శనివారం 28 నవంబర్ 2020
Editorial - Nov 22, 2020 , 00:01:11

పతనమే నరకం!

పతనమే నరకం!

శుకయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రునితో ఇలా అన్నాడు- రాజా! వివేకవంతుడైన విరాగి తన హృదయంలోనే స్వయంసిద్ధుడు (స్వయంభువు)గా అనాదిగా విరాజిల్లువాడు, ఆత్మ స్వరూపుడు- కనుకనే ప్రియతముడు, నిత్యుడు, సత్యుడు, భగవంతుడు అయిన వాసుదేవుని సేవిస్తాడు. ఆ సేవ వల్ల కలిగే ఆనందాన్ని అనుభవిస్తూ అతడు సంసారకారణమైన అవిద్య- అజ్ఞానం నుంచి అచిరకాలంలోనే విముక్తి పొందుతాడు.

మూలశ్లోకంలో ‘ప్రియః’ అన్న పదం ఉన్నది. ఆనందస్వరూపుడైన పరమాత్మ అందరికీ ప్రియుడు. అన్నిటికంటే ప్రియుడు.ఎందుకని? అంటే సాక్షాత్‌ ఆత్మ (సెల్ఫ్‌) కనుక. ‘ప్రియస్య చ సేవా సుఖరూపైవ’- ప్రియుడైన స్వామికి చేయుసేవ సర్వదా సుఖరూపమే కదా! శ్రీధర పండితుని ఈ వ్యాఖ్యను అనుసరిస్తూ పోతన అమాత్యుడు కూడా ‘తదీయసేవానుభవానందంబున’ అని తెనిగించాడు.

శుకుడంటాడు- రాజా! ‘యజ్జీర్యత్యపి దేహేస్మిన్‌ జీవితాశా బలీయసీ’- దేహం నానాటికి జీర్ణించిపోతున్నా దేహధారికి జీవితాశ పెరుగుతున్నదంటే అది ‘ఆత్మ’ప్రియమైనదగుట వల్లనే. కస్తూరి మృగం శరీరంలోనే కస్తూరి ఉన్నట్లు ఆనందస్వరూప పరమాత్మ మన హృదయ అరవిందం (కమలం) లోనే ఉన్నాడు. ‘హృది అయం ఇతి హృదయం’- ఈ ఆత్మ హృదయంలో ఉన్నది అని ఛాందోగ్య ఉపనిషత్తు ‘హృదయ’ శబ్దానికి నిరుక్తం (నిర్వచనం) చెప్పింది. ఇలా తెలుసుకొన్నవాడు ప్రతిదినమూ స్వర్గాన్ని (బ్రహ్మానందాన్ని) పొందుతాడని ఫలశ్రుతి కూడా పలికింది. ఇది ఎవరికి వారు అనుభవంలో తెలుసుకోదగిన ప్రత్యక్ష ఫలం! కనుక, ‘అంతర్ముఖుడైతేనే అంతర్యామి బోధ’- ఇది సిద్ధాంత వాక్యం. మన మనోబుద్ధులు అటువైపు తిరిగితే చాలు- ‘ఆనందో బ్రహ్మ!’- ఆనందమే ఆనందం. అనాత్మ ప్రపంచం ఆత్మ (బ్రహ్మ) రూపంగా అనుభవానికి రాగా అన్ని అనర్థాలకు కారణమైన అవిద్య తనంత తానే అంతరించిపోతుంది.

మ. ‘హరి జింతింపక మత్తుడై విషయ చింతాయత్తుడై చిక్కి వా

సరముల్‌ ద్రోసెడు వాడు కింకరగదా సంతాడితోరస్కుడై

ధరణీశోత్తమ! దండభృన్నివసన ద్వారోపకంఠోగ్రవై

తరణీ వహ్ని శిఖాపరంపరలచే దగ్ధుండు గాకుండునే?’

‘రాజా! శ్రీహరిని ధ్యానించక, పరలోక చింతన అనే మాటే లేకుండా, ఇంద్రియ సుఖాలు మరిగి విలువైన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నవానికి మరణానంతరం నరకంలో వక్షఃస్థలం (రొమ్ము) వ్రక్కలయ్యేట్టుగా యమదూతల గదాఘాతాలు తప్పవు. వాడు నరకద్వారం దగ్గరున్న వైతరణీ నదిలో పడి దాని దారుణమైన అగ్నిజ్వాలలకు మలమల మాడి బూడిద కాకుండా ఉంటాడా?’ అని పద్యభావం. ఇందులో అమాత్యుడు పోతన ఆలంకారిక శైలిలో క్లిష్టమైన పదాల దీర్ఘ సమాసం ద్వారా వైతరణీ నదిలో పడేవారి భయంకర వేదనను బీభత్సంగా ధ్వనింపచేశాడు. 

క. ‘మొత్తుదురు గదల, మంటల

కెత్తుదురడ్డంబు, దేహమింతింతలుగా

నొత్తుదు రసిపత్త్రికలను

హత్తుదురు కృతాంత భటులు హరి విరహితులన్‌.’

‘రాజా! హరి చింతన లేని పాపాత్ములను యమభటులు గదలతో చితక బాదుతారు. మంటల్లో పడదోస్తారు. శరీరాలను రంపాలతోను, కరకు కత్తులతోను ముక్కలు-ముక్కలుగా ఖండిస్తారు’. ఈ కందపద్యం అమూలకం. పోతన పెంపు. ఆ పుణ్యశీలికి ఉన్న పాపభీతికి, నీతి-నియతి పట్ల ఆయనకున్న ప్రీతికి, భక్తిలేని మతిహీనులకు పట్టే గతికి అద్దం పట్టే పద్యాలివి. ‘నరకం న్యరకం నీచైర్గమనమ్‌'- పరమార్థంలో దుర్లభమైన మానవజన్మను దుర్వినియోగపరచుకొని పతనం చెందటమే నరకం. ‘అసుర్యానామతే లోకా అంధేన తమసావృతాః’- అంటుంది ఈశావాస్యోపనిషత్తు. జ్ఞాన ప్రకాశానికి నోచుకోని ఘోరమైన అజ్ఞానాంధకారంతో ఆవరింపబడిన నీచ, నికృష్టమైన శ్వాన (కుక్క), సూకర (పంది), కాక, ఘూక (గుడ్లగూబ), క్రిమికీటకాది జన్మలే నరకాలు. ‘కోవాస్తి ఘోరో నరకః?’- భయంకరమైన నరకమంటే ఏదో చెప్పండని శిష్యులడగగా, శంకరులు ‘స్వదేహః’- నీ దేహమే నరకమని చెప్పారు. ‘దేహమే నేను’ అను సంకల్పమే నరకమని తేజోబిందు ఉపనిషత్తు. సనాతన ధర్మానుసారం సృష్టిలో 84 లక్షల ప్రాణుల దేహాలు ఉన్నాయి కనుక (చతురశీతి లక్షాణి నరకాస్సంతి ఖేచర!) 84 లక్షల నరకాలూ ఉన్నవని మహావిష్ణువు గరుడపురాణంలో గరుత్మంతునితో అన్నమాట. పురాణాలు వర్ణించే రౌరవ, తామిస్ర, కుంభీపాకాది నరకలోకాలు అదృశ్యాలు- పరోక్షాలు. కాని, ఈ దేహాలన్నీ ప్రత్యక్ష నరకాలు! ‘దేహమే నేను’ అను భావమే కాలసూత్రము, మహావీచి, అసిపత్రవనము అనే నరకాలు (నారదపరివ్రాజకోపనిషత్తు). ‘సంసృతిరేవ వైతరణీ’- సంసారమే వైతరణి అని అన్నాడు శ్రీధరాచార్యుడు. ‘వితరణం దానం తేన తేర్యతే’- వితరణమనగా దానం- గోదానం. ఆ ఫలంతో, బలంతో సులభంగా దాటబడుతుంది కాన వైతరణి. అందుకే ధర్మశాస్త్రం ‘గోదానం’ విధించింది. ఇది కర్మకాండలోని ద్రవ్యరూపమైన, భౌతికదానం. వ్యక్తి జీవించి ఉండగానే ‘గో’- అనగా తన ఇంద్రియాలను ఇందీవరశ్యామునికి- శ్రీకృష్ణునికి దానం ఇచ్చుకోగలిగితే, వానికి వైతరణీ భయం లేదు, వైవస్వత (యమ) భయమూ లేదు. ఇది జ్ఞాన-భక్తిరూపం. కాన పారమార్థికం. రెండురకాల దానాలు సాధిస్తే అధికస్య అధికం ఫలం! ‘క్రోధమే యముడు, అత్యాశ- దురాశే వైతరణి, బ్రహ్మవిద్యయే కామధేనువు. సంతోషం- తృప్తియే నందన వనం’- అని నీతిశాస్త్రం. ‘తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకము’- అని సుమతీ శతక సూక్తి.

శుకుడంటాడు- రాజా! సంసారులకు కర్మ, జ్ఞాన, ధ్యాన, తపో, యోగాది మోక్షమార్గాలు ఎన్నో ఉన్నాయి. కాని, సులభమైనది భక్తిమార్గం. పూర్వం బ్రహ్మదేవుడు వేదాలను ధర్మబుద్ధితో మూడుమార్లు పరిశీలించి, పరమాత్మ పట్ల అనన్య ప్రేమా-భక్తిని కలిగించేదే సర్వశ్రేష్ఠమైన మార్గమని, అదే భక్తియోగమని నిర్ణయించాడు. ఇట్టి భక్తి స్థిరపడటానికి భగవత్‌ కథా శ్రవణం, నామస్మరణ కీర్తనలు ఎంతగానో తోడ్పడతాయి. నరేంద్రా! భాగవత- భక్తుల సాంగత్యం భగవత్‌ భక్తివర్ధకం. ధనం ఆశించే దరిద్రుడు ధనవంతుని ఆశ్రయించాలి గాని, తనవంటి మరో దరిద్రుని దేబురిస్తే దైన్యం పోతుందా? అలాగే, భక్తి సంపన్నులైన భక్తులను ఆశ్రయిస్తే భక్తి సమృద్ధిగా లభిస్తుంది. సాక్షాత్‌ భగవంతుడు కూడా భావ బుభుక్షువు, భక్తి భిక్షువు! ఆయన పరమ భాగవతుల ప్రేమాశ్రువుల కొరకు పరితపిస్తూ ఉంటాడు. వారి పాదధూళి తన మీద పడితే తాను పవిత్రుడవుతాడని పరమాత్మ వారి వెంటపడతాడట మౌనంగా! ‘భగవాన్‌ భక్త భక్తిమాన్‌'- భగవంతుడు భక్తులకు భక్తుడు అంటుంది భాగవతం! భక్తి అంత మహిమాన్వితం. కాన, భగవదర్చన కన్నా భాగవతార్చన మిన్న. ఇది భక్తిశాస్త్రంలో ఉన్న నిగూఢరహస్యం. కాంచనచేలుడు- కృష్ణుడు కుచేలుని బ్రహ్మరథం పట్టటమే ఈ ఆదర్శానికి నిదర్శనం.

తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ

98668 36006