శుక్రవారం 04 డిసెంబర్ 2020
Editorial - Oct 28, 2020 , 07:28:19

బీజేపీ రాజకీయం!

బీజేపీ రాజకీయం!

తా చెడ్డ కోతి వనమెల్ల చెరిచిందని సామెత. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకుల నిర్వాకం ఇదేవిధంగా ఉన్నది. తమకు విజయావకాశాలు దరిదాపుల్లో లేవని పోలింగ్‌కు ముందే నిర్ధారణకు వచ్చిన ఈ ఘనులు నిరాశానిస్పృహతో విలువలకు పాత రేస్తున్నారు. సిద్దిపేటలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువు ఇంటిలో జరిపిన సోదాలో రూ.18.67 లక్షలు దొరకడంతో వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబ్బాక ఉపఎన్నికలో పంచడానికే బీజేపీ నాయకులు ఈ సొమ్మును దాచి ఉంచినట్టు తెలుస్తున్నది. తప్పుచేసి, తేలుకుట్టిన దొంగల్లా మౌనంగా ఉండి అధికారులకు సహకరించాలి. కానీ దొంగే.. ‘దొంగ దొంగ’ అని అరిచినట్టు బీజేపీ రాద్ధాంతం చేయడం ఆశ్చర్యంగా ఉన్నది. సోదాకు వచ్చిన అధికారులు తమ విధులను నిర్వర్తిస్తుంటే, బీజేపీ నాయకులు భారీఎత్తున అనుయాయులను పోగేసుకొని దౌర్జన్యానికి దిగారు. ఈ మూకలోని కొందరు అధికారులు స్వాధీనం చేసుకున్న సొమ్ములో అధికభాగం గుంజుకొని ఉడాయించారు. 

కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉన్నందుకైనా బీజేపీ నాయకులు చట్టాన్ని గౌరవించాలి. కానీ అక్రమాలకు పాల్పడుతూ, అధికారులపై దాడులు చేస్తూ, అరాచకం సృష్టించడమేమిటి? కిందిస్థాయిలో పార్టీ శ్రేణులు పెడదారిపడితే, వారిని చక్కదిద్దాలనే విజ్ఞత పైస్థాయి నాయకులకైనా ఉండాలి. కానీ పార్టీ అభ్యర్థి మొదలుకొని రాష్ట్ర నాయకుడి వరకు రెచ్చగొట్టే ధోరణితోనే వ్యవహరిస్తున్నారు. ఎప్పుడూ నీతులు వల్లించే కేంద్ర నాయకులు, ఇక్కడ తమ పార్టీ వారే సాగిస్తున్న అక్రమాలకు ఏమని సమాధానం చెబుతారు? దేశంలో చట్టం, న్యాయ మనేవి ఉన్నాయి గదా?  ఏవైనా అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా ఫిర్యాదులు చేయవచ్చు. కానీ చట్టాన్ని ధిక్కరించడం గొప్పతనమా? చేసిన నిర్వాకం చాలదన్నట్టు, వాస్తవాలను వక్రీకరించి, తప్పుడు దృశ్యాలను సృష్టించి సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం సాగిస్తున్నారు. రఘునందన్‌ రావు బంధువు ఇంటిలోనే సొమ్మును స్వాధీనం చేసుకున్నామని పోలీసు కమిషనర్‌ వీడియో సాక్ష్యాలతో వెల్లడించిన నేపథ్యంలో, ఇక బీజేపీ నేతలు ఏమని సమాధానం చెబుతారు? 

కేంద్రంలో సుపరిపాలన అందిస్తున్నామని చెప్పుకునే పరిస్థితి బీజేపీ నాయకులకు లేదు. మోదీ వ్యవసాయవిధానాల పట్ల రైతులు ఆగ్రహంగా ఉన్నారు. తెలంగాణలో ఈ పార్టీకి పునాదే లేదు. దుబ్బాక అభ్యర్థిని చూసి ఓటేసే పరిస్థితి అంతకన్నా లేదు. దీంతో అక్రమాలకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోతున్నారు. శామీర్‌పేట్‌ దగ్గర రూ. 40 లక్షల మేర డబ్బును తరలిస్తూ పట్టుబడ్డారు. ఒక బీజేపీ నాయకుడి నివాసంలో భారీ ఎత్తున చీరెలు, దుస్తులు బయటపడ్డాయి. ఇటువంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడితే ప్రజలలో చులకన కావడం మినహా ఫలితమేమీ ఉండదని ఆ పార్టీ నాయకులు ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది.