మంగళవారం 01 డిసెంబర్ 2020
Editorial - Oct 29, 2020 , 23:39:28

దేశ సంపదను అమ్మడమేనా ఘనత!

దేశ సంపదను అమ్మడమేనా ఘనత!

సమాజానికి అవసరం లేని, నష్టాలతోనున్న సంస్థలను ప్రైవేటీకరించడం వేరు. కానీ విదేశీ ఆర్థిక సంస్థల సలహాల మేరకు ప్రైవేటీకరించాలనే నిర్ణయం తీసుకొని, పబ్లిక్‌రంగ సంస్థలను భ్రష్టు పట్టించడం సాగుతున్నది. లాభాల బాటలో ఉన్న అనేక సంస్థలు హఠాత్తుగా నష్టాలపాలై మూతపడిన ఉదాహరణలున్నాయి. ప్రైవేటు సంస్థలకు నష్టాలు వస్తే బెయిల్‌ అవుట్‌ పేర, ఇతర విధాలా ప్రజల సొమ్మును పంచి పెట్టే ప్రభుత్వాలు, సమాజానికి ఉపయోగపడే సంస్థలను ఆదుకోవడానికి వెనుకాడటమెందుకు?

నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనయని సామె త. మోదీ ఏదో ఉద్ధరిస్తాడనుకున్న ప్రజలకు చివరికి చిప్పే గతి అవుతున్నది. రైల్వే స్టేషన్‌ దగ్గర చాయ్‌ అమ్ముకున్నానని చెబితే ప్రజలు తమమనిషే అని నమ్మారు. కానీ ప్రధానిగా రైళ్ళనే అమ్మివేస్తాడని ఊహించలేదు. బీజేపీ అంటే స్వదేశీ పార్టీ కదా అని భావించారు. కానీ మోదీ ప్రభుత్వం దేశ ఆస్తులను విదేశీ కంపెనీలకు ధారపోసే స్థాయికి దిగజారుతుందనేది ఇప్పుడు అనుభవంలోకి వస్తున్నది. 

స్వాతంత్య్రోద్యమం సాగుతున్నప్పుడు, ఆనాటి నాయకులలో మన దేశ రాజకీయ- ఆర్థిక స్వభావ స్వరూపాల గురించిన స్పష్టత ఉన్నది. బ్రిటిష్‌ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన మనం మళ్ళా పెట్టుబడిదారీ వ్యవస్థకు దాసోహమనడంలో అర్థం లేదు.  అప్పటికే  కొన్ని  దేశాలలో ఏకపార్టీ నియంతృత్వ లక్షణాలు భయపెట్టినందున కమ్యూనిస్టు వ్యవస్థను స్వీకరించలేదు. ఆనాటి మహానుభావులు ప్రజాస్వామ్య, సామ్యవాద మేళవింపుతో మన రాజ్యవ్యవస్థను తీర్చిదిద్దారు. మిశ్రమ ఆర్థికవ్యవస్థ ఈ విధంగా ఏర్పడినదే. రైళ్ళు, విమానాలు, విద్యుత్‌ వంటి ఇంధనరంగం, బీమా మొదలైనవి ప్రభుత్వ రంగంలో ఉంటే, మరోవైపు కోరుకున్నవారికి వ్యాపార స్వేచ్ఛ కూడా లభించింది. డెబ్బయి ఏండ్లలో మన దేశం ఆర్థికంగా ఎదిగింది, సామాజిక శాంతి నెలకొన్నది. 

ప్రధాని మోదీ అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాల వల్ల ఇంతకాలం నిర్మించుకున్న వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఏర్పడ్డది. నెహ్రూ కాలంలో దేశ సంక్షేమం, సమాజ అవసరాల దృష్ట్యా ఏర్పాటు చేసిన పబ్లిక్‌ రంగ సంస్థలు కీలక పాత్ర పోషించాయి. కానీ ఆ తరువాత వచ్చి నకిలీ కాంగ్రెస్‌ వారసులు పబ్లిక్‌ రంగాన్ని కొంత భ్రష్టు పట్టించారు. నష్టాల జాతీయీకరణ, లాభాల ప్రైవేటీకరణ అనే విధానం అమలైంది.  మోదీ పక్కదారి పట్టిన ఆర్థిక రంగాన్ని మళ్ళా పట్టాల మీదికి ఎక్కించాల్సింది. కానీ పబ్లిక్‌రంగ లక్ష్యాలను నెరవేర్చడానికి బదులు పబ్లిక్‌ రంగ సంస్థలనే అమ్మకానికి పెడుతున్నారు. 

సమాజానికి అవసరమైన కార్యకలాపాలను ప్రభుత్వ రంగంలో నడపాలె. రైల్వే రంగం అటువంటిదే. ప్రజా జీవనానికి, పారిశ్రామికాభివృద్ధికి జీవం పోసే రవాణారంగమిది. దీనిని సమర్థవంతంగా నిర్వహించడం ప్రైవేటు సంస్థలకు సాధ్యం కాదు. ఇందుకు బ్రిటన్‌లో రైల్వే ప్రైవేటీకరణ ఒక ఉదాహరణ. ఈ భారీ సంస్థను ముక్కలు ముక్కలుగా ప్రైవేటీకరించవలసి వచ్చింది. ప్రయాణ చార్జీలు ఆకాశాన్నంటాయి. మౌలిక సదుపాయాలు  కరువయ్యాయి. ఇప్పుడు ఫ్రాంచైజింగ్‌ వ్యవస్థనే రద్దు చేశారు. ఒకప్పుడు యూరప్‌లోనే ఆదర్శ రైల్వే వ్యవస్థ అధ్వాన్నంగా మారింది. ఇప్పుడు అక్కడ ప్రయాణికులు జాతీయీకరణ జరపాలని కోరుతున్నారని సర్వేలలో వెల్లడైంది. 

వైమానికసేవలను కూడా విదేశీ సంస్థలకు అప్పగించే యోచనలో మోదీ ప్రభుత్వం ఉన్నది. అమెరికా వంటి దేశాలలో విమానాశ్రయాల ప్రైవేటీకరణ జరగలేదు. కానీ మన దేశంలో లాభాలలో ఉన్న విమానాశ్రయాలను ప్రైవేటీకరించారు. నష్టాలలో ఉంటే బాగు పరచడమే సమర్థత. కానీ ప్రైవేటు సంస్థలకు, మరీ విదేశీ కంపెనీలకు అప్పగించాలనడం సమర్థత అవుతుందా? వ్యవసాయం, పరిశ్రమలు పరిఢవిల్లాలంటే విద్యుత్‌ చౌకగా, నిరంతరంగా అందాలి. కానీ విద్యుత్‌ రంగాన్ని లాభాల వేట సాగించే ప్రైవేటు సంస్థలకు అప్పగించడం దేశ శ్రేయస్సు దృష్ట్యా శ్రేయస్కరం కాదు. ఎస్‌ఈబీలను బలోపేతం చేస్తే ప్రైవేటు రంగం కన్నా తక్కువ ధరకు విద్యుత్‌ అందించవచ్చునని కొన్ని దశాబ్దాల కిందటనే నిపుణులు సమావేశమై సంయుక్త ప్రకటన చేశారు. ఆనాడు కాంగ్రెస్‌ పాలకులు వినిపించుకోలేదు. ఇప్పుడు ఘనత వహించిన మోదీగారు కూడా పట్టించుకోవడం లేదు. 

సమాజానికి అవసరం లేని, నష్టాలతోనున్న సంస్థలను ప్రైవేటీకరించడం వేరు. కానీ విదేశీ ఆర్థిక సంస్థల సలహాల మేరకు ప్రైవేటీకరించాలనే నిర్ణయం తీసుకొని, పబ్లిక్‌రంగ సంస్థలను భ్రష్టు పట్టించడం సాగుతున్నది. లాభాల బాటలో ఉన్న అనేక సంస్థలు హఠాత్తుగా నష్టాలపాలై మూతపడిన ఉదాహరణలున్నాయి. ప్రైవేటు సంస్థలకు నష్టాలు వస్తే బెయిల్‌ అవుట్‌ పేర, ఇతర విధాలా ప్రజల సొమ్మును పంచి పెట్టే ప్రభుత్వాలు, సమాజానికి ఉపయోగపడే సంస్థలను ఆదుకోవడానికి వెనుకాడటమెందుకు? 

మోదీగారి ప్రైవేటీకరణ ఘోరానికి బలవుతున్న మరో సంస్థ (జీవిత బీమా సంస్థ) ఎల్‌ఐసీ. విదేశాల్లో ప్రైవేటు బీమా సంస్థలు మూతపడితే, సామాన్యులు నష్టపోతుంటారు. కానీ మన దేశంలో ప్రభుత్వ రంగంలోని ఎల్‌ఐసీ అంటే పాలసీదారులకు భరోసా. పాలసీదారుల క్లెయిములు సెటిల్‌ చేయడంలో ఎల్‌ఐసీకి మరే ప్రైవేటు సంస్థ సాటిరాదు. ప్రపంచంలోని డెబ్బయిఐదు శాతం దేశాల జీడీపీ కన్నా ఎల్‌ఐసీ పెద్దది. జనరల్‌ ఎలక్ట్రిక్‌, యాపిల్‌ కంపెనీ వంటి పారిశ్రామిక దిగ్గజాల కన్నా ఈ సంస్థ ఆస్తులు ఎక్కువ. పలు విదేశాల్లో కూడా ఎల్‌ఐసీ శాఖలున్నాయి. ఇన్ఫోసిస్‌, విప్రో, టీసీఎస్‌ వంటి ఐటీ సంస్థలు, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి పలు బ్యాంకులు, అల్ట్రాటెక్‌, ఏసీసీ, అంబుజా వంటి సిమెంట్‌ కంపెనీలు, మారుతి, మహీంద్రా, టీవీఎస్‌, బజాజ్‌ ఆటో, హీరో వంటి వాహన కంపెనీలు, బీహెచ్‌ఈఎల్‌, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌, గెయిల్‌, కాస్ట్రో ఇండియా వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు అన్నీ ఎల్‌ఐసీ వాటాలు కలిగి ఉన్నవే. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఆదానీ పోర్ట్స్‌తోపాటు బాటా చెప్పు ల కంపెనీ, బ్రిటానియా బిస్కట్‌ కంపెనీ- వంటి అనేక కంపెనీలలో ఎల్‌ఐసీ భాగస్వామ్యం ఎంతో కొంత ఉండితీరుతుంది. అనేక సామాజికాభివృద్ది కార్యక్రమాలకు ఎల్‌ఐసీ తోడ్పాటు ఉన్నది. ఎల్‌ఐసీలేని దేశాభివృద్ధిని ఊహించలేము. ఎల్‌ఐసీ ఈ స్థాయిలో అభివృద్ధి చెందడంలో లక్షలాది ఉద్యోగులు, ఏజెంట్ల శ్రమ ఉన్నది. ఈ సంస్థను అప్పనంగా చేజిక్కించుకోవాలని విదేశీ కంపెనీలు ఉబలాట పడుతున్నాయి. మోదీగారు దయతలుస్తున్నారు!

మోదీ గారి ప్రైవేటీకరణ జాబితా చాలా పెద్దగానే ఉన్నది. ఇటీవల కేంద్ర బడ్జెట్‌ సమర్పించిన సందర్భంగా ఎల్‌ఐసీని, ఐడీబీఐని ప్రైవేటీకరిస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, భారత్‌ పెట్రోలియం, బీఎస్‌ఎన్‌ఎల్‌ మొదలైన వాటిని విదేశీ సంస్థలకు కట్టబెట్టడానికి మోదీ సర్కారు సిద్ధంగా ఉన్నది. షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, కంటైనర్‌కార్పొరేషన్‌, ఈశాన్య విద్యుత్‌ సంస్థ, తెహ్రీడ్యాం అభివృద్ధి సంస్థ మొదలైనవన్నీ మోదీ జాబితాలో ఉన్నాయి. 

పబ్లిక్‌రంగం గొంతు కోయడం బాధాకరమే. అయితే అంతకన్నా మహా ఘోరం మరొకటి జరగబోతున్నది. అది మన వ్యవసాయ రంగాన్ని విదేశీ కార్పొరేట్‌ సంస్థల పాలు చేయడం. మోదీ సర్కారు తెచ్చిన వ్యవసాయ చట్టాలు ఇందుకు రంగాన్ని సిద్ధం చేసేవే. అరబ్బు, ఒంటె కథ తెలిసిందే. ఒంటె మొదట అరబ్బు గుడారంలో తల దూరుస్తానంటుంది. ఆ తరువాత కొంచెం కొంచెంగా చొరబడి అరబ్బును బయటకు గెంటేస్తుంది. విదేశీ సంస్థలు తేనె పూసిన కత్తులు. పది రూపాయల సబ్బును ఒక రూపాయికి అమ్ముతాయి. మిగతా కంపెనీలు మూతపడిన తరువాత వంద రూపాయలకు ధర పెంచుతాయి. అవి మొదట దేశీయంగా ఉన్న వ్యవస్థలను దెబ్బకొడతాయి. వ్యవసాయ రంగంలోనూ అంతే. ప్రపంచమంతటా వాటికి వ్యవసాయ క్షేత్రాలు, మార్కెట్‌ ఉంటాయి. ఏది లాభదాయకమనుకుంటే ఆ పంటలు చౌకగా పండించి అమ్ముకుంటాయే తప్ప, మన సమాజ అవసరాలు వాటికి పట్టవు. ఆహార కొరత ఏర్పడితే మలమల మాడిపోయేది మనమే. తల్లి బిడ్డలను చంపుకోదు అన్నట్టు ఆకలి చావులు, కాటకాలు ప్రకృతి సిద్ధంగా వచ్చేవి కావు. ప్రభుత్వ విధానాల వల్ల వస్తాయి. ఈస్ట్‌ ఇండియా కంపెనీ విస్తరించే కొద్దీ కరువు, ఆకలి మరణాలు ఏర్పడ్డాయి. రైతులు సంప్రదాయంగా దేశీ విత్తనాలు వాడటం మానేస్తే,  ఆ సంస్థల పేటెంట్‌ ఉన్న విత్తనాలే మిగులుతాయి. ఆ విదేశీ సంస్థలు ధనబలంతో, ప్రాబల్యంతో రైతులను న్యాయ వివాదాలతో ముప్పు తిప్పలు పెడుతాయి. కార్పొరేట్‌ కంపెనీల మూలంగా మన ఆహార స్వావలంబన దెబ్బతింటుంది. దేశ భద్రతకు ఆయుధం ఎంతో, ఆహార స్వావలంబన కూడా అంతే ముఖ్యం. 

మోదీ ఇవాళ ఉంటారు, రేపు దిగిపోతారు. కానీ దశాబ్దాలుగా మనం నిర్మించుకొని స్వావలంబన భారతం, నామరూపాలు లేకుండా పోయే ప్రమాదం పొంచి ఉన్నది. ప్రజాస్వామ్యంలో దేశాన్ని కాపాడుకోవలసినది ప్రజలే. 

పరాంకుశం వేణుగోపాల స్వామి