గురువారం 21 జనవరి 2021
Editorial - Nov 27, 2020 , 01:56:00

సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి లేఖ

సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి లేఖ
  • అనుబంధం-XV

1993 జనవరి 7న సుప్రీంకోర్టు అభిప్రాయం కోసం రాష్ట్రపతి నివేదన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఫైజాబాద్‌ జిల్లా, ఫైజాబాద్‌ సదర్‌ తాలూకాలో, హవేలీ అవధ్‌ పరగణాలోని అయోధ్యలోని కోట రామచంద్ర గ్రామంలో అందరూ సర్వసాధారణంగా రామజన్మభూమి-బాబ్రీ మసీదు అని పిలిచే కట్టడం విషయంలో ఆ కట్టడ నిర్మాణానికి పూర్వం (బయటి, లోపలి ప్రహరీల మధ్య జాగాతో సహా) అక్కడ ఒక హిందూ దేవాలయం లేదా హిందూ కట్టడం ఉండేదా లేదా అనే వివాదం ఉత్పన్నమైనందునా.., ఆ స్థలం పైన చెప్పిన కోట రామచంద్ర గ్రామంలోని 159, 160వ నంబరు రెవెన్యూ ప్లాట్లలో ఉన్నందునా, సదరు వివాదం పౌర భద్రతను, దేశంలోని వివిధ మతాల మధ్య సామరస్యతను నిలబెట్టడంలో ఇబ్బంది కలుగజేసినందువల్లనూ..

అయోధ్యలో కొంత భూమిని సేకరించే ఆర్డినెన్స్‌ 1993 వలన ఆ స్థలం కేంద్ర ప్రభుత్వానికి సంక్రమించినందువల్లనూ.. అలా సదరు ఆర్డినెన్స్‌ వల్ల సంక్రమించినదానికి అతీతంగా కేంద్ర ప్రభుత్వం భారత సుప్రీంకోర్టు అభిప్రాయం పొంది, దానికి అనుగుణంగా వివాదానికి పరిష్కారం కనుగొనాలనుకొంటున్నందువల్లనూ.. ఇంతకుముందు తెలియజేసినదానిని బట్టి ఈ విషయం ప్రజా ప్రయోజనాన్ని సంతరింపజేసుకున్నది గనుక వెంటనే సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని పొందవలసి ఉన్నందునా.. భారత రాజ్యాంగంలోని  143వ అధికరణం (1)వ క్లాజు కింద నాకు అప్పగించబడిన అధికారాలను వాడుకుంటూ భారతదేశ అధ్యక్షుడనైన శంకర్‌దయాళ్‌శర్మ అను నేను ఈ కింది విషయాన్ని సుప్రీంకోర్టు పరిశీలనకు, అభిప్రాయానికి పంపుచున్నాను. 

రామజన్మభూమి- బాబ్రీ మసీదు నిర్మాణానికి పూర్వం (ఆ కట్టడపు వెలుపలి లోపలి ప్రహరీల మధ్య జాగాతో సహా) ఆ కట్టడం ఉన్నచోట ఏదైనా హిందూ దేవాలయంగానీ, లేదా ఏదైనా హిందూ ధార్మిక కట్టడం కానీ ఉండేదా? 

న్యూఢిల్లీ,1993, జనవరి 7. భారత దేశాధ్యక్షుడు

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo