గురువారం 03 డిసెంబర్ 2020
Editorial - Oct 28, 2020 , 00:02:04

దుబ్బాకలో గులాబీ గుబాళింపు

దుబ్బాకలో గులాబీ గుబాళింపు

ఉద్యమగడ్డ దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి గులాబీ పరిమళాలతో జనం హారతులు పడుతున్నారు. ఊరు మనది.. వాడ మనది..  దుబ్బాక ఉద్యమ అడ్డా మనది.. కేసీఆర్‌ కారు మనది.. గులాబీ పార్టీ మనదే.. అంటూ

జనమంతా సుజాతక్కను లక్ష మెజార్టీతో గెలిపిస్తామని దండోరా మోగిస్తున్నారు.

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి ఆకస్మిక మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతున్నది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సుజాత బరిలో ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులకు డిపాజిట్లు రాని పరిస్థితి నెలకొన్నది. యావత్తు దుబ్బాక సమాజం అంతా సోలిపేట సుజాత వైపు నిలిచారు. నియోజకవర్గ పరిధిలోని ఏ గ్రామానికి వెళ్లినా సుజాతకే ఓటేస్తామంటూ మహిళలు, రైతులు, యువత  అన్నివర్గాల ప్రజలు బ్రహ్మర థం పడుతున్నారు. బతుకమ్మ, బోనాలు, మంగళహారతులు, డప్పు చప్పుళ్లతో గులాబీ ప్రచారం హోరెత్తిస్తున్నారు. దుబ్బాక ప్రాంత అభివృద్ధికి ఉద్యమ నేత దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి తుదిశ్వాస వరకు కృషిచేశారని, ఆయన ఆశయాలను కొనసాగించడానికి మీ బిడ్డగా ముందుకు వచ్చానని ఆశీర్వదించి లక్ష మెజార్టీతో గెలిపించాలని సుజాత ప్రజలను కోరుతున్నారు. ‘సీఎం కేసీఆర్‌ నా మీద పెట్టిన నమ్మకాన్ని, రామలింగారెడ్డి ఆశయాలను కొనసాగించాలని మీ ముందుకు వచ్చాను.. మీ ప్రేమకు అంకితమవుతా.. అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామ’ని పిలుపునిస్తున్నారు. భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. హరీశన్న అండదండలతో దుబ్బాకను అభివృద్ధి చేసుకుందామంటూ తనతో కలిసి నడువాలని ప్రజలను కోరుతున్నారు. 

టీఆర్‌ఎస్‌లోకి బీజేపీ, కాంగ్రెస్‌ నేతల భారీ చేరికలతో దుబ్బాక నియోజకవర్గం యావత్తు గులాబీమయమవుతున్నది. బీజేపీ మండల, గ్రామ స్థాయి నేతలు సైతం కారెక్కుతున్నారు. మరోవైపు  టికెట్‌ ఆశించి భంగపడిన మిరుదొడ్డికి చెందిన  బీజేపీ రాష్ట్ర నేత బీజేపీ అధిష్ఠానంపై తిరుగుబాటు చేయడంతో ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తున్నది. కేంద్రం తెచ్చిన కరెంట్‌ మీటర్ల లొల్లి బీజేపీ నేతల మెడకే చుట్టుకున్నది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ కేంద్రం తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు పెట్టినా సహించబోమన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, పార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 23 మంది బరిలో నిలిచినప్పటికీ టీఆర్‌ఎస్‌ కారు జోరుకు కుదేలవుతున్నారు.

ఎన్నికల ప్రచారాన్ని టీఆర్‌ఎస్‌ పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా కొనసాగిస్తున్నది. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలను ఇంటింటికీ వివరిస్తున్నారు. ఇంకా ఎవరైనా అర్హులైన పేదలుంటే ఎన్నికల తర్వాత అందేవిదంగా భరోసా కల్పిస్తున్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమకారులు నిత్యం గ్రామాల్లో ఉంటూ ప్రజల స్పందన, నాయకులు, కార్యకర్తల పనితీరును గమనిస్తూ.. తగు సూచనలు చేస్తున్నారు. ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చేస్తూ  ఉద్యమ వేగులు ప్రజల్లోనే ఉంటున్నారు. 

ఉద్యమ బెబ్బులిగా దుబ్బాక ప్రాంతంలో చెరగని ముద్ర వేసుకున్న దివంగత నేత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఉప ఎన్నికల బరిలో ఉండటంతో ఎన్నికకు ప్రాధాన్యం ఏర్పడింది. గత 2004 ఎన్నికల్లో రామలింగారెడ్డికి అండగా నిలిచిన నేతలు మధ్యలో ఆయా పార్టీల్లోకి వెళ్లిన వారు ఈ ఉపఎన్నికల్లో రామలింగారెడ్డి సతీమణి సుజాతకు అం డగా నిలవాలని నిర్ణయించారు. నియోజకవర్గంలో  మొత్తం 1,98,756 ఓట్లు ఉండగా ఆరేండ్ల కాలంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా నియోజకవర్గంలో మొత్తం 1,71,006 మంది లబ్ధి పొందుతున్నారు. ఇక సీఎం కేసీఆర్‌కు దుబ్బాకతో ప్రత్యేక అనుబంధం ఉన్నది. అయన దుబ్బాకలోనే చదువుకున్నారు. దుబ్బాక రామసముద్రం కట్టపై పద్యాలు నేర్చుకున్నారు. ఇక్కడి ప్రజలతో కేసీఆర్‌కు ఆత్మీయ అనుబంధం ఎక్కువ.  తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా,  బంగారు తెలంగాణ నిర్మాతగా సీఎం కేసీఆర్‌ చేపట్టే సంక్షేమ, అభివృద్ధి పథకాలే సోలిపేట సుజాతకు లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తుందనే అంచనాలున్నాయి.  

రామలింగారెడ్డి ఉద్యమనేతగా, జర్నలిస్టుగా, ప్రజానేతగా దుబ్బాక నియోజకవర్గంలోని ఇంటింటికీ పెద్దకొడుకు. చివరిశ్వాస వరకు ఇక్కడి ప్రజల కోసం పని చేశారు. ఆయన సహచరి సుజాత సైతం రామలింగారెడ్డి ఆశయాలను కొనసాగిస్తానని చెప్తుండటంతో ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. ఏదేమైనా దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాతకు లక్ష ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి రికార్డు నమోదు చేసే అవకాశం ఉన్నది.


- చిటుకుల మైసారెడ్డి

(వ్యాసకర్త:  జర్నలిస్ట్‌)