బుధవారం 27 జనవరి 2021
Editorial - Nov 26, 2020 , 00:07:54

సంకటంలో సమాఖ్య

సంకటంలో సమాఖ్య

రాజ్యాంగం ఎంత మహత్తరమైనదైనా దాన్ని అమలు చేసేవారు చెడ్డవారైతే రాజ్యాంగం కూడా నిరుపయోగంగా మారుతుంది అని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నాయకత్వంలోని రాజ్యాంగ రూపకర్తలు ముందే హెచ్చరించారు. రాజ్యాంగం ఎంత బాగా లేకపోయినా దాన్ని అమలుచేసేవారు కనక ఉత్తములైతే అది సత్ఫలితాలిస్తుంది. గత ఏడు దశాబ్దాలుగా సామాజిక, ఆర్థిక లక్ష్యాలను సాధించడంకోసం భారత రాజ్యవ్యవస్థ పెట్టుకొన్న లక్ష్యాలే సమూలంగా మారిపోయినట్టు కనిపిస్తుంది.

  • నేడు రాజ్యాంగ దినోత్సవం

వలసవాద బంధనాలు తెంచుకొని భారతదేశం 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి స్వతంత్రమయింది. ఉత్కృష్ట న్యాయ, రాజకీయ కోవిదులు రాజ్యాంగ సభగా ఏర్పడి రూపొందించిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్‌ 26న స్వీకరించగా,  1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. ఆయా తేదీలు మళ్ళీ మనం పునరావలోకనం, ఆత్మపరిశీలన చేసుకోవడానికి అవకాశం ఇస్తాయి. అది భవిష్యత్‌ నిర్దేశానికి ఉపకరిస్తుంది. రాజ్యాంగం ఎంత మహత్తరమైనదైనా దాన్ని అమలుచేసేవారు చెడ్డవారైతే రాజ్యాంగం కూడా నిరుపయోగంగా  మారుతుంది అని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నాయకత్వంలోని రాజ్యాంగ రూపకర్తలు ముందే హెచ్చరించారు. అది ఎంత బాగా లేకపోయినా అమలుచేసేవారు కనక ఉత్తములైతే సత్ఫలితాలిస్తుంది. గత ఏడు దశాబ్దాలుగా సామాజిక, ఆర్థిక లక్ష్యాల సాధనకు భారత రాజ్యవ్యవస్థ పెట్టుకున్న లక్ష్యాలే సమూలంగా మారిపోయినట్టు కనిపిస్తున్నది. 

అంతర్జాతీయంగా వీస్తున్న గాలులు దేశంలో అనేక మార్పులకు దారితీశాయి. సంక్షేమ రాజ్యం నుంచి మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడానికి కారణమయ్యాయి. రాజ్యస్వభావం, అమలు విధానాలూ మారిపోయాయి. 1990 నుంచి మొదలైన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్‌పీజీ) మానవ జీవితంలోని, సమాజంలోని సకల అంశాలను సమూలంగా మార్చేసింది. ఈ అంశాన్ని రుజువుచేయడానికి ఒకే ఒక్క ఉదాహరణ చాలు. కొవిడ్‌-19ను ఎదుర్కోవడానికి టీకా మందు తయారుచేయడానికి ప్రైవేటురంగం మీదే ఎక్కువగా ఆధారపడవలసి వస్తున్నది. రాష్ర్టాలను సంప్రదించకుండానే కేంద్రం వ్యవసాయరంగానికి సంబంధించిన చట్టాలు చేసి ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నదనే విమర్శలొస్తున్నాయి. రైతులకు గిట్టుబాటు ధర అందేట్టు చేయడం, ప్రైవేటు పెట్టుబడులను, సాంకేతికతను ప్రోత్సహించడానికే ఈ చట్టాలు తీసుకొచ్చామని కేంద్రం వాస్తవానికి ముసుగు కప్పుతున్నది. నిజానికి ఇది రాష్ర్టాల పాత్రను దిగజార్చడానికే అన్న వాదనలూ ఉన్నాయి. అలాగే ఉమ్మడి జాబితాలోని విద్యుత్తుపై కేంద్రం చట్టం తీసుకొస్తానంటున్నది. 

ఈ చట్టం వస్తే రాష్ర్టాలు డిస్కమ్‌లను నియంత్రించే, సబ్సిడీలు ఇచ్చే అవకాశం పోతుంది. సుప్రీంకోర్టు అభిప్రాయం ప్రకారం ఫెడరలిజం మన రాజ్యాంగ మౌలిక లక్షణం. జీఎస్టీ ద్వారా సమకూరే ఆదాయాన్ని కేంద్రం, రాష్ర్టాలు పంచుకోవాలి. కానీ కొవిడ్‌-19 నివారణకు డబ్బు వెచ్చించే రాష్ర్టాలు లోటు పూడ్చుకోవడానికి రుణాలు తీసుకోవాలని కేంద్రం సూచిస్తున్నది. ఇది కచ్చితంగా ప్రస్తుతం పోటీతత్వంగల ఫెడరలిజం ఉన్న దశలో సహకారాత్మక ఫెడరలిజానికి విఘాతం కలిగిస్తున్నది. కొవిడ్‌-19 పౌరుల జీవించే హక్కు, విద్య, జీవనోపాధి, ఆరోగ్య భద్రత, సామాజిక భద్రత వంటి వాటిపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. సత్వరన్యాయం, ఉచిత న్యాయ సహాయం అందకుండా పోయాయి. 

ఉత్తమ ఆదర్శాలు, వాటిని సాధించే సామర్థ్యం, అటువంటి పౌరులు శ్రేష్ఠత కోసం శ్రమించడం వంటి అంశాలు ఒక జాతిని నిర్మిస్తాయి. జాతిపిత మహాత్మాగాంధీ పేదరికం, అనారోగ్యం, అజ్ఞానం, దుర్నీతి లేని స్వతంత్ర భారతావని ఏర్పడాలని కలగన్నారు. రాజ్యాంగంలోని 51ఎ అధికరణంలో పొందుపరచిన ప్రాథమిక విధులను ప్రతి పౌరుడు తనకున్న విజ్ఞత, శక్తి మేరకు సత్యనిష్ఠతో నిర్వర్తిస్తానని సంకల్పించుకొంటే ఆ కల కార్యరూపం దాల్చుతుంది. అన్నిటికన్నా ముందు ప్రతి పౌరుడు పాటించవలసిన మొదటి విధి మన పౌరసత్వానికి మూలమైన రాజ్యాంగాన్ని, దాని ఆదర్శాలను, రాజ్యాంగ వ్యవస్థలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించడం, వాటికి కట్టుబడి ఉండటం ఆవశ్యకం. హక్కులు, స్వేచ్ఛల గురించి మాత్రమే కాకుండా విధుల సంస్కృతిని గురించి కూడా అందరూ గుర్తెరగాలి. ఒక ప్రభుత్వ అధికారి లేదా       ఉద్యోగి అధికార దర్పంతో, రాజకీయ నాయకుల ప్రాపకంతో సామాన్యుల పట్ల నిర్దయగా వ్యవహరించడం కూడా రాజ్యాంగబద్ధతకు ప్రమాద సంకేతమే. ఇప్పుడు మనం గతకాలపు భయాలు, భవిష్యత్తు ఆశల మధ్య ఊగిసలాడుతున్న ప్రపంచంలో ఉన్నాం. రాజ్యాంగంలో నిర్దేశించిన నియమాలను అతిక్రమించకుండా వాటిని తూచా తప్పకుండా పాటించి దాని గౌరవాన్ని కాపాడగలగాలి. 

వ్యాసకర్త: ఉస్మానియా న్యాయ కళాశాలలో ప్రొఫెసర్‌

డాక్టర్‌ జీ బీ రెడ్డి 


logo