మంగళవారం 19 జనవరి 2021
Editorial - Nov 01, 2020 , 00:17:08

పదమూడో ఆళ్వార్‌ కథ

పదమూడో ఆళ్వార్‌ కథ

తెలంగాణలో  ప్రజాసాహిత్యానికి పాదులు వేసి ప్రాణం పోసినవాడు వట్టికోట ఆళ్వారుస్వామి. తెలంగాణ ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదని... దానికి ప్రత్యేక చరిత్ర, భాష, సంస్కృతి, జీవన సరళి వుందని ఆనాడే నిరూపించాడు. అంతటి గొప్ప సృజనకారుడయిన వట్టికోటకు తన ‘అగ్నిధార’ను అంకితం చేస్తూ... ‘అసలు ఆళ్వారులు పన్నెండు మందే/ పదమూడో ఆళ్వార్‌ / మా వట్టికోట ఆళ్వారుస్వామి/ నిర్మల హృదయానికి నిజంగా అతడు ఆళ్వార్‌/... అతని కలం వజ్రాయుధం/అతనిది న్యాయపథం’ అని దాశరథి రాసారు. ‘అబద్ధాసురుని పట్ల తల్వార్‌ మా ఆళ్వార్‌' అంటూ కాళోజీ తన గుండెకు హత్తుకున్నారు.

వఆనాటి ఫ్యూడల్‌ వ్యవస్థలో అణిచివేత దోపిడీల తీరుతెన్నుల్ని చూపిస్తూనే, అందుకు వారు చేసే కుట్రలూ కుతంత్రాల్నీ ‘ప్రజల మనిషి’ నవలలో అత్యంత వాస్తవికంగా చూపిస్తాడు. మతమార్పిడులు, వాటిని నిలువరించడానికి చేసిన ప్రయత్నాలనూ వివరించాడు. కంఠీరవ అనే సామాన్య వ్యక్తి, ప్రజల మనిషిగా ఎదిగిన క్రమం ఈ నవలలో గొప్పగా చిత్రీకృతమైంది. వట్టికోట ఆళ్వారుస్వామి, ప్రజల మనిషిలో 1935-40ల మధ్య నిజాం ప్రాంత తెలంగాణ జన జీవితాన్ని వాస్తవికంగా చిత్రించాడు. 

ట్టికోట ఆళ్వారు స్వామి జీవనయాత్ర వైవిధ్య భరితంగా సాగింది. సాంప్రదాయ విద్య లేకున్నా తెలంగాణా నవలకు కొత్త దారి చూపాడు. కథా రచయితగా విశేష కృషి సలిపాడు. 1915 నవంబర్‌ 1న నకిరేకల్‌ దగ్గర్లోని మాధవరం గ్రామంలో జన్మించిన వట్టికోట 12వ ఏటనే తండ్రిని కోల్పోయాడు. కంచినేపట్టి సీతారామారావనే ఉపాధ్యాయుడికి వంట చేసిపెడుతూ ఆయన వద్ద చదువు నేర్చుకున్నాడు. అనంతరం కందిబండ గ్రామానికి చెందిన నారపరాజు రాఘవరావు చెంతకు చేరాడు. నారపరాజు సోదరులు తమ తండ్రి జ్ఞాపకార్థం ‘సీతారామా గ్రంథాలయాన్ని’ ఏర్పాటు చేయడంతో... పుస్తకాలు, పత్రికలు చదవడం పట్ల ఆసక్తి పెరిగింది. 1933లో  హైదరాబాదుకు మారి, గోలకొండ పత్రికలో ప్రూఫ్‌ రీడర్‌గా చేరాడు.

పత్రిక ఆఫీసులో చేరాక ఆయన జీవన దృక్పథమూ, సామాజిక అవగాహనా వైశాల్యమూ మారిపోయాయి. కొంతకాలానికి తిరిగి రాఘవరావు వద్దకు వెళ్లి అక్కడి గ్రంథాలయంలో పఠనంతోపాటు రచనా వ్యాసంగాన్ని కూడా ఆరంభించాడు. రాఘవరావు కుటుంబం తరచూ బెజవాడ వెళ్తూ వుండటం, వారితోపాటు వెళ్లిన వట్టికోట అక్కడే వెల్‌కం హోటల్‌లో సర్వర్‌గా చేరాడు. ఆ కాలంలోనే ఆంగ్లభాష నేర్చుకున్నాడు. రెండేళ్లపాటు అక్కడ పనిచేయడంతో వట్టికోటకు అనేక సామాజిక అంశాలతో పాటు మనుషుల్ని, రాజకీయాల్ని అర్థం చేసుకోవడంతో నవ్యదృక్పథం ఏర్పరిచిందనే చెప్పుకోవాలి. తర్వాత తిరిగి హైదరాబాద్‌ చేరిన వట్టికోట, అక్కడ ఉన్న నారపరాజు కుటుంబానికి వంట చేసిపెడుతూ ఆంగ్లభాషా అధ్యయనాన్ని కొనసాగించాడు. అప్పుడే వివిధ ప్రజా సంఘాలతో, సాహితీవేత్తలతో వట్ట్టికోటకు పరిచయాలు కలిగాయి. కొంతకాలం ‘తెలుగు తల్ల్లి’ పత్రిక నిర్వహణ బాధ్యతల్నీ నిర్వహించాడు. 1938లో ‘దేశోద్ధారక గ్రంథమాల’ను ఆరంభించాడు.


1942లో క్విట్‌ ఇండియా ప్రేరణతో సత్యాగ్రంలో పాల్గొన్న వట్టికోటను నిజాం ప్రభుత్వం అరెస్టు చేసి ఏడాది పాటు సికిందరాబాద్‌ జైలులో వుంచింది. అక్కడే కమ్యునిస్టు నాయకుల సిద్ధాంతాలతో ప్రభావితుడయ్యాడు. జైలునుంచి విడుదల కాగానే ఆంద్రమహాసభ ఆర్గనైజర్‌గా హైదరాబాద్‌ శాఖ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1944లో నిజాం రాజ్య ప్రధాని మీర్జా ఇస్మాయిల్‌, కమ్యునిస్టులపై ఉక్కుపాదం మోపాడు. ఫలితంగా వట్టికోటను అరెస్ట్‌ చేసి రెండేళ్లపాటు సంగారెడ్డి, గుల్బర్గా, హైదరాబాద్‌ తదితర ప్రాంత జైయిల్లు తిప్పారు. ఆ కాలాన్ని ఆయన సాహిత్య అధ్యయనానికి వినియోగించుకున్నారు. అదే కాలంలో అంటే 1950లో వట్టికోట ఆళ్వారుస్వామి తన ‘జైలు లోపల’ కథల్ని రాసాడు. తర్వాత తెలంగాణ వాస్తవికతను అత్యద్భుతంగా ఆవిష్కరిస్తూ ‘ప్రజల మనిషి’, ‘గంగు’ నవలలు రాసాడు. ఆయన జీవితంలోని  నిబద్ధత ఆయన రచనల్లో నిర్దిష్ట వాస్తవికతకు తోడ్పడ్డాయి. ఆయన రచనల్లో కాలమూ, సమాజమూ, మనుషులూ పరిణామం చెందే క్రమాన్ని చూస్తాం. ఇక ఆయన రెండవ నవల ‘గంగు’ తెలంగాణ విమోచనోద్యమం ప్రభావంతో కమ్యునిస్టు పార్టీవైపు వెళ్ళిన ఒక యువతి జీవితాన్ని చిత్రిస్తుంది. ‘గంగు’లో వట్టికోట ఆళ్వారుస్వామి నాటి రాష్ట్ర కాంగ్రెస్‌ తీరుతెన్నుల్నీ, వర్గ స్వభావాన్నీ స్పష్టంగా చిత్రించాడు. అయితే గంగు నవలని ఆయన పూర్తి చేయలేక పోయారు. ఆయన కథల్లో గ్రామీణ జీవన పరిణామాలూ, మనుషుల మనస్తత్వాలూ చిత్రించాడు.  

మొత్తం మీద వట్టికోట రచనలు, ఆ కాలం నాటి రాజకీయ సామాజిక వ్యవస్థల్ని, మనుషుల మధ్య సంబంధాలనీ విశ్లేషిస్తూ విమర్శించిన రచనలుగా చెప్పుకోవచ్చు. 1961లో ఆయన మనల్ని విడిచివెళ్లినా... అమూల్యమైన సాహితీ వారసత్వాన్ని అందించి మరీ వెళ్లారు.

-వారాల ఆనంద్‌  9440501281

( నవంబరు 1న వట్టికోట జయంతి సందర్భంగా )