శుక్రవారం 22 జనవరి 2021
Editorial - Nov 01, 2020 , 00:17:06

దేవతలు గూడా

దేవతలు గూడా

‘ఊరికి దూరం కాటికి దగ్గర

నా వైద్యానికి అంత ఖర్చొద్దురా’ అని

అమ్మ గోలపెట్టినప్పుడు

మనం ఏ దిక్కున తలపెట్టి

గాంభీర్యాన్ని నటించాలి

రోజూ కీచులాడే సగపుటావిడ

ఆసుపత్రి పడకమీద ఆలోచనల్లో పడి

‘వంట అసలే రానివాడివి

హోటల్లోనైనా సరిగ్గా తిను’ అన్నప్పుడు

ఉబికివచ్చే నీళ్లను కన్నీళ్లనే అంటారా

నుమాయిష్‌లో అందమైన 

ఆటబొమ్మలను చూసి

గంతులేసిన చిన్నపిల్లకు మన జేబు గుర్తొచ్చి

‘ఇప్పుడొద్దులేనాన్న’ అని సర్దుకున్నప్పుడు

పిల్లలే మనకన్నా ఎదిగిపోయారా అని

కళ్లల్లో ఉబికివచ్చే జలపాతాన్నేమంటారు

అత్తగారింటికీ అమ్మగారింటికీ నడుమ

పూలతీగమీద ఊయలాడుతున్న బిడ్డ

ఏదో ఒకరోజు  

‘నాన్నా, మా ఇంటికెళ్తా’నన్నప్పుడు

లోలోపల కరిగే అంతరంగపు జల పేరేమిటి

అన్నిసార్లూ కష్టాలే

మనల్ని కరగదీస్తాయని చెప్పలేం

దేవతలుగూడా సమయానుసారంగా

మనల్ని ఏడిపించగలుగుతారు

- ఏనుగు నరసింహారెడ్డి

8978869183


logo