్నారు.
ప్రజలు నమ్మాలా? నిజానికి ఏ రాజకీయ పార్టీనైనా భవిష్యత్తులో చేస్తామన్న ప్రమాణాలు నమ్మకుండా, భూతకాలంలో వారు ఏమి చేశారో ప్రజలు పరిశీలించాలి. ఈ ప్రాంతపు ప్రజల పట్ల 1948 నుంచీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ వ్యవహరించిన తీరును గుర్తు తెచ్చుకోవాలి. ఏ రకంగానైనా సహాయం చేశాయా అని బేరీజు వేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదం. 1948 నుంచి 1956 దాకా, మళ్లీ 1956 నుంచి 2014 దాకా తెలంగాణ ప్రజలు ఏ విధంగా బాధలు పడ్డారో గుర్తుచేసుకోవాలి. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో ప్రజలు ఎన్ని త్యాగాలు చేశారో మరిచిపోకూడదు. ఎంత కష్టపడితే రాష్ట్రసాధన జరిగిందో గుర్తుపెట్టుకోవాలి. తాత్కాలిక మాటలు నమ్మి శాశ్వత ప్రయోజనాలు ఒదులుకోకూడదు. రెచ్చగొట్టే మాటలుగాక, చేతల్లో తమ నిబద్ధత, నిజాయితీ చూపిన పార్టీనే గెలిపించాలి.
2014 నుంచి హైదరాబాద్ ఏ రకంగా అభివృద్ధి చెందిందో నిశితంగా గమనించాలి. ఎవరు అధికారంలో ఉన్నా అన్ని సమస్యలూ- ముఖ్యంగా దశాబ్దాల నిర్లక్ష్యం వల్ల జరిగినవి ఐదారేండ్లలో తీరవు. కానీ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం పనిచేస్తున్నదా లేదా అన్న విషయం గ్రహించాలి. మాటలు చెప్పటం తేలికే. చేతల్లో చూపటం చాలా కష్టం. నీళ్లు, కరెంట్, సామాజిక భద్రత, మహిళల రక్షణ, నేర నిరోధక చర్యలు, వ్యాపార వాణిజ్యాల విస్తరణ.. అలాగే భాష, కుల, మత, జాతి, లింగ వివక్ష లేని సమాజ నిర్మాణం విషయాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్దేశాలు, ఆచరణ ఎలా ఉన్నాయో పరికించాలి. త్యాగాల పునాదిమీద నిర్మించుకున్న రాష్ర్టాన్ని పరాయి పార్టీల చేతుల్లో పెట్టి బాధపడకూడదు. ముఖ్యంగా గమనించాల్సిన విషయం బీజేపీ భావజాలం. అది తెలంగాణ సంస్కృతికి పొసగదు. సనాతన ధర్మం నిర్దేశించినట్లు అందరూ అన్నదమ్ముల్లా బతికిన తెలంగాణ ప్రజలు మత విభేదాలతో కొట్టుకోకూడదు. పాతరోజుల కర్ఫ్యూలు వద్దు. ప్రశాంత జీవనం సాగించాలి. జాతీయ పార్టీలకు ఓట్లు తీసుకోవటమే ముఖ్యం కానీ ప్రాంతాల, రాష్ర్టాల అభివృద్ధి కాదు. 2014 నుంచి టీఆర్ఎస్ చేసిన ప్రజాహిత కార్యక్రమాలు, సమసమాజ నిర్మాణం దిశగా చర్యలను.. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ చేసిన ప్రజావ్యతిరేక పనులను పోల్చి చూడాలి. అంతిమంగా కేసీఆర్ చెప్పినట్లు అందరినీ ఆదరించే సమసమాజ నిర్మాణం జరగాలి.
త్యాగాల పునాదిమీద నిర్మించుకున్న రాష్ర్టాన్ని పరాయి పార్టీల చేతుల్లో పెట్టి బాధపడకూడదు. ముఖ్యంగా గమనించాల్సిన విషయం బీజేపీ భావజాలం. అది తెలంగాణ సంస్కృతికి పొసగదు. సనాతన ధర్మం నిర్దేశించినట్లు అందరూ అన్నదమ్ముల్లా బతికిన తెలంగాణ ప్రజలు మత విభేదాలతో కొట్టుకోకూడదు. పాతరోజుల కర్ఫ్యూలు వద్దు. ప్రశాంత జీవనం సాగించాలి. జాతీయ పార్టీలకు ఓట్లు తీసుకోవటమే ముఖ్యం కానీ ప్రాంతాల, రాష్ర్టాల అభివృద్ధి కాదు.
తాజావార్తలు
- ఢిల్లీ గణతంత్ర వేడుకలకు గిరిజన మహిళ..!
- టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లపై పర్మినెంట్ బ్యాన్!
- కూలిన ఆర్మీ హెలికాప్టర్.. పైలట్ మృతి
- కల్నల్ సంతోష్‌కు మహావీర చక్ర
- మేక పిల్లను రక్షించబోయి యువకుడు మృతి
- తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శం
- మహారాష్ట్రలో తొలిసారి రెండు వేలలోపు కరోనా కేసులు
- రాజస్థాన్‌లో పెట్రోల్ భగభగ.. లీటర్ @ రూ.100
- పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
- అభిమాని పెళ్లిలో సూర్య..ఆనందంలో వధూవరులు..!