శనివారం 28 నవంబర్ 2020
Editorial - Nov 22, 2020 , 00:01:11

కవితకు ప్రియమైనవాడు

కవితకు ప్రియమైనవాడు

మనుషుల కోసం, వాళ్ల పచ్చని జీవితం కోసం కలలుగని పలవరించి తన జీవితాన్ని ప్రేమించినంతగా మనిషిని ప్రేమించే మనసు కవికి మాత్రమే ఉంటుంది. శ్రమైక జీవులకోసం ఆర్తిపడటం కంటే గొప్ప గౌరవం కవిత్వానికి ఏం ఉంటుంది. కవిత్వానికి ఆ గౌరవాన్ని ఆపాదించి పెట్టినవాడు, ఎండవెన్నెల్లో రైతుకూలి శరీరం వినిపించే శ్రమ సంగీతాన్ని వినగలిగిన గొప్ప కవి దేవిప్రియ.

స్ఫురద్రూపి, మృదుస్వభావి, అనంతమైన జ్ఞాన సంపద, తెలుగు ఇంగ్లిష్‌ సాహితీ విషయాలు అనర్గళంగా చెప్పగలిగే విషయసేకరణ ఆయన ప్రధాన ఆకర్షణలు. గుండెలోతులను తడిమే చక్కని కవిత్వం చెప్పినా, రాజకీయ వ్యంగ్య బాణాలు సంధించినా ఆయనెప్పుడూ ప్రజలవైపునే మాట్లాడారు. ‘రన్నింగ్‌ కామెంటరీ’ పేరిట ఆయన రాసిన ఎనిమిది చిన్న లైన్ల వ్యంగ్య కవితలతో పత్రికల సర్క్యులేషన్లే పరుగులు తీసేవి.

తెలుగు సాహిత్య చరిత్రలో దిగంబర కవిత్వం రేపిన దుమారం తర్వాత అందులోని కొంత వాతావరణాన్ని దూరం పెట్టి పైగంబర కవులు 1970వ దశకంలో తెరపైకి వచ్చారు. దిగంబర కవిత్వానికి ఉన్న సిద్ధాంత రాహిత్యం, బూతును పక్కన పెట్టి, మనిషిని అజెండాగా చేసుకొని పైగంబర కవిత్వం పురుడు పోసుకుంది. వారిలో ముఖ్యుడు దేవిప్రియ. ఓల్గా, కిరణ్‌బాబు, సుగంబాబు, కమలాకాంత్‌లతో కలిసి పైగంబర కవిత్వ ఉద్యమానికి పునాదులు వేశారు. యుగ సంగీతం, యుగ చైతన్యం అనే సంకలనాలను ఈ మిత్రబృందం విడుదల చేసింది.

ఇటు జర్నలిస్టుగా, కవిగా, సినిమా రచయితగా ఆయన పలు సాహితీ అవతారాలను ఎత్తారు. ఎక్కడున్నా ఆయన ప్రధాన వస్తువు మనిషే. ప్రముఖ సినీ దర్శకుడు బి.నర్సింగరావుతో కలిసి రంగులకల, మాభూమి, దాసి లాంటి సినిమాలకు పనిచేశారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చరిత్ర సృష్టించిన దాసి సినిమాకు స్క్రీన్‌ప్లే దేవిప్రియనే రాశారు. గద్దర్‌పైన ‘యుద్ధనౌక గద్దర్‌' అనే డాక్యుమెంటరినీ కూడా తీశారు. అమ్మచెట్టు, గరీబుగీతాలు, నీటిపుట్ట, తుఫానుతుమ్మెద, అరణ్య పురాణం, పిట్టకూడా ఎగిరిపోవాల్సిందే, మొదలైన ఆయన రచనలన్నీ ప్రత్యేకమే. వీటితో పాటు కొన్ని అనువాద రచనలు కూడా చేశారు. ఆధునిక భారత ముఖచిత్రాన్ని ‘గాలిరంగు’ కవిత్వంగా మలిచి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డును కూడా అందుకున్నారు.

దేవిప్రియ కవిత్వంలో వస్తువు గంభీరంగా ఉండి, అందమైన శిల్పంతో ఒక తత్వ సంభాషణలాగా ఉంటుంది. వ్యంగ్యంగా రాసిన కవిత్వమైనా మనసును కుదిపేస్తుంది. మసీదు మెట్ల మీదో, సరయూ నది స్నానఘట్టం దగ్గరో చెయ్యి చాచి కూలబడిన ఫకీరుల, యాచకుల కళ్లలో ఘనీభవించిన బీభత్సం సామ్రాజ్యవాదంగా గుర్తించగలిగే సామాజిక తాత్తికత దేవిప్రియది. జర్నలిస్టుగా కూడా ఆయన సుదీర్ఘ ప్రయాణం చేశారు. ప్రజావాహిని, నిర్మల లాంటి పత్రికలలో మొదలైన ఆయన పాత్రికేయ జీవితం ప్రజాతంత్ర, జ్యోతి, మనోరమ మొదలైన పత్రికలతో పాటు ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఉదయం, హైదరాబాద్‌ మిర్రర్‌ పత్రికలకు విస్తరించింది. టివి చానల్స్‌కు సీనియర్‌ ఎడిటర్‌గా కూడా సేవ చేశారు. తెలుగునాట జరిగిన పలు ఉద్యమాలలో దేవిప్రియకు అనుబంధం ఉన్నది. తెలంగాణ పోరాట కాలంలో ఆయన బేషరతుగా తెలంగాణ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. శబ్ద ప్రధానమైన, సున్నితమైన ఆయన అక్షరాల వరుసల్లాగే తనుకూడా హాయిగా ప్రవహించే నదిలా ఉండేవారు. ఇంకా ఎన్నో రచనలతో ఈ నేలను సాహిత్య సంపన్నం చేయవలసినవారు ఇలా నిష్క్రమించడం బాధాకరం.

- డా.చెమన్‌, 9440385563