బుధవారం 25 నవంబర్ 2020
Editorial - Oct 31, 2020 , 00:21:12

దుబ్బాక పొల్లగాడిగా చెప్తున్నా..

దుబ్బాక పొల్లగాడిగా చెప్తున్నా..

నేను జాతీయవాదినే. దేశమంటే ప్రేమ, గౌరవం.. అభిమానం ఉన్నది. కానీ అంతకంటే ముందు నేను తెలంగాణ ముద్దుబిడ్డను. తెలంగాణ వాదిని. రాష్ట్ర అభివృద్ధిని, వికాసాన్ని కోరుకునే వ్యక్తిని.‘జననీ జన్మభూమిశ్చ..’ అన్నాడు శ్రీరాముడు. అంటే..‘నువ్‌ పుట్టిన ప్రదేశాన్ని.. నీ వాళ్లను, చుట్టూ ఉన్న సమాజాన్ని గౌరవించుకున్న తర్వాతే ఇంకేదైనా’ అని. ఎంతెత్తుకు ఎదిగినా, ఎక్కడున్నా మన ధ్యాసంతా పుట్టిన నేలమీదే ఉంటది. అంతేకానీ.. భావోద్వేగాలను రెచ్చగొడితే మారిపోయే మనస్తత్వాలు కావు తెలంగాణ ప్రజల మనసులు. మన అభివృద్ధిని కోరుకుంటూ ఆదుకునే చేతుల్ని తుంచేసుకునే బాపతులం మనం కానేకాదు. మనుషులం నెమ్మదే..మనసూ వెన్నలాంటిది.

తెలంగాణ యువతలో ఏదో చేయాలి, ఏదో సాధించాలన్న తపన ఉంటది. భావోద్వేగాలు, ఆవేశం ఎక్కువ. అలా అని ఉద్వేగాల ఆధారంగా నిర్ణయం తీసుకుందామా? ఆరేండ్ల కిందట తెలంగాణ ఎట్లుంది, ఇప్పుడెట్లుంది.. తెలంగాణలో రోడ్లెంట సాగునీటి కాల్వలను ఊహించినమా? మరిప్పుడు? మన కండ్లముందే అవన్నీ సాకారమైనయ్‌. ఒకసారి రీల్‌ వెనక్కితిప్పి గుండెలపై చేయి వేసుకొని చూస్తే తెలుస్తది. దండుగనుకున్న వ్యవసాయాన్ని పండుగ చేసిన్రు. రాష్ట్రం వచ్చినంక వివిధ శాఖల్లో లక్ష మందికి ప్రభుత్వ ఉద్యోగాలొచ్చినయ్‌. వందల ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు తరలొచ్చినయ్‌. లక్షల మందికి ఉపాధినిచ్చి ఆ కుటుంబాల్లో వెలుగులు నింపినయ్‌. ఇదంతా తెలంగాణ వచ్చినంక అయిన అభివృద్ధి. కానీ మరోవైపు కేంద్రంలోని మోదీ సర్కార్‌ ఆరేండ్లలో ఏమిచ్చింది? ఇప్పటిదాకా యువత కోసం మోదీ ప్రవేశపెట్టి.. ఉద్యోగాలు కల్పించిన పథకం ఒక్కటైనా ఉందా? ఇది నా స్కీమ్‌.. దేశ ప్రజలందరికీ ఉపయోగపడిన పథకం అని ఒక్కటైనా చూపించగలరా? భావోద్వేగాలను వాడుకొని ఓట్లడగటం తప్పితే.. ఒక నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికతో యువతకు చదువు, ఉపాధి, ఉద్యోగం, నైపుణ్య శిక్షణ ఇప్పించడం లాంటివి ఏమైనా చేశారా? మోదీ తెచ్చిన ఈ పథకం వల్ల ఉద్యోగం తెచ్చుకున్న, ఉపాధి పొందిన అని తెలంగాణలో ఒక్కరైనా చెప్పగలరా? మోదీ సర్కార్‌ చేస్తున్నదేమిటంటే ప్రజల ఎమోషన్స్‌ పెట్టుబడిగా వాటిని వాడుకోవటం, యువతను రెచ్చగొట్టడం. 

ఒకప్పుడు దేశంలో 10 మహారత్నాలు, 14 నవరత్నాలు, 74 మినీ రత్న సంస్థలు సహా 300కు పైగా ప్రభుత్వరంగ సంస్థలుండేవి. యువతకు లక్షల్లో ఉపాధి కల్పించేవి. కానీ ఇప్పుడు? బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసీ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లాంటి ఉపాధి కల్పించే సంస్థలన్నింటినీ మోదీ ప్రైవేట్‌పరం చేస్తున్నారు. ఫలితంగా లక్షల ఉద్యోగాలు పోతున్నయ్‌. 

బయటి నుంచి పిల్లలను తీసుకొచ్చి, కీకలు పెట్టించినంత మాత్రాన దుబ్బాక యువకులు ఆ మాయలో పడుతారని బీజేపీ భ్రమిస్తున్నది. కానీ అది జరుగని పని. బీజేపీ విషపు వలలో పడేందుకు ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. తెలంగాణపై బీజేపీకి ఎంత ప్రేమ ఉందో ‘ఒక ఓటు రెండు రాష్ర్టాలు’ అని చెప్పి మాట తప్పినప్పుడే తేలిపోయింది. 

ఇవాళ గాంధీని ప్రవచిస్తున్న బీజేపీకి గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం గుర్తుందా? కనీసం మహాత్ముడు చెప్పిన పాలనా వికేంద్రీకరణ యాదికుందా? గాంధీ పుట్టిన రాష్ట్రం నుంచి వచ్చి, ప్రధానిగా ఉన్న మోదీ.. పరిపాలనా వికేంద్రీకరణ ఎందుకు పక్కనపెట్టారు? కేంద్రీకృత పాలనవైపు ఎందుకు పరుగులుపెడుతున్నారు? గాంధీజీ చెప్పిన బాటలో సీఎం కేసీఆర్‌ గ్రామాలను బలోపేతం చేస్తుంటే కేంద్రం రాష్ర్టాలకున్న అధికారాలు లాగేసుకోవడానికి ప్రయత్నిస్తున్నది! 

ఒకప్పుడు బీజేపీ అంటే విలువలకు ప్రతీక. ఇది వాజపేయి, అద్వానీ, మురళీమనోహర్‌ జోషీల నాటి బీజేపీయేనా? అలాంటి నాయకులు ఇప్పుడు బీజేపీలో ఎవరైనా ఉన్నారా? ఒకప్పటి బీజేపీ నేతలు దేశాభివృద్ధి కోసం పాటుపడితే, ఇప్పుడన్న నాయకులు అధికారమే పరమావధిగా.. రాజ్యంగ వ్యవస్థలను, సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం యువతలో భావోద్వేగాలను రెచ్చగొట్టి వాడుకుంటున్నారు. మోదీ ప్రభుత్వమే గనుక దేశాన్ని అభివృద్ధి చేసి ఉంటే.. ఉత్తరాది యువత దక్షిణాది రాష్ర్టాలకు ఎందుకు వలస వస్తున్నారు? గుజరాత్‌లో మోదీ అభివృద్ధి చేస్తే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వచ్చినప్పుడు అక్కడి మురికివాడలు కనిపించకుండా ఎందుకు ప్లాస్టిక్‌ షీట్లు  కప్పాల్సి వచ్చింది? 

ఆరేండ్లలో తెలంగాణ అభివృద్ధి జరగలేదని 

అనుకుంటే.. పాలమూరు వలసలు ఎలా ఆగినయ్‌. లక్షల మంది ఉత్తరాది యువత ఐటీ ఉద్యోగం కోసం, లేబర్‌ పనికోసం హైదరాబాద్‌ వైపు ఎందుకు చూస్తున్నట్లు?  గుజరాత్‌ నుంచి కూడా వేల సంఖ్యలో ఉపాధి కోసం భాగ్యనగరానికి ఎందుకు వస్తున్నట్లు? బీవండి, ముంబై నుంచి తెలంగాణ చేనేత కార్మికులు ఎందుకు తిరుగుబాట పట్టినట్లు? సీఎం కేసీఆర్‌ ముందుచూపు వల్ల దండుగనుకున్న వ్యవసాయం పండుగయింది. ఊర్లలో 30 శాతం జనాభా పెరిగింది. మరి గ్రామాలకు, వ్యవసాయ రంగానికి మోదీ సర్కారు ఏం చేసింది?

యువత ఆవేశాన్ని రెచ్చగొట్టి తమకనుకూలంగా ఉపయోగించుకోవాలని బీజేపీ చూస్తున్నది. వాళ్లకు మన ఓట్లు కావాలి. ఆ ఓట్లతో అధికారంలోకి రావాలి. కానీ మన అభివృద్ధి మాత్రం వాళ్లకు పట్టదు. యువత కోసం ఏం చేశారని బీజేపీకి జై కొట్టాలి? కేవలం ఎమోషనల్‌ కామెంట్స్‌.. సోషల్‌మీడియాలో పెట్టే పోస్టింగుల కోసం ఆదరించాలా? బయటి నుంచి పిల్లలను తీసుకొచ్చి, కీకలు పెట్టించినంత మాత్రాన దుబ్బాక యువకులు ఆ మాయలో పడుతారని బీజేపీ భ్రమిస్తున్నది. కానీ అది జరుగని పని. బీజేపీ విషపు వలలో పడేందుకు ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. తెలంగాణపై బీజేపీకి ఎంత ప్రేమ ఉందో ‘ఒక ఓటు రెండు రాష్ర్టాలు’ అని చెప్పి మాట తప్పినప్పుడే తేలిపోయింది. 

మనం దేశాన్ని, దేశీయతను, జాతీయతను గౌరవిస్తం. అదే విధంగా మన ప్రాంతీయత తెలంగాణను గౌరవించుకోవాలి. ఎవరివల్ల మనకు మేలు జరుగుతదని ఆలోచించాలె. మనపై, మన మట్టిపై నిజంగా ఎవరు ప్రేమ ఉండి పని చేస్తున్నరో గుర్తించాలి. ఇంకో ఏడాది రెండేండ్లలో మల్లన్నసాగర్‌ నీళ్లు దుబ్బాక నేలను ముద్దాడుతయ్‌.  ఈ మట్టి, ఈ నేల, ఈ మనుషుల మీద ప్రేమున్నోడు మాత్రం మనతోనే చివరిదాకా తోడుంటడు. సహకరిస్తడు. ఎప్పుడో ఒకసారి ఎలక్షన్ల కోసం వచ్చేటోడు ఓట్లయిపోగానే కంటికి కనిపించడు. [email protected]