బుధవారం 02 డిసెంబర్ 2020
Editorial - Oct 28, 2020 , 00:02:03

పొలం దొరుకుతుంది

పొలం దొరుకుతుంది

నాకు నాలుగేండ్లున్నప్పుడు

మా తాత పొలం దున్నుతున్నప్పుడు

మా ఆయి మోసుకచ్చిన సద్ది తోడు

నేనూ ఒచ్చినోన్నే..

ఆ పొలమే ఇప్పుడు మాయమైంది!

అవ్వా నాయినల రెక్కల కష్టం

తిండిగింజలై మా కడుపులు నింపిన పొలం

నాకు పిల్లని లెంకచ్చి లగ్గం ఖరారు జేసిన పొలం

సెల్లి పెళ్ళికీ ఆసరై నిలవడ్డ పొలం

ఆ పొలమే ఇప్పుడు మాయమైంది!

నా కాళ్ళకంటిన బురద

నే పొలంగట్టునే కడిగేసుకుంటే

మా లచ్చిమి పట్టీల కంటిన బురద

రోజూ మా ఇంటిజాడ సూసుడే

ఆ బురద అంటిన పొలమే ఇప్పుడు మాయమైంది

పటేలు ఎవడి సెవిలోనన్న వూదిన మంత్రమో

రివాజైన యంత్రాంగపు మంత్రాంగమో

సగం అడవి పొలమేనంటూ పటేలు ఖాతాకెక్కింది

అడివినానుకుని వున్న నా పొలం అడవై పోయింది

అవును, నా పొలం మాయమైపోయింది

మాయమైన నా పొలం నిన్న నా కలలకచ్చింది:

తల్లి తెలంగాణ నా పెద్దన్న సేతికిచ్చిన కలం

దివీటియై ప్రకాశిస్తోంది

ఆ కలం చేసిన ఓ దస్తకత్‌ జమీను నావరించిన 

అంధేరాని ఊరవతలకి అపుడే తరిమేసింది

ఆ కలం చేసిన ఒక సంతకం

కొంగ్రొత్త భూసంస్కరణల కొత్త కాంతులీనుతోంది

ఆ వెలుగు జాడల నా పొలం నాకు తప్పక దొరుకుతుంది

జాడ లేని ధరణి జాడ ‘ధరణి’న లెక్క తేలుతుంది


- అశోక్‌ గుంటుక 99081 44099