మంగళవారం 01 డిసెంబర్ 2020
Editorial - Oct 29, 2020 , 23:39:48

ప్రజలే కేంద్రంగా కొత్త చట్టం

ప్రజలే కేంద్రంగా కొత్త చట్టం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ పాలనను మరింత బలోపేతం చేయాలన్న దృష్టితో కొత్త రెవెన్యూ చట్టం-2020ను తీసుకొచ్చింది. సరైన చట్టంతో పాలనలోని లోపాలు సరిచేయటం ద్వారా ప్రజలు పడుతున్న ఇబ్బందుల నుంచి విముక్తి కలిగించినట్లయ్యింది. పాలనలో పారదర్శకత పెరగటం వల్ల అధికార యంత్రాంగం అంతా జవాబుదారీతనంతో బాధ్యతాయుతంగా పనిచేయటం సాధ్యమవుతుంది.

ప్రజలు భవిష్యత్‌లో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయవలసిన అవసరం ఉండదని చట్టం స్పష్టం చేస్తున్నది. రైతుకు సంబంధించిన భూ రికార్డుల వివరాలన్నీ ప్రభుత్వ వెబ్‌సైట్‌ అందుబాటులో ఉండనున్నాయి. ప్రభుత్వం చేపట్టే పలురకాల కార్యక్రమాలకు లబ్ధిదారులు పౌరులే కాబట్టి వారిని కేంద్రంగా చేస్తూ కొత్త రెవెన్యూ చట్టం రూపుదిద్దుకున్నది. కాలంచెల్లిన చట్టాలతో ప్రయోజనం ఉండదని అనుభవాలు తెలియజేస్తున్నాయి.

రెవెన్యూ పాలన ప్రక్షాళన చేయటమంటే మొత్తం పరిపాలనను ప్రక్షాళన చేయటంగానే భావించాలి. రెవెన్యూ పాలనకు ఉన్న ప్రాధాన్యం అలాంటిది. సమాజం నిరంతరం కాలానుగు ణంగా మారుతుంది. పాలనావ్యవస్థ కూడా కాలానుగుణంగా వచ్చే మార్పులను స్వీకరించవలసి ఉంటుంది. సమాజంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, సాంకేతికపరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అలాంటి మార్పులను వెంటనే పాలనా వ్యవస్థస్వీకరించి అందుకనుకూలంగా తననుతాను సంస్కరించుకొని ముందుకు సాగాలి. ఏండ్లుగా పరిపాలనావ్యవస్థ అనేక విధాలుగా లోపాలను సరిచేసుకుంటూ నూతనత్వాన్ని స్వీకరిస్తూ ప్రజలకు ఉపయోగపడుతున్నది. పాలనావ్యవస్థ ప్రజల ఆకాంక్షలకనుగుణంగా పని చేయాలంటే  మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తననుతాను మార్చుకోవాలి.

సమాజంలో ప్రజా సమస్యలను, వారి అవసరాలను అర్థం చేసుకొని వెంటనే పరిష్కరించగలిగినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. రెవెన్యూ పాలనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టి యాంత్రీకరణ చేయటం ద్వారా పని వేగంగా జరగనున్నది. భూ రికార్డులన్నీ ప్రభుత్వ వెబ్‌సైట్‌ ధరణి పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి. రైతులందరూ తమ భూమికి సంబంధించిన వివరాలను ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు. భూమి అమ్మకాలు, కొనుగోలు వంటి వ్యవహారాలు అన్నీ ఆన్‌లైన్‌ ద్వారా జరగటంతో ఆలస్యానికి, అవినీ తికి తావుండదు. సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి పనులు జరగటం వలన పాలనలో పారదర్శకత పెరుగుతుంది. దేశంలో ప్రాచీనకాలం నుంచి రెవెన్యూ పాలనకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది. 

మొగల్‌రాజు అక్బర్‌ కాలంలో తోడర్‌ మాల్‌ రెవెన్యూ సంస్కరణలు తెచ్చారు. భూమిని కొలవటం రికార్డుల నిర్వహణకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న రెవెన్యూ పాలన చాలావరకు బ్రిటిష్‌ వలస పాలనాకాలంలో రూపొందించబడినది. వలస పాలనాకాలంలో రెవెన్యూ శాఖ ప్రధానమైన శాఖగా కొనసాగింది. ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి ఆదాయన్ని పెంచుకోవ టమే నాటి రెవెన్యూ పాలన ప్రధాన ఉద్దేశంగా ఉండేది. గత పాలనావ్యవస్థలను అధ్యయనం చేస్తే అది మనకు స్పష్టమవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1971లో పీవీ భూ సంస్ఖరణలు చేపట్టారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 1985లో పటేల్‌, పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు.  స్వాతంత్య్రం వచ్చి డబ్భు ఏండ్లు గడిచిపోయినా ప్రజలకు ఉపయోగపడేవిధంగా, నేటికీ రెవెన్యూ పాలన సంస్కరించబడలేదు. ఎప్పుడో వలస పాలకులు వారి అవసరాల కోసం రూపొందించుకున్న రెవెన్యూ పాలన, రెవెన్యూ చట్టాలు నేడు మనకు ఎంతమా త్రం ఉపయోగకరం కాదు. వాటి ని సంస్కరించి పరిస్థితులకు అనుగుణంగా మార్చవలసిన అవసరం ఉన్నది. ఆ లక్ష్యంతోనే తరతరాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేవిధంగా ప్రభు త్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది.

నేడు భూమి ఆర్థికపరమైన, అతివిలువైన వస్తువుగా తయారైంది. రాష్ట్రంలో గ్రామీణ ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. భూమి ప్రధాన ఆదాయ వనరు. అలాగే గ్రామాల్లో అనేక రకాల వివాదాలకు భూమి ప్రధాన కారణమవుతున్నది. భూమితో పాటు వివాదాలు ఒకతరం నుంచి మరో తరానికి వారసత్వ సంపదగా వస్తున్నాయి. అనేక భూ వివాదాలు ఏండ్ల తరబడి పరిష్కారం కాకుండా, పరిష్కారమే లేని సమస్యలుగా  ఉండిపోతున్నాయి. దీనికంతటికీ రెవెన్యూ పాలన, రెవెన్యూ చట్టాలు సక్రమంగా, సమర్థవంతంగా లేకపోవడం వల్లనే అనేది సత్యం. అవినీతిలో రెవెన్యూ శాఖదే అధిక  వౌగస్వామ్యం. రెవెన్యూ శాఖ ఏండ్లుగా అవినీతిశాఖగా పేరును మూటగట్టుకున్నది. దీనికి రెవెన్యూ పాలనలో ఉన్న లోపాలే కారణం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రెవెన్యూ చట్టం వ్యవస్థాగతమైన మార్పులతో పాటు పని ప్రక్రియలో ఆచరణాత్మక మార్పులను తీసుకువస్తుందనటంలో సందేహం లేదు.  

పాలనా లోపాలు ప్రజల పాలిట శాపం కారాదు. పాలనలో పారదర్శకతను పెంచగలిగితే అధికార యంత్రాంగంలో జవాబుదారీతనాన్ని పెంచవచ్చు. తద్వారా పౌరులకు సుపరిపాలన అందించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూత న రెవెన్యూ చట్టం-2020 అధికారుల్లో బాధ్యతనూ జవాబుదారీతనాన్ని పెంచేందుకు దోహదం చేయనున్నది. అంతేకాకుండా పాలనకు, ప్రజలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి పాలన పై ప్రజల విశ్వాసాన్ని పెంపొందిస్తుం ది. రెవెన్యూ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవనున్నది.

(వ్యాసకర్త: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ప్రభుత్వ పాలనా శాస్త్రం నాగార్జున ప్రభుత్వ కళాశాల, నల్లగొండ) 

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన రెవెన్యూ చట్టం-2020 అధికారుల్లో బాధ్యతనూ జవాబుదారీతనాన్ని పెంచేందుకు దోహదం చేయనున్నది. అంతేకాకుండా పాలనకు, ప్రజలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించిపాలనపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.


నాగుల వేణుయాదవ్‌