మంగళవారం 01 డిసెంబర్ 2020
Editorial - Oct 26, 2020 , 23:16:07

కేసీఆర్‌ అన్నం, మోదీ సున్నం

కేసీఆర్‌ అన్నం, మోదీ సున్నం

కేసీఆర్‌ నాయకత్వాన తెలంగాణ ఆరేండ్లలోనే ఆకలి లేని రాష్ట్రంగా అభివృద్ధి చెందింది. నరేంద్ర మోదీ సహా పలువురు ప్రధానమంత్రుల 73 ఏండ్ల పాలన తర్వాత ప్రపంచ దేశాల‘ఆకలిసూచీ’లో ఇండియా 94వ స్థానానికి పడిపోయింది.

మోదీ కాలంలో 2015-19 ఇది మరింత పతనమైనటు ‘ఆకలి సూచి’ వెల్లడిస్తున్నది. ఆర్థిక వ్యవస్థల పెరుగుదలలు, శత కోటీశ్వరుల విజృంభణల గురించి సగర్వంగా చాటుకునే మన నేతలు మానవాభివృద్ధి సూచికలు, ఆకలి సూచీల గురించి నోటిమాటగానైనా ప్రస్తావించటం ఎప్పుడైనా విన్నామా? 

తెలంగాణలోని మొత్తం కోటి కుటుంబాల్లో చౌక ఆహారధాన్యం అవసరమైన 83 లక్షల కుటుంబాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ అందజేస్తున్నది. తలకు గత 5 కిలోల కోటాను కూడా 6 కిలోలకు పెంచింది.  కుటుంబసభ్యుల పరిమితిని తొలిగించింది. పంపి ణీ వేలెత్తి చూపలేని విధంగా సాగుతున్నది. నిజానికి కోటాకు అర్హతగల వారితో పాటు అర్హతలేని వారు కూడా ఎందరో ఈ ప్రయోజనం పొందుతున్నారు. మరొకవైపు, ఈ నెల 16న విడుదలైన ‘ప్రపంచ ఆకలి సూచి-2020’ప్రకారం, ఆకలిగొన్న పిల్లల విషయమై 107 దేశాల్లో సర్వే చేయగా ఇండియా 94వ ర్యాంకులో పరమ అథమ స్థానంలో నిలిచింది. 

పేదలు, పిల్లలు, స్వయంగా పండించే రైతులు, వ్యవసాయ కూలీలు ఆకలికి మాడటం మధ్యయు గాలలో, బ్రిటిష్‌ వలసపాలనలో ఎప్పుడూ ఉన్నదే. అందుకు కారణాలలోకి వెళ్లేందుకు ఇది సందర్భం కాదు కానీ, ఈ విధమైన ఆకలి బాధను తీర్చటం తమ లక్ష్యాలలో ఒకటని స్వాతంత్య్రోద్యమ నాయకత్వం ప్రకటించింది. స్వాతంత్య్రం తర్వాత చౌక ధరల ప్రజాపంపిణీ వ్యవస్థనైతే ఆరంభించారు గాని, అది విఫలమైంది. అందుకు ఒక కారణం దేశంలో ఆహార ఉత్పత్తి తగినంత పెంచకపోవటం కాగా, రెండవది పీడీఎస్‌ను సమర్థవంతంగా నిర్వహించటంలో వైఫల్యం. అందువల్ల, దేశంలో సాగు కు యోగ్యమైన భూమి, జలవనరులు పుష్కలంగా ఉండికూడా మనం ఆకలి దేశంగా మిగిలాం. హరి త విప్లవం ఈ సమస్యను పాక్షికంగానే తీర్చింది. ఆ మేరకు జరిగిన అధికోత్పత్తి,  అధిక దిగుబడి కూడా విధానాల లోపంవల్ల కొందరికి అధిక లాభాలను సంపాదించిపెట్టి, ఆకలి సమస్యను చాలావరకు అట్లాగే మిగిల్చింది. వలసపాలనల నుంచి మనతో పాటు విముక్తి చెందిన దేశాలు అనేకం సరైన విధానాలను అనుసరించి ముందుకు పోతుండగా, మన జాతీయస్థాయి పార్టీలు, పాలకుల దయవల్ల మనం నత్తనడకతో పోటీపడ్డాం. 

‘ఆకలి సూచీ’లో ఇండియా వెనుకబాటుతనం అనేక ఇతర సూచీలలోనూ వెనుకబాటుతనాన్ని ప్రతిఫలిస్తూ వస్తున్నది. ఉదాహరణకు మానవాభివృద్ధి సూచీలో మన స్థానం 120కి పైగా ఉంది. గమనించవలసిందేమంటే, ఆర్థిక వ్యవస్థ సైజులో చూస్తుండగానే పైపైకి పోతూ ఇప్పుడు 5వ స్థానానికి చేరాం.  మానవాభివృద్ధి సూచీలో చూస్తుండగానే కిందికిపోతూ 120కి మించి పతనమయ్యాం. ఇదంతా ఈ 21వ శతాబ్దానికి ప్రవేశించిన తర్వాత మరింత వేగం అందుకుంది. ఆర్థిక వ్యవస్థ సైజు పెరగటం ఎవరికి లాభిస్తున్నదో, మానవాభివృద్ధి సూచిలో పతనం ఎవరికి నష్టం చేస్తున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. 20వ శతాబ్దపు నాలుగోపాదం నుంచి మొదలుకొని ఇప్పటివరకు దేశాన్ని అన్ని పార్టీలు పాలించాయి. కాంగ్రెస్‌, బీజేపీ, వివిధ ఫ్రంట్‌లు, వామపక్షాలు, ప్రాంతీయపార్టీలు, కుల పార్టీలు. మానవాభివృద్ధికి సంబంధించిన అంశాలలో ఇందులో ఎంతో కొంత మినహాయింపు అయిన పాలకులను వేళ్లమీదనే లెక్కించగలం.  అందులో తక్కిన అంశాలను పక్కన ఉంచి ఆహార భద్రత-ఆకలికి సంబంధించి దేవరాజ్‌ అర్స్‌, ఎన్టీఆర్‌; ఆకలితో పాటు ఆరోగ్యం, చదువులకు సంబంధించి కామరాజ్‌ నాడార్‌, అన్నాదురైలతో మొదలైన తమిళనాడు పాలకులు గుర్తుకు వస్తారు. 

ఈ కొద్దిమంది అంతా ప్రాంతీయ పాలకులు కావటం గమనించ దగ్గది. వీరితో పోల్చగల విధానాలను అనుసరించిన వారెవరూ, ఏ పార్టీ నుంచి కూడా జాతీయ స్థాయిలో లేరు. అందరూ ధాన్యం లెవీలు సేకరించటం, ఫుడ్‌ కార్పొరేషన్‌ గిడ్డంగులలో నిల్వచేయటం, ఒక వైపు ఆకలి బాధ ఉన్నా ఆ నిల్వలు ముక్కిపోతుండగా సుప్రీంకోర్టు జోక్యంతో గాని పేదలకు పంపిణీ చేయకపోవటం వంటివన్నీ మనం చాలానే చూశాం.  మొత్తం మీద ఆర్థిక, సామాజిక విధానాల ఫలితాలు, వైఫల్యాల ఎడతెగని దుష్ప్రభావాల వల్ల మన మానవాభివృద్ధి సూచికలు, అందులో భాగంగా ఆకలి, చిన్న పిల్లల పరిస్థితి 73ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత ఇంకా అధ్వాన్నం గానే ఉంది. నినాదాలు చాలానే ఇచ్చిన నరేంద్రమోదీ కాలంలో (2015-19) ఇది మరింత పతనమైనట్లు పైన పేర్కొన్న  ‘ఆకలి సూచి’ వెల్లడిస్తున్నది. ఆర్థిక వ్యవస్థల పెరుగుదలలు, శత కోటీశ్వరుల విజృంభణల గురించి సగర్వంగా చాటుకునే మన నేతలు మానవాభివృద్ధి సూచికలు, ఆకలి సూచీల గురించి నోటిమాటగా నైనా ప్రస్తావించటం ఎప్పుడైనా విన్నామా? 

ఇటువంటి నేపథ్యంలో కేసీఆర్‌ ప్రభుత్వం కేవలం ఆరేండ్లలో సాధించినది కొట్టవచ్చినట్లు కన్పిస్తుంది. అందుకు సంబంధించిన లెక్కలు, వివరాలు అనేకం ఉన్నాయి. అవి ఎప్పటికప్పుడు వెలువడుతున్నయే అయినందున ఇక్క సవివరమైన జాబితాలు అక్కరలేదు. తెలంగాణ దేశానికే ధాన్యాగారమైందని సాక్షాత్తూ ఎఫ్‌సీఐ ఇటీవల ప్రకటించలేదా! అవి వైట్‌ కాలర్‌ సినికల్‌ మేధావులకు తప్ప అందరికీ కనిపిస్తున్నవే. ప్రస్తుత       చర్చ ‘ఆకలి సూచీ’ గురించి అయినందున దానికి పరిమితమై చెప్పు కోవాలంటే,  గత ఆరేండ్లలో జల    వనరుల అభివృద్ధి, ఇతోధికంగా ధాన్యం దిగుబడులు, వాటిని గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో సామాన్య జీవులకు పంపిణీ చేయటం వంటి చర్యలు ఈ రాష్ర్టాన్ని ఆహారభద్రతలో అగ్రగామి చేసి ఆకలిని తరిమే వేశాయి.